అధినాయకుల రంగ ప్రవేశంతో తెలంగాణ ఎన్నికలు, రణరంగాన్ని తలపిస్తున్నాయి. మిగిలిన కొన్ని రోజుల్లో మరింత హీటెక్కబోతున్నాయి. అయితే టీఆర్ఎస్, ప్రజాకూటమి, బీజేపీ అగ్రనేతలు, అనేక మాటలు చెబుతున్నా, కొన్ని మాటలనే పదేపదే చెబతుున్నాయి. అవే తమ కీలకమైన అస్త్రాలుగా సంధిస్తున్నారు. ఆ ఆయుధాలే తమను గెలిపిస్తాయని కత్తులు దూస్తున్నారు. ఇంతకీ ప్రధాన రాజకీయ పార్టీల అధినాయకులు పదేపదే ప్రజల్లోకి తీసుకెళ్తున్న ఆ అస్త్రాలేంటి....
తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ, ప్రచార వేడి పెరుగుతోంది. అధినాయకుల ప్రసంగాలు కూడా హీటెక్కుతున్నాయి. ఇప్పటికే చాలా సభలు, రోడ్ షోల్లో, అనేక స్పీచ్‌లు ఇచ్చారు. మున్ముందు కూడా, అదిరిపోయే మాటలు చెబుతారు. కానీ మొదటి నుంచి కొన్ని కీలకమైన అస్త్రాలకు మాత్రమే వాళ్లు పదునుపెడుతున్నారు. అవే తమను గెలిపిస్తాయని ధీమాగా ఉన్నారు. మరి టీఆర్ఎస్, కాంగ్రెస్ కూటమి, బీజేపీలు ఏయే ఆయుధాలను ప్రయోగిస్తున్నాయి...?
మొదట టీఆర్ఎస్ సంగతి చూద్దాం...అందరికంటే ముందే ప్రచారాన్ని ప్రారంభించారు ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. సుడిగాలి పర్యటనలతో ఒక ఊపు ఊపేస్తున్నారు. ప్రతిరోజు కనీసం ఐదు నుంచి ఎనిమిది సభల వరకూ నిర్వహిస్తూ, ప్రసంగాల చేస్తున్నారు. కానీ ప్రతి సభలోనూ, మూడే మూడు, కీలకమైన అస్త్రాలుగా సంధిస్తున్నారు. అందులో మొదటిది చంద్రబాబు. కాంగ్రెస్ పార్టీ, టీడీపీతో ఎప్పుడైతే జట్టుకడుతుందని తెలిసిందో, అప్పటి నుంచే చంద్రబాబు లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధిస్తోంది గులాబీదళం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, ఇతర కీలక నేతలంతా, చంద్రబాబును తెలంగాణ వ్యతిరేకిగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లుందుకు వ్యూహాత్మకంగా అడుగులేశారు. కేసీఆర్ ప్రతి ప్రసంగంలోనూ చంద్రబాబునే టార్గెట్ చేస్తున్నారు. తెలంగాణలో పెత్తనం చేయాలని, బాబు కుట్రలు చేస్తున్నారని, మరోసారి బాబుకు పెత్తనం ఇద్దామా అంటున్నారు.
అలా చంద్రబాబు, తమ తిరుగులేని అస్త్రంగా భావిస్తున్న టీఆర్ఎస్, మరో ఆయుధాన్ని కూడా గట్టిగా ప్రయోగిస్తోంది. అదే కరెంటు.... తెలంగాణ రాకముందు, కరెంటు కోతలతో తెలంగాణ అల్లాడిపోయిందని, ఇప్పుడు ఎలాంటి పవర్ కట్లూ లేకుండా దేదీప్యమానంగా వెలుగుతోందని, కేసీఆర్ పదేపదే ప్రస్తావిస్తున్నారు. మళ్లీ కాంగ్రెస్ వస్తే, తెలంగాణ చీకటిమయం అవుతుందని, ప్రజలను హెచ్చరిస్తున్నారు. కేవలం ఆరోపణలు, విమర్శలే కాదు, పథకాలు తమ అస్త్రాలుగా భావిస్తున్నారు కేసీఆర్. ముఖ్యంగా రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్ల రెట్టింపు, ఓట్ల వర్షం కురిపిస్తుందని దీమాగా ఉన్నారు. ఏ నియోజకవర్గానికి వెళ్లినా, రైతు బంధు దేశంలో ఎక్కడైనా ఉందా అని అడుగుతున్నారు. కొడుకుల ఆదరణ కరువైన వృద్దులకు ఆదరణ కలిగిస్తున్నది ఆసరా పెన్షన్లేనని చెబుతున్నారు.
ఇలా చంద్రబాబు, కరెంటు, కీలకమైన పథకాలే, వెపన్స్‌గా, వార్ ఫీల్డ్‌లో తలపడుతోంది టీఆర్ఎస్. అవే తమను గట్టెక్కిస్తాయన్న కాన్ఫిడెన్స్‌తో, పదేపదే వాటినే ప్రస్తావిస్తూ, ప్రజలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది.