తెలంగాణ గట్టుపైన...బీజేపీ, టీజేఎస్...

Update: 2018-09-06 04:31 GMT

తెలంగాణలో బీజేపీ ఒంటరి పోరాటం చేస్తుందా..? మిత్రులను వెతుక్కొంటోందా..? అమిత్ షా చూపు ఏ పార్టీ వైపు ఉంది..? దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్న అంచనాల నడుమ బీజేపీతో దోస్తీకి సిద్ధమైన పార్టీ ఏది..? 

ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న అంచనాల నేపథ్యంలో పార్టీలన్నీ పొత్తుల కోసం ప్రయత్నాలు ప్రారంభించాయి. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా అధికారం చేపట్టాలని పట్టుదలతో ఉన్న బీజేపీ కూడా పొత్తులు ఉంటే లాభమనే అంచనాకు వచ్చింది. ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయడం కంటే కలసి వచ్చే పార్టీలతో ముందుకు వెళ్ళడం మేలని భావిస్తోంది. కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ జనసమితితో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా టీ బీజేపీ నేతలకు సూచించడంతో ఆ  రెండు పార్టీల మధ్య మైత్రి దిశగా చర్చలు మొదలైనట్లు సమాచారం. 

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఆదేశాలతో ఆ పార్టీ తెలంగాణ సీనియర్ నేత ఒకరు రంగంలోకి దిగారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్‌‌కు ఫోన్ చేసి చర్చలు జరిపినట్లు సమాచారం. కోదండరామ్‌కు అమిత్‌ షా ఆదేశాల గురించి చెప్పినట్లు తెలుస్తోంది. బీజేపీ తెలంగాణ జన సమితి మధ్య పొత్తు ఉంటే రెండు పార్టీలకు లాభమని వివరించారు. అలాగే టీజేఎస్ ముఖ్యనేత , మాజీ ఎమ్మెల్సీ ఒకరు ఢిల్లీలో మకాం వేసి  బీజేపీ అధిష్ఠానంతో మంతనాలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

పొత్తులకు సంబంధించి యాక్షన్ ప్లాన్ ఢిల్లీ నుంచి ఇంప్లిమెంట్ అవుతోంది.  ఈనెల 12, 15 తేదీల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తెలంగాణ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఆ లోపే పొత్తులపై ఒక అవగాహనకు వస్తే మంచిదనే అభిప్రాయంలో బీజేపీ నేతలు ఉన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రచార బాధ్యతలు మొత్తం అమిత్ షా తీసుకోబోతున్నారు. ఇక ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే అమి‌త్ షా హైదరాబాద్‌లోనే మకాం వేసి తెలంగాణలో విజయం కోసం కృషి చేస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు. 

Similar News