ఉగ్రరూపం దాల్చిన ఆయకట్టు రైతుల ఆందోళనలు

Update: 2018-08-06 12:14 GMT

శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టు గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎస్సారెస్సీ దగ్గర ప్రశాంతంగా ఉన్నా పరిసర గ్రామాల్లో మాత్రం పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దాంతో పోలీసులు పెద్దఎత్తున బలగాలను మోహరించారు. శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టుతోపాటు ఆయకట్టు గ్రామాల్లో 144 సెక్షన్‌ కొనసాగుతోంది. 
          
ఎస్సారెస్పీ నీటి విడుదల విషయంలో ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం మండిపడ్డారు. ఒక్క టీఎంసీ నీళ్లిస్తే పరిష్కారమయ్యే సమస్యను ప్రభుత్వం జఠిలం చేస్తోందని ఆరోపించారు. మొత్తం 21 గ్రామాలను జైలుగా మార్చేశారని కోదండరాం అన్నారు. అరెస్ట్‌ చేసిన అఖిలపక్ష నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసిన కోదండరాం గ్రామాల్లో 144 సెక్షన్ ఎత్తివేసి రైతులపై పీడీ యాక్ట్‌ తొలగించాలని కోరారు. ఇక ఎస్సారెస్పీ రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్తోన్న కోదండరామ్‌ను బిక్నూరు దగ్గర పోలీసులు అరెస్ట్‌ చేశారు.

శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టు దగ్గర పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ అన్నారు. రైతులు సంయమనం పాటించాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల ఆస్తుల రక్షణ కోసమే గ్రామాల్లో పికెటింగ్‌ ఏర్పాటు చేశామన్న సీపీ కార్తికేయ రైతుల అరెస్ట్‌ తమ ఉద్దేశం కాదన్నారు. ఇప్పటివరకు 4 కేసులు నమోదుచేసి పలువురని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. నిన్నటివరకు ఆర్మూరు సబ్‌ డివిజన్‌‌ వరకు ఉన్న 144 సెక్షన్‌ను నిజామాబాద్‌ పోలీస్ కమిషనరేట్‌ పరిధి మొత్తం అమలు చేస్తున్నట్లు సీపీ కార్తికేయ వెల్లడించారు.

శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 144 సెక్షన్‌ విధించిన పోలీసులు ప్రధాన రహదారుల వెంబడి అడుగడుగునా బలగాలను మోహరించారు. అలాగే గ్రామాల్లో ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రాకుండా పహారా కాస్తున్నారు. ముఖ్యంగా కాకతీయ కాలువ ఆయకట్టు పరిధిలోని మెండోర, ఏర్గట్ల, మోర్తాడ్‌, కమ్మర్‌‌పల్లి మండలాల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. అలాగే బాల్గొండ పరిధిలోని సుమారు 21 గ్రామాల్లో పికెటింగ్‌ కొనసాగుతోంది. రైతులు రోడ్లపైకి రాకుండా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. 

శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టులో ప్రస్తుతం 16 టీఎంసీలు నీళ్లు ఉండగా, కాకతీయ కాలువకు ఒక టీఎంసీ నీరు విడుదల చేయాలంటూ కొద్దిరోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. అయితే ఎస్సారెస్పీ నుంచి సాగునీటి విడుదల సాధ్యంకాదని, ప్రస్తుతమున్న నీళ్లు కేవలం తాగునీటి అవసరాలకే సరిపోతాయని ప్రభుత్వం తేల్చిచెప్పడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై మండిపడుతోన్న రైతులు తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. గ్రామాల్లో ఎక్కడికక్కడ ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి.
  
వర్షాభావ పరిస్థితులతో ఎండుతోన్న పంటలను కాపాడుకోవడానికి ఎస్సారెస్సీ నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని మాజీ మంత్రి సుదర్శన్‌ డిమాండ్ చేశారు. శ్రీరామ్‌సాగర్‌‌లో ప్రస్తుతం 16 టీఎంసీలు ఉన్నా అర టీఎంసీ నీటిని విడుదల చేయడానికి ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తోందని మండిపడ్డారు. గతంలో 5 టీఎంసీల నిల్వ ఉన్నా పంటలను కాపాడేందుకు సాగునీటిని విడుదల చేశామని గుర్తుచేశారు.

ఎస్సారెస్పీ దగ్గరకు ఎవరూ రాకుండా పోలీసులు ఇనుక కంచెతోపాటు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఇక ఎస్‌‌ఈ కార్యాలయం దగ్గర ఆందోళన ఘటనలో 21మంది రైతులపై కేసులు నమోదు చేశారు. అలాగే రైతులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కాంగ్రెస్‌ నేత అనిల్‌ను అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌ నివాసానికి తరలించారు. కమ్మర్‌పల్లి మండలం ఉప్లూర్‌లో ధర్నాకు ప్రయత్నించిన రైతులను పోలీసులు అడ్డుకోవడంతో రాజరాజేశ్వరాలయంలో వినతిపత్రం సమర్పించి నిరసన తెలిపారు.
 

Similar News