క్రిస్మస్ అంటే సంబరాలే కాదు. ప్రేమపూర్వక బహుమతులివ్వడం. ప్రజలను పాపాల నుంచి విముక్తి చెయ్యడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. బలియాగమయ్యాడు. అంటే ప్రజల కోసం దేవుడు తన కుమారున్ని గిఫ్ట్ గా ఇచ్చాడన్న మాట. క్రీస్తు తన బోధల్లో ఇతరులకు ఇవ్వడం గురించి చెప్పాడు. అనాథలు, విధవరాండ్రకు సాయం చెయ్యాలన్నాడు. క్రీస్తు చూపిన బాటలో బహుమతులివ్వడమే పరమావధిగా శాంటాక్లాజ్ క్రిస్మస్ తాతయ్యగా అందరికీ సుపరిచితుడయ్యాడు. ఎరుపు, తెలుపు దుస్తులు. తల మీద టోపి. నెరసిన పెద్ద గడ్డం. బ్యాగులో చాక్టెట్లు, బొమ్మలు, ముఖంపై చిరునవ్వు. శాంటాక్లాజ్ రూపం ఆహ్లాదకరంగా, ఆత్మీయంగా, అచ్చం మన తాతయ్యలానే ఉంటుంది. ఆ ఆకారం కనిపించినప్పుడల్లా పిల్లల ముఖంలో నవ్వు. బహుమతుల ఆశ.
క్రీ.శ. మూడో శతాబ్దానికి చెందినవాడుగా శాంటాక్లాజ్‌ను చెబుతారు చరిత్రకారులు. చిన్నపిల్లలకు బహుమతులివ్వడంలో ముందుటాడు శాంటాక్లాజ్. చిన్నచిన్న బహుమతులిచ్చి, వారి ముఖంలో చిరునవ్వులు రువ్వుతాడు. శాంటాక్లాజ్ గా పిలుచుకునే వ్యక్తి అసలు పేరు సెయింట్ నికొలస్. ఈయన డెన్మార్క్ కు చెందినవాడు. క్యాథలిక్ చర్చ్ బిషప్. ఆయనిచ్చే బహుమతులే ప్రపంచవ్యాప్తంగా శాంటాక్లాజ్ సంప్రదాయమైంది. నికొలస్ బిషప్‌గా ఉన్న ప్రాంతంలో ఒక నిరుపేద రైతు తన ముగ్గురు కుమార్తెలకు కట్నాలిచ్చి పెళ్లిళ్లు చేయలేకపోయాడట. దీంతో బిషప్ నికోలస్ చలించిపోయాడు. అర్ధరాత్రిపూట బంగారు నాణాలున్న మూడు చిన్న మూటలను చిమ్నీ ద్వారా ఇంట్లోకి జారవిడిచాడట. అవి చిమ్నీ ద్వారా జారి, అక్కడ ఆరబెట్టి ఉన్న ఓ సాక్స్ లో పడ్డాయట. అలా ఆయన చేసిన సాయం ఒక పేదరైతు కుటుంబం అక్కరను తీర్చింది. ఎంతో ఆనందం నింపింది. ఈయన చేసిన సాయం ఊరూరా ప్రచారమైంది. దీంతో చాలామంది రైతులు తమక్కూడా అలా సాయం అందుతుందని ఎదురుచూశారు. తమ ఇంటి పరిసరాల్లో వెతకడం ప్రారంభించారట.
సాయం చేయడంలో చాలా తృప్తి ఉంది. ఇవ్వడంలో త్యాగం ఉంది. దయాగుణముంది. క్రీస్తు చెప్పింది కూడా ఇదే. బిషన్ నికోలస్ కూడా ఇదే పాటించాడు. అపరిచిత నికోలస్ చూపిన మార్గంలో మనసున్నవాళ్లంతా రకరకాల సాయాలు చేసి క్రిస్మస్ తాతలయ్యారు. కొన్ని చోట్లయితే ఆ సంవత్సరమంతా సర్వే చేసి..ఎవరి అవసరాలు ఏంటో తెలుసుకుంటున్నారు. వారి అవసరాలు తీరుస్తున్నారు. ఇలా చాలా చోట్ల క్రిస్మస్ తాతలు గిఫ్టులు పట్టుకుని ఊరూరా తిరుగుతున్నారు. క్రిస్మస్ ముందురాత్రి పడుకున్న తరువాత, క్రిస్మస్ తాత ఇంటింటికీ వెళ్లి వారి బహుమతులను ఇంటి ముంగిట పెట్టి తలుపుకొట్టి వెళ్లిపోయేవాడు. పాశ్చాత్యదేశాల్లో ఈ సంప్రదాయం బాగా పాపులర్ అయ్యింది. ప్రతి క్రిస్మస్ సీజన్ లోనూ వందల కోట్లలో ఈ గిఫ్టులు అందిస్తునే ఉంటారు. క్రిస్మస్ పరమార్థం కూడా అదే.