శోకసంద్రంలో న్యూ సెంచరీ స్కూల్ పేరెంట్స్

Update: 2018-08-03 04:41 GMT

కూకట్‌పల్లి వివేకానందనగర్‌‌లోని న్యూ సెంచరీ స్కూల్‌లో మృతిచెందిన విద్యార్థులు కుటుంబాల్లో విషాదం నెలకొంది. బడికెళ్లిన చిన్నారులు స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా మృత్యువాత పడటంతో ఆందోళన చెందుతున్నారు. ఆగస్టు 15 వేడుకల రిహార్సల్స్‌లో భాగంగా కరాటే నేర్చుకుంటుండగా ఇలాంటి దుర్ఘటన జరిగిందని, అయినా స్కూల్ ‌నుంచి తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. తాము అక్కడికి వెళ్లే సరికి స్కూల్ యాజమాన్యం ఎవరూ కనిపించలేదని మండిపడుతున్నారు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థినిలు మృతి చెందగా, మరో విద్యార్థి కోమాలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. 

బడికెళ్లిన పిల్లాడు భద్రంగా ఉన్నాడో లేదో, స్కూలులో ఏదైనా జరగరాని ప్రమాదం జరిగి ఉంటుందా ? పాఠశాల బస్సులో వెళ్లి వచ్చేటప్పుడు డ్రైవర్ బాగా నడుపుతున్నాడో, లేదో.. కూకట్‌పల్లి వివేకానందనగర్‌ న్యూ సెంచరీ స్కూల్‌లో నిన్నటి దుర్ఘటన తర్వాత గ్రేటర్ హైదరాబాద్‌లోని తల్లిదండ్రుల మెదడును తొలిచిన సందేహం. మరికొద్ది రోజులపాటు ఆందోళన కలిగించే అంశం. కరాటే సాధన చేస్తున్న విద్యార్థులపై వేదిక కప్పు కూలిన దుర్ఘటన విషాదాంతాన్ని మిగిల్చింది. అప్పటివరకూ ఆడిపాడిన చిన్నారులు ఒక్కసారిగా విగత జీవులుగా మారడం అందరినీ కంటతడి పెట్టించింది. ఈ దుర్ఘటన పలు ప్రైవేటు పాఠశాలల్లో ప్రమాదాలు పొంచి ఉన్నాయనే సంకేతాన్నిచ్చింది. యాజమాన్యాల నిర్లక్ష్యానికి, అధికార యంత్రాంగాల ఉదాసీన వైఖరికి తార్కాణంగా నిలిచింది. 

గ్రేటర్ పరిధిలోని పలు ప్రైవేటు పాఠశాలల్లోని సదుపాయాలపై అధికార యంత్రాంగాల పర్యవేక్షణ కొరవడిందని కూకట్‌పల్లి దుర్ఘటనతో రుజువైంది. ఇలాంటి విషాదాంతాలు తల్లిదండ్రుల్లో భయాందోళనల్ని రేకిత్తిస్తున్నాయి. అధిక సంఖ్యలోని ప్రైవేటు పాఠశాలలో సదుపాయాలు బాగానే ఉన్నా కొన్నింటి విషయంలో మాత్రం వేలెత్తి చూపక తప్పడం లేదు. ప్రభుత్వం నుంచి అడ్డదారిలో గుర్తింపు పొందుతున్న కొన్ని పాఠశాలల యాజమాన్యాలు భద్రత విషయాన్ని మాత్రం గాలికొదిలేస్తున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగితే తప్ప ఈ విషయంలో యంత్రాంగాలు స్పందించని దుస్థితి ఆందోళనకరంగా మారింది. వాస్తవానికి ఒక ప్రైవేటు పాఠశాలను నిర్వహించాలంటే తప్పనిసరిగా జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక, ట్రాఫిక్ విభాగాల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో పాఠశాల భవనం పటిష్టంగా ఉన్నట్టు స్ట్రక్చరల్ సౌండ్ నెస్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. నిర్ణీత ఎత్తు దాటిటే అగ్నిమాపక పరికరాలను బిగించుకోవడం తప్పనిసరి. అయితే, కొన్ని పాఠశాలలు ఈ  నిబంధనలను పాటించకున్నా సంబంధిత విభాగాలు లంచాలు తీసుకుని ధృవీకరణ పత్రాలు ఇచ్చేస్తున్నాయి. 

