ఏపీ ప్రభుత్వం వల్లే ఉమ్మడి హైకోర్టు విభజన ఆలస్యమవుతోందన్న కేంద్ర ప్రభుత్వ వాదనపై సుప్రీంకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వ వాదనను తప్పికొడుతూ అఫిడవిట్ దాఖలు చేసిన ఏపీ సర్కార్ డిసెంబర్ 15నాటికి తాత్కాలిక భవనాలు సిద్ధమవుతాయని న్యాయస్థానానికి నివేదించింది. భవన నిర్మాణాలు పూర్తయ్యాక హైకోర్టు విభజనకు చర్యలు చేపడితే తమకెలాంటి అభ్యంతరం లేదని చెప్పడంతో డిసెంబర్ 15 తర్వాతే నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీం.
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త భవనాల నిర్మాణం పూర్తయ్యేవరకు హైకోర్టును ఎందుకు విభజించకూడదంటూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కీలక ఆదేశాలిచ్చింది. అమరావతిలో తాత్కాలిక భవనాల నిర్మాణం పూర్తయ్యాక హైకోర్టు విభజనకు నోటిఫికేషన్ విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
డిసెంబర్ 15లోగా అమరావతిలో హైకోర్టు తాత్కాలిక భవన నిర్మాణం పూర్తి చేస్తామని సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలిపింది. అలాగే మార్చి ఏప్రిల్ నాటికి స్టాఫ్ క్వార్టర్స్, జడ్జిల నివాసాలు కూడా నిర్మిస్తామని ధర్మాసనానికి నివేదించింది. హైకోర్టు తాత్కాలిక భవన నిర్మాణం పూర్తయ్యాక విభజన నోటిఫికేషన్ విడుదల చేస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని ఏపీ స్పష్టంచేయడంతో భవన నిర్మాణాలకు సంబంధించిన ఫొటోలను న్యాయస్థానానికి అందజేయాలని కేంద్ర ప్రభుత్వ తరపు న్యాయవాది కోరారు. అయితే భవన నిర్మాణాలకు తగినన్ని నిధులు ఇవ్వకుండా కేంద్రం తమపై ఆరోపణలు చేస్తోందంటూ సుప్రీంకు నివేదించింది ఏపీ సర్కార్.
ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు కీలక వ్యాఖ‌్యలు చేసింది. హైకోర్టు విభజన జరగకుండా కొత్త జడ్జిల నియామకం చేపడితే మళ్లీ సమస్యలు తలెత్తే అవకాశమున్నందున, వీలైనంత త్వరగా విభజన పూర్తయితే మంచిదని అభిప్రాయపడింది. దాంతో భవన నిర్మాణం పూర్తయ్యాక డిసెంబర్ తర్వాత హైకోర్టు విభజనకు నోటిఫికేషన్ జారీ చేయాలని కేంద్రానికి సుప్రీం ఆదేశాలిచ్చింది.