కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కోసం తెలంగాణ కాంగ్రెస్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్‌లో సమరోత్సాహం నింపే సోనియా పర్యటన జోష్ నింపుతుమందా? నాయకుడి కర్తవ్యబోధ కార్యకర్తలను యుద్ధానికి సిద్దం చేస్తుందా? గులాబీదళంపై సకల విమర్శనాస్త్రాలు సంధించిన కాంగ్రెస్ ఆ దిశగా గాంధీభవన్‌కు దిశానిర్దేశం చేస్తారా? సోనియా సుడిగాలి పర్యటన చురకత్తుల్లాంటి మాటలు పదునైన వాగ్భాణాలతో క్యాడర్ సమరోత్సాహానికి రెడీ చేస్తుందా?
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రాక కోసం, చాలా రోజుల నుంచి వెయిట్ చేశారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందు, తెలంగాణలో పర్యటించాల్సి ఉన్నా చివరి నిమిషంలో మార్పు జరిగింది. ఇంతలోనే రాహుల్ సుడిగాలిలా పర్యటించి నిస్తేజంగా ఉన్న రాష్ట్ర కాంగ్రెస్‌లో యమ జోష్ నింపేసి వెళ్లారు. రాహుల్ టూర్‌తోనే కేసీఆర్‌కు కాక రేగిందని భావించిన సీనియర్లు, అధినేత్రితో భారీ బహిరంగ సభలు పెట్టి, సమరోత్సాహంతో వెళ్లాలని భావిస్తున్నారు. అనుకున్నట్టుగానే ఈనెల 23న సమరనాదం చేసి, కదం తొక్కించారు. మేడ్చల్ వేదిక ద్వారా సోనియాతో సమర శంఖారావం పూరించనున్నారు హస్తం నేతలు.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సభల ద్వారా గతంలో రాహుల్‌గాంధీ, ఆద్యంతం కార్యకర్తలు, జనాల్లో హుషారునింపే ప్రయత్నం చేసి వెళ్లారు. అమరుల త్యాగాలను చూసి, వారి శోకంతో చలించిపోయి, కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని, కానీ వారి ఆశయాలకు కేసీఆర్ తూట్లు పొడిచారని సోనియా ద్వారా ఇప్పుడు చెప్పించాలన్నది కాంగ్రెస్ నేతల ప్లాన్. కుటుంబ సభ్యులకు పదవులు ఇచ్చుకున్న కేసీఆర్, ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగసిన నిరుద్యోగులకు మాత్రం ఉపాధి చూపించలేదన్న నినాదాన్ని వినిపించే ప్రయత్నం చేయనున్నారు. కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని సోనియాతో పిలుపునిప్పించి క్యాడర్‌లో కదనోత్సాహం నింపాలన్నది కాంగ్రెస్ ఆలోచన.
కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్, నియంతల్లా పాలిస్తున్నారన్న వాగ్బాణాలను కాంగ్రెస్ పదునుపెడుతుందంటున్నారు కార్యకర్తలు. ఇదే మాటను సోనియా ద్వారా చెప్పించి దాని ఇంటెన్సిటీని ఇంకా పెంచాలన్నది వారి ఆలోచనగా కనిపిస్తుంది. ఇద్దరూ ఏకమయ్యారని, కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నారని, ప్రత్యర్థులపై ప్రభుత్వ విభాగాలను ఉసిగొల్పుతున్నారన్న ఆరోపణలతో గులాబీలో గుబులు రేపుతామని చెబుతోంది క్యాడర్. రిజర్వేషన్లు పేరుతో ముస్లింలను కేసీఆర్ మోసం చేస్తున్నారని, మరోవైపు దేశవ్యాప్తంగా ముస్లింలపై దాడులు పెరుగుతున్నా మోడీ మౌనంగా ఉన్నారని సోనియా గుర్తు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మైనారిటీ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు సోనియాగాంధీ టూర్‌ను ఉపయోగించుకుంది తెలంగాణ కాంగ్రెస్. ఎంఐఎం, టీఆర్ఎస్‌లకు మళ్లిపోయిన ముస్లిం ఓటు బ్యాంకును తిరిగి తమవైపు తిప్పికునేందుకే సోనియా సభను ఏర్పాటు చేసి, సక్సెస్ చేయాలనుకుంటుంది కాంగ్రెస్.