గల్ఫ్ ఓటర్లపై రాజకీయ పార్టీల డేగ కన్ను.. కార్మికుల ఓట్ల వర్షం ఎవరిపై కురుస్తుందో.?
గల్ఫ్ కార్మికుల ఓటు బ్యాంకు, పొలిటికల్ పార్టీల్లో దడ పుట్టిస్తోంది. దశాబ్దాలుగా చేసిన హామీలు, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోయినా, మరోసారి వారి ఓట్లను కొల్లగొట్టేందుకు అనేక ప్రణాళికలు రచిస్తున్నాయి పార్టీలు. దాదాపు 26 నియోజకవర్గాల్లో గెలుపోటములను శాసించే గల్ఫ్ కార్మికుల కుటుంబాలను ప్రసన్నం చేసుకునేందుకు, నేతలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకీ గల్ఫ్ ఓట్ల కోసం పార్టీల పయనం ఎలా ఉంది. ఏయే జిల్లాల్లో నిర్ణయాత్మక ఓటుగా గల్ఫ్ ఫ్యామిలీలున్నాయి.
కూటి కోసం, కూలి కోసం ఎడారి దేశాల వైపు వారి ప్రయాణం. తన వారి కష్టాల కన్నీళ్లను తుడిచేందుకు ఒయాసిస్‌ల కోసం పయనం. గిట్టుబాటు కాని వ్యవసాయం, యమపాశమవుతున్న రుణం, తనను నమ్ముకున్న వారి కడుపు నింపలేని దైన్యం. ఎందరో భారతీయులను గల్ఫ్ దేశాలవైపు తరుముతోంది. ఇసుకను పసిడిగా మార్చి, తన రెక్కల కష్టంతో ఆకాశహర్మ్యాలు నిర్మించి అగాథమైన అరబ్ చరిత్రను అజరామరం చేశారు భారతీయ కార్మికులు. ముఖ్యంగా లక్షలాదిమంది తెలంగాణ కార్మికులు, గల్ఫ్‌లో బతుకుతున్నారు. ఇప్పుడు ఆ గల్ఫ్ ఓటర్లను ఆకర్షించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి రాజకీయ పార్టీలు.
ఉత్తర తెలంగాణలో 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, గెలుపోటములను శాసించే సత్తా ఉన్న గల్ఫ్ కుటుంబాలపై ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. 10 లక్షల మంది కార్మికులు గల్ఫ్‌లో ప్రస్తుతం పని చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యుల ఓట్లు, తాజా ఎన్నికల్లో విజయావకాశాలను ప్రభావితం చేయబోతున్నాయి. ఉత్తర తెలంగాణలో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు మెదక్‌లో కొన్ని ప్రాంతాలకు చెందిన 10 లక్షల మంది కార్మికులు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారు. ఒక గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి సగటున 4 ఓట్ల చొప్పున.. 40 లక్షల ఓట్లు ఉత్తర తెలంగాణలో ఉన్నారని అంచనా వేస్తున్నాయి పార్టీలు. అయితే గల్ఫ్‌లో పనిచేస్తున్న కార్మికులు.. తెలంగాణకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి లేదు. కానీ, వారి కుటుంబాల ఓట్లు కీలకం కాబోతున్నాయి.
గతంలో గల్ఫ్ దేశాలకు వలసపోయి, తిరిగొచ్చిన బాధితులు మరో 20 లక్షల మంది ఉన్నారు. మొత్తం 60 లక్షల మందితో గల్ఫ్ ఓటు బ్యాంకు పటిష్ఠంగా ఉంది. ఒక నియోజకవర్గంలో కనిష్ఠంగా 15 వేల మంది ఓటర్లు ఉంటే..గరిష్ఠంగా 30 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, కోరుట్ల, నిర్మల్, వేములవాడ, చొప్పదండి, ధర్మపురి తదితర నియోజకవర్గాల్లో గల్ఫ్ ఓటర్ల ప్రభావం గణనీయంగా ఉంది.
గల్ఫ్ కార్మికుల ద్వారా సర్కారుకి ఆదాయం వస్తోంది. ఒక్కో కార్మికుడు నెలకు సగటున రూ. 15 వేల చొప్పున కుటుంబ సభ్యులకు పంపిస్తున్నట్లు సర్వేలో తేలింది. ఈలెక్కన 10 లక్షల మంది పంపించే సొమ్ము నెలకు రూ. 1,500 కోట్లు అవుతోంది. అమ్మకాలు, కొనుగోళ్లతో డబ్బు రొటేషన్ అవుతోంది. అంటే ప్రభుత్వానికి నెలకు రూ. 150 కోట్ల ఆదాయం వస్తున్నట్లు అంచనా. ఇలా, వేల కోట్ల గల్ఫ్‌కార్మికుల కష్టాన్ని సొమ్ము చేసుకున్న పాలకులు.. వారి సంక్షేమానికి కృషి చేయకపోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు గల్ఫ్ కార్మికుల కుటుంబ సభ్యులు.
ఉద్యమ కాలం నుంచే గల్ఫ్ కార్మికుల సమస్యలపై ఎన్నో హామీలిచ్చింది టీఆర్ఎస్. బొంబాయి బొగ్గుబాయి దుబాయి నినాదాన్ని 2014 ఎన్నికల్లోనూ గట్టిగా వినిపించింది. గల్ఫ్‌లో చనిపోయిన కార్మికుడి కుటుంబానికి రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని, రూ. 500 కోట్లతో గల్ఫ్ కార్మికుల సంక్షేమ నిధి, జైళ్లలో మగ్గుతున్న కార్మికులకు ఉచిత న్యాయసాయం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పొందు పరిచింది. 2014 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు 1,000 మందికి పైగా కార్మికులు గల్ఫ్‌లో చనిపోగా, వారి కుటుంబాలకు ఎటువంటి ఆర్థిక సాయం అందలేదని తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంఘాలు అంటున్నాయి. ఎన్నికలు రావడంతో, మళ్లీ గల్ఫ్ లేబర్ రాగాన్ని ఎత్తుకున్నాయి అధికార, విపక్షాలు.
కాంగ్రెస్ గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబ ఓట్లపై ప్రత్యేక దృష్టిపెట్టింది. వారి కోసం ప్రత్యేక మేనిఫెస్టోకూ రూపకల్పన చేసింది. భరోసా యాత్ర కూడా చేపట్టిన కాంగ్రెస్ గల్ఫ్‌లో అక్కడి తెలంగాణ కార్మికులనూ పలకరించింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ కుంతియాతో పాటు పలువురు నేతలు గల్ఫ్ బాట పట్టి, హామీల వర్షం కురిపించారు. ఈ ఎన్నికల్లో తమకు అండగా నిలవాలని, కేరళ తరహాలో ప్యాకేజీలు అమలు చేస్తామని వాగ్దానాలు కుమ్మరించారు. అటు టీఆర్ఎస్ కూడా గట్టి హామీలే ఇస్తోంది. చూడాలి. గల్ఫ్ కార్మికుల ఓట్ల వర్షం ఎవరిపై కురుస్తుందో..