కేంద్రంపై మరోసారి అవిశ్వాస అస్త్రం ప్రయోగించేందుకు టీడీపీ రెడీ అయ్యింది. ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో నరేంద్రమోడీ ప్రభుత్వంపై తెలుగుదేశం అవిశ్వాస తీర్మానం పెట్టనుంది. మద్దతు కోసం బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలకు చంద్రబాబు 8 పేజీల లేఖ రాశారు. మద్దతు కూడగట్టే ప్రయత్నంలో టీడీపీ ఎంపీలు టీఆర్ఎస్ ఎంపీలను కలిసి తమకు సపోర్ట్ చేయాలని కోరారు.
విభజన హామీలు అమలు చేయకుండా ఏపీని మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై మరోసారి అవిశ్వాస యుద్ధం ప్రకటించింది తెలుగుదేశం. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మరోసారి కేంద్రంపై అవిశ్వాస అస్త్రం ప్రయోగించనుంది టీడీపీ. ఇందుకు మద్దతు కోరుతూ సీఎం చంద్రబాబు బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలకు లేఖ రాశారు. ప్రత్యేక హోదా, ఏపీకి రావాల్సిన నిధులు, విభజన హామీలతో పాటు వివిధ అంశాలన్నింటిని 8 పేజీల లేఖలో వివరించారు బాబు. ఏపీకి న్యాయం చేయడంలో కేంద్రం విఫలమైందని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంలో సహకరించాలని కోరారు బాబు.
కేంద్రంపై పెట్టబోయే అవిశ్వాస తీర్మానంపై టీఆర్ఎస్ ఎంపీలు కేకే, జితేందర్ రెడ్డితో తెలుగుదేశం ఎంపీలు సుజనా చౌదరి, కొనకళ్ల నారాయణ, మాల్యాద్రి, నిమ్మల కిష్టప్ప సమావేశమయ్యారు. తమ తీర్మానానికి మద్దతివ్వాలని కోరినట్లు చెప్పారు. పార్టీలో చర్చించి టీడీపీ ఎంపీల విజ్ఞప్తిపై నిర్ణయం తీసుకుంటామన్నారు టీఆర్ఎస్ ఎంపీ కేకే.
ఇప్పటికే పార్లమెంటులో చేయాల్సిన పోరాటంపై చంద్రబాబు టీడీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఎలాగైనా ఈ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చేలా బాబు తనవంతు ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. టీడీపీ ఎంపీలు కూడా మిగిలిన పార్టీల నేతలను కలుస్తూ మద్దకు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.