చెప్పేది శ్రీరంగ నీతులు...లూటీ చేసేది ప్ర‌భుత్వ బ్యాంకుల్నా

Update: 2018-02-20 05:32 GMT

భారతదేశం మొత్తం సంచలనం నమోదు చేసిన రూ.11,360 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం గురించి వార్తలు వెలువడిన కొద్ది రోజులకే.. మరో సంస్థ కూడా ఇలాగే బ్యాంకుల నుండి రుణాల పేరుతో అధిక మొత్తాలు దోచుకుందనే వార్త హల్చల్ చేసింది. ప్రముఖ కలాల తయారీ సంస్థ రోటోమ్యాక్‌ అనుబంధ సంస్థ యాజమాని దాదాపు 5 పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల నుండి నుండి రూ.3,600 కోట్ల వరకు అప్పులు తీసుకుని పారిపోయి... ప్రస్తుతం వివిధ దేశాల్లో తలదాచుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.  అలాగే రోటోమ్యాక్ కంపెనీ యజమాని విక్రమ్‌ కొఠారి పలువురు బ్యాంకు అధికారులతో కుమ్మక్కై నిబంధనలకు వ్యతిరేకంగా రు.800 కోట్లకు పైగా రుణాలు సంపాదించారని కూడా పలు వార్తలు వచ్చాయి.  

కొఠారికి రుణాలు ఇచ్చిన బ్యాంకుల్లో అలహాబాద్‌ బ్యాంక్‌‌తో పాటు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లాంటి ప్రముఖ బ్యాంకులు కూడా ఉండడం గమనార్హం. ఈ బ్యాంకుల్లోని అధికారులు తమ సంస్థల నిబంధలనకు వ్యతిరేకంగా.. కొఠారి ఇచ్చే తాయిలాల కోసం ఆశపడి రుణాలు ఇచ్చారని పలు వార్తలు వస్తున్నాయి.

అలా రుణాలు తీసుకున్న  కొఠారి తొలుత యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుండి రు.485 కోట్లు రుణంగా తీసుకొని.. ఆ తర్వాత  అలహాబాద్‌ బ్యాంక్‌ నుండి రు.352 కోట్లు తన కంపెనీకి మళ్లించినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆయన తీసుకున్న రుణాలకు సంబంధించి అసలు లేదా వడ్డీని గానీ చెల్లించలేదని తెలుస్తోంది. పైగా చాలా రోజులుగా కొఠారికి చెందిన ఆఫీసులు కూడా తాళం వేసి ఉండడంతో అవాక్కవ్వడం బ్యాంకు అధికారుల వంతు అయ్యింది.  

ఈ క్రమంలో సీబీఐ అధికారులు విక్రమ్ కొఠారి ఇంటి పై రైడింగ్ చేశారు. అయితే తాను రుణం తీసుకున్న మాట నిజమే అని.. కానీ తీర్చడం లేదన్న మాట మాత్రం అవాస్తవమని ఆయన పేర్కొన్నారు. వీలును బట్టి కొన్ని రుణాలు తాను తీర్చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. పైగా తాను ఎక్కడికీ పారిపోలేదని.. భారతదేశంలోనే ఉన్నానని తెలిపారు. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. కొఠారి తరఫున గతంలో కేసులు నమోదయ్యాయని.. ఆయన కూడా ఆ కేసులలో రుణాలు తీర్చలేనని చెప్పారని వార్తలు వచ్చాయి. 

Similar News