నువ్వెంత ఇస్తానంటే, అంతకంటే, కాస్త ఎక్కువే ఇస్తానన్నట్టుగా పార్టీలు ప్రణాళికలను వండివారుస్తున్నాయి. ఒకవైపు అభివృద్ది మంత్రం జపిస్తూనే, ఎవ్వరూ ఊహించని హామీలకు రెక్కలు తొడగింది గులాబీదళం. ప్రజాకర్షక మేనిఫెస్టోను రూపొందిస్తున్నామని, అందులో కొన్ని కీలకాంశాలను వెల్లడించింది. ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. అటు తమ వాగ్దానాలనే మక్కీకి మక్కీ దించారని ఆరోపిస్తున్న కాంగ్రెస్‌పై, టీఆర్ఎస్ నేతలు ఎదురుదాడి ముమ్మరం చేశారు.
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, అనూహ్యంగా ప్రకటించిన మినీ మేనిఫెస్టోతో, ఎన్నికల రణక్షేత్రం రసవత్తర మలుపు తిరిగింది. ఒకవైపు అభివృద్దిని చూసి ఓటు వేయాలని కోరుతున్న కేసీఆర్, ప్రతిపక్షాలు కురిపిస్తున్న హామీలకు దీటుగా వాగ్దానాలు కురిపించారు. కాంగ్రెస్ ఇస్తున్న హామీలకు, కొన్ని రూపాయలు ఎక్కువిస్తూ, అందరిచూపు తనవైపు తిప్పుకున్నారు. దీంతో తెలంగాణలో ఇప్పుడు ఎటుచూసినా, టీఆర్ఎస్ మేనిఫెస్టోపైనే చర్చ జరుగుతోంది. అయితే, కాంగ్రెస్ హామీలనే మక్కీకి మక్కీ కాపీ కొట్టారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైరయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి ఇస్తామంటే, తండ్రీ కొడుకులు ఎద్దేవా చేశారని, ఇప్పుడు తమ నిరుద్యోగ భృతి పథకాన్నే కాపీ కొట్టారని విమర్శించారు. నిరుద్యోగ భృతి కింద మేం 3 వేలు ఇస్తామంటే... రూ.3016 అని కేసీఆర్ ప్రకటించారని అన్నారు. నాలుగున్నరేళ్లలో ఏ ఒక్క హామీనీ అమలు చేయకుండా ఇప్పుడు ఏదో చేస్తామంటే, ముమ్మాటికీ తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేయడమేనని నిప్పులు చెరిగారు ఉత్తమ్.
అటు మిగతా కాంగ్రెస్ నేతలు కూడా, టీఆర్ఎస్ మేనిఫెస్టోపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ హామీలను నెరవేర్చాలంటే, దక్షిణాది రాష్ట్రాల బడ్జెట్ సరిపోతుందన్న కేటీఆర్, ఇప్పుడేమంటారని వ్యాఖ్యానించారు. మరోవైపు మేనిఫెస్టోను కాపీకొట్టారంటున్న కాంగ్రెస్ నేతల వాదనను, టీఆర్ఎస్ నేతలు తిప్పికొట్టారు. మేనిఫెస్టోను కాపీ కొట్టడం అంటే, అదో హాస్యాస్పదమన్నారు. పాక్షిక మేనిఫెస్టోపై ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.మరోవైపు నాలుగున్నరేళ్లలో ఇచ్చిన హామీలేమయ్యాయో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ సీనియర్ నేత కిషన్‌రెడ్డి. 2017 డిసెంబరులోగా హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు కట్టకపోతే ప్రజలను ఓట్లు అడగనని కేసీఆర్ చెప్పారని, ఆ మాటకు ఎందుకు కట్టుబడి లేరని ఆయన ప్రశ్నించారు. ప్రాజెక్టుల ద్వారా వస్తున్న నీటిని తాగునీరుగా సరఫరా చేస్తానన్నారు.. అదేమైందని నిలదీశారు.
మొత్తానికి కేసీఆర్ ప్రకటించిన మినీ మేనిఫెస్టోపై, వాడివేడిగా చర్చ జరుగుతోంది. తమ ఎన్నికల ప్రణాళికలను కేసీఆర్ కాపీ కొట్టారని కాంగ్రెస్ వ్యాఖ్యానిస్తుంటే, తమకేం అవసరమని గులాబీ నేతలు అంటున్నారు. అటు కేసీఆర్ ఇచ్చిన హాహాలను ప్రచార క్షేత్రంలోకి తీసుకెళుతున్నారు టీఆర్ఎస్ అభ్యర్థులు. ఇంటింటికీ వెళ్లి, జనాలకు వివరిస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ హామీలకు దీటుగా మహాకూటమి ఉమ్మడి ప్రణాళిక ఉండాలని, మరింత కసరత్తు మొదలెట్టాయి కూటమి పార్టీలు. అంతకు మించి అన్నట్టుగా వరాలు కురిపించేందుకు సిద్దమవుతున్నాయి.