నిజామాబాద్ జిల్లాలో ఒకప్పుడు మంచి పట్టు ఉన్న తెలుగుదేశం పార్టీ.. ప్రస్తుతం కొంత ఇబ్బందికర పరిస్ధితులను ఎదుర్కొంటోంది. క్యాడర్ ఉన్నా.. బలమైన లీడర్లు లేక పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది.ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కొందరు నాయకులు రేవంత్ రెడ్డిని నమ్ముకుని ఆయన వెంట హస్తం గూటికి చేరారు. ఆర్మూర్ నియోజకవర్గం నుంచి రాజారాం యాదవ్, నిజామాబాద్ రూరల్ నుంచి మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, ఎల్లారెడ్డి నుంచి సుభాష్ రెడ్డి ఈ ముగ్గురు నేతలు టీడీపీలో ఉండి, రేవంత్ వెంట నడిచారు. ఈ మూడు సీట్లపై, రేవంత్ వర్గం కన్నేసింది.
రేవంత్ కోటాలో కనీసం ఒక్కసీటైనా వస్తుందని ఆశపడ్డారు. కానీ పార్టీ సీనియర్ల నుంచి టికెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొనడంతో.. రేవంత్ వర్గం భవిష్యత్తు ప్రశ్నార్ధకంలా మారింది. టీడీపీలో కొనసాగినా.. కూటమి సర్దుబాటులో తమకు టికెట్టు వచ్చేదని.. రేవంత్ వర్గం నేతలు అంతర్మథనం చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, ఎల్లారెడ్డిలలో కాంగ్రెస్ సీనియర్లు వర్సె్స్ వలస నేతలు అన్నట్లుగా టికెట్ల పంచాయతీ కొనసాగుతోంది. ఫలితంగా ఈ మూడు నియోజకవర్గాల్లో అభ్యర్దుల ఎంపికై అధిష్ఠానం తర్జన భర్జన పడుతోంది. జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉండగా 6 నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఎంపిక పూరైనా..మూడు నియోజకవర్గాల్లో మాత్రం పంచాయతీ కొనసాగుతోంది.
ఆర్మూర్ నుంచి రేవంత్ వర్గం నేత రాజారాం యాదవ్ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నం చేస్తుండగా.. అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆకుల లలితకు టికెట్టు ఖరారు చేసే పనిలో కాంగ్రెస్ అదిష్ఠానం పావులు కదుపుతోంది. రూరల్‌లో రేవంత్ వర్గం నేత అరికెల నర్సారెడ్డికి.. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీ భూపతి రెడ్డి నుంచి గట్టి పోటీ ఉంది. ఈ నియోజకవర్గం పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయిస్తే... మండవ వెంకటేశ్వరరావు పోటీ చేసే అవకాశం ఉంది. ఎల్లారెడ్డి నుంచి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి టికెట్టు ఆశిస్తుండగా.. నల్లమడుగు సురేందర్ రేసులో ఉన్నారు. ఇదే టికెట్టు కోసం జనసమితి పట్టుబడుతుండటం ఆశావహులను ఆందోళనకు గురిచేస్తోంది. ఎన్నికల వేళ రేవంత్ రెడ్డికే కాదు..ఆయన్ని నమ్ముకున్న లీడర్ల పరిస్ధితి కూడా గందరగోళంలో పడింది. చూడాలి మరి గెలుపు గుర్రాల లిస్టులో వలస నేతల పేర్లు ఉంటాయో..సీనియర్లకు పట్టం కడతారో తేలాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.