తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు..ముగ్గురు పోటీ పడుతున్నారు. మామ అల్లుళ్ల మధ్య ఎమ్మెల్యే టిక్కెట్టు చిచ్చుపెట్టింది. అల్లుడు పోటీ చేయాలనుకున్న నియోజకవర్గం నుంచి మామకు పార్టీ టిక్కెట్ కట్టబెట్టింది. సవాల్ గా తీసుకున్న అల్లుడు మామపైనే పోటీకి సిద్ధమయ్యాడు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్ధుల జాబితా మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ ఇంట్లో చిచ్చు పెట్టింది. కుటుంబంలో ఒకరికే టికెట్ నిబంధనతో సర్వే సత్యనారాయణ అల్లుడు..కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి క్రిశాంక్ కు టికెట్ నిరాకరించారు. టికెట్ దక్కకపోవడంతో గాంధీ భవన్ వద్ద క్రిశాంక్ నిరసనకు దిగాడు.
కొంత మంది తనకు టికెట్ రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.కొన్ని ఒత్తిళ్ల వల్లే తన టికెట్ దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు క్రిశాంక్. మామ సర్వే సత్యనారాయణపైనే పోటీ చేసి తన సత్తా చాటుకునేందుకు ఇండిపెండెంట్ గా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. మామ-అలుళ్ల మధ్య పోటీగా కాకుండా.. ఒక విద్యార్ధి నాయకుడిగా గుర్తించాలని క్రిశాంక్ కోరారు. క్రిశాంక్ రాజకీయ అస్తిత్వం కోసం పోరాటం చేస్తున్నాడనే చర్చ జరుగుతుంది. మామ అల్లుళ్ల మధ్య పోరు జరిగితే ఎవరు నెగ్గుతారో అన్నది ఆసక్తికరంగా మారింది.