కనుచూపుతో ఏపీ రాజకీయాలను శాసించే జేసీ సోదరులు తొలిసారి తాడిపత్రి వేదికగా ఆందోళనకు దిగారు. స్వామి ప్రబోధానంగాస్వామి ఆశ్రమం ఖాళీ చేయించాలని పట్టుపట్టారు. అధికార పార్టీలో ఉంటూనే .. పోలీస్ స్టేషన్ ఎదురుగా గంటల తరబడి బైఠాయించారు. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు జేసీ బ్రదర్స్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినా ఏమాత్రం వెనక్కు తగ్గకుండా చివరకు తమ పంతం నెగ్గించుకున్నారు.
ప్రభుత్వం ఎవరిదైనా.. పార్టీలో ఎవరున్నా 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన జేసీ బ్రదర్స్ మరోసారి సెంటర్ ఆఫ్ పొలిటికల్ అట్రాక్షన్‌గా మారారు. నియోజకవర్గం పరిధిలోని చిన్నపొలమడ గ్రామంలో శనివారం గణేశ్ నిమజ్జన ఉత్సవం నిర్వహిస్తూ ఉండగా ... స్వామి ప్రబోధానంద శిష్యులకు .. టీడీపీ కార్యకర్తలకు మధ్య వివాదం చెలరేగింది. పెద్దపొలమడకు చెందిన టీడీపీ కార్యకర్తలు వినాయక విగ్రహాలను ఊరేగిస్తుండగా ప్రబోధానంద ఆశ్రమం దగ్గర చేరుకున్న సమయంలో ఘర్షణ ప్రారంభమైంది. తమపై రంగులు చల్లారంటూ ఆశ్రమంలోని కొందరు భక్తులు ... గ్రామస్తులతో వాగ్వాదానికి దిగారు. మాటమాట పెరిగి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో గ్రామస్తులకు చెందిన వాహనాలతో పాటు రెండు బండల ఫ్యాక్టరీలు అగ్నికి ఆహుతయ్యాయి.
ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న జేసీ కార్యకర్తలకు మద్ధతుగా తాడిపత్రి ఠాణా ఎదుట భైఠాయించారు. తమ కార్యకర్తలపై దాడులు చేసిన వారిని అరెస్ట్ చేయాలంటూ నిరసనకు దిగారు. జేసీ నచ్చజెప్పేందుకు ఉన్నతాధికారులు రంగంలోకి దిగినా ఫలితం దక్కలేదు. ఇదే సమయంలో ఆశ్రమ వాసులు వెనక్కి తగ్గక పోవడంతో పరిస్ధితి చేయిదాటిపోయింది. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు ఇంటెలిజెన్స్, హోంశాఖ అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు. శాంతి భద్రతల వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం.. తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలంటూ సూచించారు.
సీఎం ఆదేశాల మేరకు ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపిన పోలీసులు ...ఆశ్రమాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఆశ్రమానికి వచ్చిన భక్తులను బలవంతంగా వారి సొంత ప్రాంతాలకు తరలించారు. దీంతో పాటు ఆశ్రమాన్ని ఖాళీ చేయాలని ఆదేశించిన పోలీసులు ... నిర్ణయం తీసుకునే వరకు ఆశ్రమం తమ ఆధీనంలో ఉంటుందని తేల్చి చెప్పారు.