తిరుమల కొండలో అవినీతి అనకొండలు

Update: 2018-10-22 08:22 GMT

దేవుని సన్నిధిలో అక్రమాలు..... లడ్డూల విక్రయాల్లో దందా.... సిబ్బంది చేతివాటం.... దళారుల ఇష్టారాజ్యం..... దోచుకున్నోడికి దోచుకున్నంత.... కళ్లు మూసుకుంటున్న టీటీడీ.... ఇవి కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలోని బాగోతాలు... న్యాయంగా భక్తులకు అందాల్సిన లడ్డూలు పక్కదారి పడుతున్నాయి. రోజుకో అక్రమం తిరుమలలో వెలుగు చూస్తోంది. వరసగా జరుగుతున్న దందాలు ఆందోళన కలిస్తున్నాయి. తిరుమల లడ్డూ వితరణ కేంద్రంలో పని చేసే ఓ ఆపరేటర్ తిరుపతి నుంచి తిరుమలకు డ్యూటీకి వెళుతున్నాడు. టోల్ గేటు వద్ద సాధారణ తనిఖీలు నిర్వహించారు. అతని ద్విచక్ర వాహనంలో 100 లడ్డూలకు సంబంధించిన మాన్యువల్ టోకెన్లు లభించాయి. వైకుంఠం 1 వద్ద లడ్డూ టోకెన్ కౌంటర్ల సూపర్ వైజర్ తనకు ఇచ్చారని చెప్పాడు. దీంతో ఆ సూపర్ వైజర్ ను త్రిలోక్ సంస్థ దూర ప్రాంతానికి బదిలీ చేసింది. 

లడ్డూ వితరణ కేంద్రాల వద్ద 40 లడ్డూలు తీసుకువెళుతున్న ఓ వ్యక్తిని విజిలెన్స్ ఐడీ పార్టీ పట్టుకుంది. అన్ని లడ్డూలు ఎలా వచ్చాయని విచారించింది. తనకు లడ్డూ టోకెన్ కేంద్రాల వద్ద సూపర్ వైజర్ గా పని చేసే ఓ వ్యక్తి మాన్యువల్ టోకెన్లు ఇచ్చాడని చెప్పాడు. . దీనిపై ఆ సూపర్ వైజర్ ను అక్కడి నుంచి తొలగించి ఆఫీసుకు బదిలీ చేశారు. ఇటీవల వైకుంఠం 1 వద్ద ఉన్న ఓ టీ స్టాల్ లో 35 టోకెన్లను విజిలెన్స్ సిబ్బంది పట్టుకున్నారు.  అవి వైకుంఠం 1 నుంచి బయటికి వచ్చినట్లు గుర్తించారు. ఎవరు తెచ్చారు... వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారన్నది బయటికి రాలేదు. ఇవి కొన్ని ఉదహరణలు మాత్రమే. వైకుంఠం 1 నుంచి లడ్డూ టోకెన్లు యథేచ్చగా తరలిపోతున్నాయి. అదీ అత్యంత సులభంగా తేగలుగుతున్నారు దళారులు. 

కాలినడక భక్తులు, రూ.300 ప్రత్యేక దర్శనం భక్తులు వైకుంఠం-1 ద్వారా దర్శనానికి వెళుతుంటారు. క్యూకాంప్లెక్స్‌లోకి ప్రవేశించే ముందు….ఏటిసి పార్కింగ్‌ వద్ద ఏర్పాటు చేసిన స్కానింగ్‌ సెంటర్లలో టికెట్లను స్కానింగ్‌ చేస్తారు. అదేవిధంగా లడ్డూ టోకెన్లు ఇస్తారు. రూ.300 దర్శనం భక్తులకు లడ్డూలు కూడా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న టికెట్టుపైనే ఇస్తారు. స్కానింగ్‌ వద్ద వాళ్లకు ప్రత్యేకంగా లడ్డూ టోకెన్లు ఇవ్వరు. అందువల్ల ఇక్కడ టికెట్‌ స్కానింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు మాత్రమే ఉన్నాయి. సాయంత్రం 7 గంటల తరువాత 300రూపాయల  దర్శనం స్లాట్స్‌ ముగిసిపోతాయి. అప్పటి నుంచి ఆ స్కానింగ్‌ సెంటర్‌ ఖాళీగా ఉంటుంది. 

