4 సంవత్సరాలు.. 3 నెలలు.. 4 రోజులు...9నెలల ముందే ముగిసిన తెలంగాణ తొలి శాసనసభ కథ
తెలంగాణ చరిత్రలో మరో బిగ్ డే నమోదైంది. ఊహించినట్లుగానే తెలంగాణ శాసనసభ రద్దు జరిగిపోయింది. అయితే ఎన్నో పోరాటాలు, ఎంతోమంది త్యాగాల తర్వాత ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో తొలి శాసనసభ కథ గడువు కంటే ముందే ముగిసిపోయింది. అసలు తెలంగాణ తొలి శాసనసభ ఎప్పుడు కొలువుదీరింది. ఎన్ని రోజులు ముందు రద్దయ్యింది.
4 సంవత్సరాల... 3 నెలల... 4 రోజులు... పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం తొలి శాసనసభ పదవీకాలం ఇది ఎన్నో పోరాటాలు, ఎంతోమంది త్యాగాల తర్వాత ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్ పూర్తికాలం పదవిలో ఉండకుండానే రద్దయ్యింది. ఉద్యమకాలంలో ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువైన తెలంగాణ రాష్ట్ర సమితి అధికారాన్ని చేజిక్కించుకున్నాక కూడా అదే స్థాయిలో సెన్సేషనల్ నిర్ణయాలు తీసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఏకంగా 9నెలల ముందే శాసనసభను రద్దుచేసి తీవ్ర సంచలనానికి తెరలేపింది.
2014 జూన్ రెండున అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగగా అదే ఏడాది జూన్ 9న తెలంగాణ అసెంబ్లీ కొలువుదీరింది. ఈ లెక్కన వచ్చే ఏడాది అంటే 2019 జూన్ 9వరకు నిర్ణీత ఐదేళ్ల పదవీకాలం పూర్తవుతుంది. అయితే శాసనసభ రద్దుతో దాదాపు 9నెలల ముందే సభను రద్దు చేయడంతో తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ కథ 4 సంవత్సరాల... 3 నెలల... 4 రోజులకే ముగిసింది.