మరికొన్ని చోట్ల సరైన రక్షణ చర్యలు లేని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లతో పాఠశాల విద్యార్థులకు గండం పొంచివుంది. చిన్నపిల్లలకు అందేంత ఎత్తులోనే మూతలు తెరిచి ఉన్న ఫ్యూజ్ బాక్స్‌లు, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నా ఎవరికీ పట్టకపోవడం భయాందోళనలకు రేకెత్తించే అంశంగా మారింది. అయితే, గ్రేటర్ పరిధిలో ప్రైవేటు పాఠశాలలకు అగ్నిమాపక ధృవీకరణ పత్రాల్ని జీహెచ్ఎంసీ ఆధీనంలోని విభాగమే పర్యవేక్షిస్తోంది. గ్రేటర్ వ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 5వేలకు పైగా ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో అగ్నిమాపకశాఖ అధికారికంగా జారీ చేసిన ధృవీకరణ పత్రాలు వేళ్లపై లెక్కించే స్థాయిలోనే ఉంటాయి. కానీ, యాజమాన్యాల వద్ద మాత్రం వందల సంఖ్యల్లోనే ఈ పత్రాలు కనిపిస్తాయి. అగ్నిమాపక విభాగం ఇవ్వడకుండా ఆ పత్రాలు ఎలా పుట్టుకొచ్చాయన్నది మాత్రం చిదంబర రహస్యం. విద్యాశాఖలోని ఓ ముఠానే ఈ నకిలీ పత్రాల్ని సృష్టిస్తోందనేది బహిరంగ రహస్యం. అయినా ఏ ఉన్నతాధికారి ఈ దిశగా దృష్టిసారించిన దాఖలాలు లేవు. మరోవైపు పాఠశాలల నిర్వహణకు అనుమతి ఇచ్చే సమయంలో భవనం పటిష్టతను నిర్ధారించి ధృవీకరణ పత్రం ఇవ్వాల్సిన బాధ్యత జీహెచ్‌ఎంసీ పైనే ఉంది. కానీ, అవి ఎన్ని పాఠశాలలకు ఇచ్చారన్న దానిపై సరైన లెక్కల్లేవు. 

న్యూ సెంచరీ స్కూల్‌లో నిన్నటి దుర్ఘటనకు యాజమాన్యమే కారణమని విమర్శిస్తున్నారు. పాఠశాల ఆవరణలో ఓపెన్ టాప్ వేదికను తయారు చేశారు. దీన్ని కూడా స్కూల్ ఏర్పాటు చేసిన సమయంలో అంటే 9ఏళ్ల క్రితమే నిర్మించారు. చుట్టూ ఇటుక గోడలతో పిల్లర్ల తరహాలో నిర్మించి వాటిపైన ఇనుప ఫ్రేమ్‌లు ఉంచి వాటిలో సిమెంట్, ఇసుక ముద్దలు పోసి కప్పేశారు. రంగులతో పైపై మెరుగులు దిద్దారు. ఎండకు ఎండి, వానకు తడిసి ఇది ఇన్నేళ్లు ఉండటమే ఆశ్చర్యమని నిర్మాణ రంగం నిపుణులు పేర్కొంటున్నారు. వాస్తవంగా ఇప్పటికే పిల్లర్లు, పైన ప్లింత్ బీమ్‌ల్లా తయారు చేసిన వాటికి పగుళ్లు వచ్చి వేదిక ప్రమాదకరంగా కనిపిస్తోంది. పాఠశాల తరగతి గదులు పూర్తిగా చెక్కలతోనే తయారు చేశారు. సీలింగ్‌కు మాత్రం ఫాల్స్‌ సీలింగ్ ఏర్పాటు చేసి పైకప్పు పెంకులు వేైసి మెరుగులు దిద్దారు. 
 

Similar News