ఎలాంటి టోకెన్‌ లేనివారిని వైకుంఠం-2 ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు వైకుంఠం-2లోని షెడ్లన్నీ నిండిపోతాయి. అలాంటప్పుడు….వైకుంఠం-1లో కంపార్టుమెంట్లలోకి అనుమతిస్తారు. ఈ కంపార్టుమెంట్లలోకి వెళ్లాలంటే…స్కానింగ్‌ కేంద్రాల్లోకి వెళ్లి, అక్కడ లడ్డూ టోకెన్లు తీసుకుని వెళ్లాలి. రూ.300 స్కానింగ్‌ కేంద్రంలో  ఫింగర్‌ ఫ్రింట్‌ తీసుకోవడం, ఫొటో తీసుకోవడం వంటి సదుపాయాలు లేకపోవడం వల్ల….4 లడ్డూలు, 2 లడ్డూ టోకెన్లు సిద్ధంగా ఉంచుకుంటారు. వైకుంఠంలోకి ప్రవేశించే వారి నుంచి డబ్బులు తీసుకుని మాన్యువల్‌ టోకెన్లు ఇచ్చిపంపుతారు. ఇదే దళారులకు, అక్రమాలర్కులకు వరంగా మారింది. రద్దీ ఉన్నప్పుడు కచ్చితంగా మాన్యువల్‌ టోకెన్లు ఇస్తుంటారు. ఇటీవల మూడు నెలల పాటు రోజూ రద్దీ ఉండటంతో…దాదాపు రోజూ మాన్యువల్‌ టోకెన్లు ఇచ్చారు. 

మాన్యువల్‌ టోకెన్లు ఇస్తున్నారని తెలియగానే ఆ వార్త క్షణాల్లో తిరుమల మొత్తంగా ఉన్న దళారులకు, పోలీసులకు, సెక్యూరిటీ సిబ్బందికి…ఇలా అందరికీ తెలిసిపోతుంది. నిమిషాల్లో అక్కడికి వచ్చేస్తారు. టోకెన్లు తీసుకుంటారు. వాస్తవంగా అయితే…టోకెన్‌ తీసుకున్నవాళ్లు అలాగే కంపార్టుమెంట్లలోకి వెళ్లాలి. కానీ కుమ్మక్కు వ్యవహారంతో  బయటకు వచ్చేస్తున్నారు. అక్కడే తిరుగుతుంటే సూపర్‌వైజర్లు, త్రిలోక్‌ సిబ్బందికి అసలు అడ్డే ఉండదు. ఎలాంటి ఫింగర్‌ ఫ్రింట్స్‌గానీ, ఫొటోలుగానీ తీసుకోవాల్సిన అవసరం లేకపోవడంతో….టోకెన్లను సిబ్బందే సులభంగా బయటకు తరలించేస్తున్నారు.  టోకెన్‌ తీసుకుని బయటకు రాలేని దళారులు దర్శనానికి వెళతారు. అదే సాఫ్ట్‌వేర్‌ ద్వారా టోకెన్లు ఇస్తే….ఇలా లడ్డూల కోసమే వచ్చే దళారులను కంప్యూటరు పట్టిస్తుంది. అందుకే మాన్యువల్‌ ఇచ్చేటప్పుడు మాత్రమే దళారులు దర్శనాకి వెళుతుంటారు. మాన్యువల్‌ టోకెన్లు ఇచ్చారంటే…అక్కడ నుంచి ఆ రోజు రెండు వేల లడ్డూలకు పైగా అడ్డదారుల్లో తరలిపోతాయి. విజిలెన్స్‌, పోలీసు, ఎస్‌పిఎఫ్‌ తదితర సిబ్బంది కూడా ఈ దారిలో లడ్డూలు తీసుకోవడానికి అలవాటు పడ్డారు. దీంతో రాచమార్గంలా ఉన్న దీన్ని అడ్డుకోడానికి ఎవరూ పెద్దగా ఆసక్తిచూపడం లేదు.

Similar News