ప్రపంచ చాంపియన్ విండీస్ పై టీ-20 సిరీస్ విజయానికి...మాజీ చాంపియన్ టీమిండియా తహతహలాడుతోంది. తీన్మార్ సిరీస్ లో భాగంగా లక్నో వేదికగా ఈరోజు జరిగే రెండో టీ-20 ఫైట్... ఆతిథ్య టీమిండియాకు చెలగాటం....విండీస్ కు సిరీస్ సంకటంగా మారింది. లోస్కోరింగ్‌తో సాగే ఈ నిర్ణయాత్మక సమరం కోసం క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ప్రపంచ చాంపియన్ విండీస్, మాజీ చాంపియన్ టీమిండియా జట్ల తీన్మార్ టీ-20 సిరీస్...హాట్ హాట్ గా మారింది. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముగిసిన తొలి సమరంలో...5 వికెట్ల విజయంతో 1-0 ఆధిక్యం సాధించిన రోహిత్ సేన...వరుసగా రెండో విజయంతో...సిరీస్ ఖాయం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. విండీస్ పై గత నాలుగేళ్లలో తొలి టీ-20 విజయం సాధించిన జోష్ తో టీమిండియా ఓవైపు ఉరకలేస్తుంటే.....మరోవైపు...బౌలింగ్ బలం, బ్యాటింగ్ బలహీనంతో సతమతమవుతున్న కరీబియన్ఆర్మీకి...ఈ రెండో టీ-20 మ్యాచ్ డూ ఆర్ డైగా మారింది.
సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే...లక్నో వేదికగా జరిగే ఈమ్యాచ్ లో విండీస్ జట్టు...ఆరు నూరైనా నెగ్గితీరాల్సి ఉంది. మరోవైపు...రోహిత్ శర్మ నాయకత్వంలో ఎక్కువమంది యువఆటగాళ్లతో కూడిన టీమిండియా...ఆల్ రౌండ్ పవర్ తో పాటు...చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను..తురుపుముక్కగా
ప్రయోగిస్తోంది. ఇక...డారెన్ బ్రావో, హెట్ మేయర్, కిరాన్ పోలార్డ్, కార్లోస్ బ్రాత్ వెయిట్ లాంటి మేటి టీ-20 స్పెషలిస్ట్ లతో కూడిన విండీస్ ...బ్యాటింగ్ లో తడబడుతున్నా...బౌలింగ్ విభాగంలో పటిష్టంగా కనిపిస్తోంది. గంటకు 146 కిలోమీటర్ల మెరుపువేగంతో బౌల్ చేస్తున్న కరీబియన్ యువఫాస్ట్ బౌలర్ ఓషియాన్ థామస్...టీమిండియా టాపార్డర్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు.
కోల్ కతా టీ-20 మ్యాచ్ వరకూ...రెండుజట్ల ఫేస్ టు ఫేస్ రికార్డులు చూస్తే....విండీస్ దే పైచేయిగా ఉంది. ఇప్పటి వరకూ రెండుజట్లు తొమ్మిదిసార్లు తలపడితే...
టీమిండియా 3 విజయాలు, విండీస్ 5 విజయాలు సాధించాయి. అంతేకాదు...24 ఏళ్ల విరామం తర్వాత...లక్నో గడ్డపై జరుగుతున్న ఈ తొలి అంతర్జాతీయ క్రికెట్ పోటీ కోసం అభిమానులు ఎక్కడలేని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. 50 వేల సీటింగ్ సామర్థ్యంతో నిర్మించిన... లక్నో ఇక్నా స్టేడియం...దేశంలోనే మూడో అతిపెద్ద క్రికెట్ వేదికగా ఇప్పటికే రికార్డుల్లో చేరిపోయింది.
లక్నో స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ కోసం సిద్ధం చేసిన వికెట్ పై 150కి పైగా స్కోరు సాధించిన జట్టుకే విజయావకాశాలు ఉంటాయి. అంతేకాదు...జాదూ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ హోంగ్రౌండ్లో జరుగుతున్న ఈమ్యాచ్ లో సైతం...రెండో ర్యాంకర్ టీమిండియానే హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. టీమిండియా బ్యాక్ టు బ్యాక్ విజయాలతో సిరీస్ సొంతం చేసుకొంటుందా? లేక...దెబ్బ తిన్న బెబ్బులిలా ఉన్న విండీస్ సంచలన విజయంతో సిరీస్ అవకాశాలను సజీవంగా నిలుపుకోగలుగుతుందా?