ప్రజా సమస్యలపై పోరాటం లేదు ప్రభుత్వ వైఫల్యాలపై గళమెత్తింది లేదు పార్టీ బలోపేతం పై ఆలోచన లేదు. అయితే పొత్తులు లేకపోతే వలసలు. ఇది తెలంగాణ టీడీపీ నేతల పరిస్థితి. పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్లు సైతం పార్టీ పట్ల అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ముందస్తు ఎన్నికల వార్తలతో ఇతర పార్టీలు గ్రామాల బాట పడితే టీడీపీ నేతలు మాత్రం నివాసాలకే పరిమితం అవుతున్నారు.
తెలంగాణ టీడీపీ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. బలమైన కేడర్ ఉన్నా వారిని నడిపించే నాయకత్వం లేకపోవడం పార్టీకి పెద్ద మైనస్ గా మారింది. గత ఎన్నికల తర్వాత వలసలతో పార్టీ బలహీన పడగా ఇప్పుడు నడిపించే నాయకుడు లేకపోవడంతో పార్టీ రోజు రోజుకు కుదేలైపోతోంది. అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని చెప్పినా తెలంగాణ తమ్ముళ్లు మాత్రం పెడ చెవిన పెడుతున్నారు. ఒకరిద్దరు నేతలు తమ అనుచరులతో అడపా దడపా హడావుడి చేస్తున్నారు తప్పితే ప్రభుత్వ వైఫల్యాలపై మాత్రం పోరాటాలు చేయడం లేదు. కనీసం ప్రజా సమస్యలపై గళమొత్తడం లేదు. దీంతో తెలంగాణ టిడిపి కేడర్ మొత్తం నిస్తేజంలో కూరుకపోయింది.
ముందస్తు ఎన్నికల వార్తలతో అన్ని పార్టీలు గ్రామాల బాట పట్టాయి. నిత్యం ఎదో ఒక సమస్యను తలకెత్తుకుని ప్రజల మధ్యే ఉండేందుకు ప్రయత్నిస్తున్నాయి బస్సు యాత్ర పేర కాంగ్రెస్, బీజేపీలు ఇప్పటికే రాష్టాన్ని చుట్టి వచ్చాయి. ఇక ఫ్రొఫెసర్ కొదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితి నిరుద్యోగులు, నిర్వాసితులు, రైతుల పక్షాన పోరాటాలు చేస్తోంది. జనాలను కదిలిస్తోంది. మరో వైపు అంతగా బలం లేని వామపక్షాలు కూడా పోడు భూములు, ప్రభుత్వ అవినీతి, డబల్ బెడ్ రూం ఇండ్లు, భూ పంపిణి, కౌలు రైతుల పక్షానా పోరాటాలు చేస్తున్నారు. కానీ టీ టీడీపీ నేతలు మాత్రం ఎలాంటి కార్యక్రమాలు చేయకపోవడంతో తెలంగాణ టిడిపి డల్ గా ఉంటోంది. పార్టీ జెండా మోసేందుకు కూడా కార్యకర్తలు ముందుకు రావడం లేదు.
రాష్ట పునర్విభజన చట్టంలోని హమీలను అమలు చేయాలని టీ టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. టిటిడిపికి తెలంగాణలో బలమైన కార్యకర్తలున్నారు కానీ వారిని నడిపించే నేతలే కరువయ్యారు. ఒకప్పుడు ఎంతో బలంగా ఉన్న తెలంగాణ టిడిపి ఈసారి ఎన్నికలు గట్టెక్క డానికి కొత్త ఆలోచనలు చేస్తోందా? ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని అడుగేయకపోతే పార్టీ భవిష్యత్తు కష్టమేననే ఆందోళనలో ఉన్నారు టి. టిడిపి నేతలు. కేసీఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ తో కలసి పోటి చేయాలని భావిస్తున్నారు. తమకి ఓటు బ్యాంకుగా ఉన్న సీమాంద్ర సెటిలర్ల ఓట్ల కోసమైనా కాంగ్రెస్ తమతో చేతులు కలుపుతుందనే భావనలో టీడీపీ నేతలున్నారు. ఒక వేళ ఏదైన కారణంతో పొత్తులు కుదరకపోతే పక్క పార్టీలోకి జంప్ చేయాలనే ఆలోచన చాలా మంది నేతల్లో ఉంది. అయితే టీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ లోకి వెళ్లాలనే భావనలో ఉన్నారు. సొంత బలం ఉన్న మాజీ ఎమ్మెల్యే, ఎంపీలను చేర్చుకునేందుకు అవతల పార్టీలు సైతం ఆసక్తి కనబరుస్తున్న సందర్బంలో టికెట్ ఖాయం చేసుకుని సైకిల్ దిగేయాలని యోచిస్తున్నారు నేతలు. రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లయిపోయినా టీడీపీకి ఉన్న సమైక్యాంధ్ర ముద్ర ఇప్పటికీ చెరిగిపోలేదు. ఆ ముద్ర చెరిపేలా తెలంగాణ అస్తిత్వాన్ని చాటుకునే విధంగా పార్టీ నేతలు ప్రయత్నం చేసినదీ లేదు. సొంతంగా పోటిచేసినా గెలిచే వాతావరణం లేదు. అందుకే టీడీపీ బలోపేతం కోసం ప్రయత్నం చేయకుండా అయితే పొత్తులు లేకపోతే వలసల మీద నేతలు నమ్మకం పెట్టుకున్నారని కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఒకప్పుడు బలమైన నేతలతో వెలిగిపోయిన తెలుగు దేశంలో ఇప్పుడు జల్లెడ పట్టి వెతికినా బలమైన నేతలు కనపడకపోవడం ఆపార్టీకి పెద్ద లోటే.