కర్నాటక పొలిటికల్ లీడర్ల గుండెల్లో సింహస్వప్నంగా మారిన ఐఏఎస్ అధికారిణి, తెలుగమ్మాయి సింధూరి.... తన పోరాటంలో విజయం సాధించింది. తన అక్రమ బదిలీకి వ్యతిరేకంగా జరుపుతోన్న పోరాటంతో... ప్రస్తుత ప్రభుత్వం దిగొచ్చింది. ఎక్కడ్నుంచైనా ఆమెను బదిలీ చేశారో... మళ్లీ అదే పోస్టులో నియమిస్తూ కుమారస్వామి సర్కార్ ఉత్తర్వులిచ్చింది.
దాసరి రోహిణీ సింధూరి... యావద్దేశమంతా మార్మోగిన పేరు... కర్నాటక కేడర్ ఐఏఎస్ అధికారిణి అయిన సింధూరి... రాజకీయ బాసులను ఎదిరించి నిలబడ్డ చేవగల ఆఫీసరు... ఐఏఎస్‌లను పదేపదే బదిలీ చేస్తూ అభివృద్ధికి అడ్డుతగిలే విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఆడ పులి. తన అక్రమ బదిలీకి వ్యతిరేకంగా జరిపిన అలుపెరగని పోరాటంతో సింధూరి పేరు.... దేశమంతా మార్మోగిపోయింది. చివరికి ఆమె పోరాటం ఫలించింది. సింధూరిని ఎక్కడ్నుంచైతే బదిలీ చేశారో... మళ్లీ అదే పోస్టులో.... హసన్ జిల్లా డిప్యూటీ కమిషనర్‌గా నియమిస్తూ కుమారస్వామి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సిద్ధరామయ్య ప్రభుత్వ హయాంలో ....హసన్ జిల్లా డిప్యూటీ కమిషనర్‌గా నియమితులైన సింధూరి.... ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపారు. ఇసుక అక్రమ రవాణాదారులను తరిమి తరిమికొట్టారు. ఈ దెబ్బ రాజకీయ నేతలకు బలంగా తగిలింది. దాంతో అప్పటి హసన్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి మంజుకు... సింధూరి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. అంతే... ఈ ఏడాది జనవరి 22న సింధూరిని ఆకస్మికంగా పరిశ్రమలశాఖకు బదిలీ చేశారు. అయితే అప్పట్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఈసీ ఆ బదిలీపై స్టే ఇచ్చింది. ఈ బదిలీపై సింధూరి న్యాయపోరాటానికి దిగారు. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌లో తనకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో సింధూరి హైకోర్టుకెక్కారు. ఈలోగా ఎన్నికలు జరగడం, కుమారస్వామి ముఖ్యమంత్రి కావడంతో.... సింధూరిని మళ్లీ హసన్ జిల్లా డిప్యూటీ కమిషనర్‌గా నియమిస్తూ ప్రస్తుత ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
కర్నాటకలో డేర్ అండ్ డ్యాషింగ్ ఐఏఎస్ అధికారిణిగా పేరు తెచ్చుకున్న సింధూరి పదహారణాల తెలుగమ్మాయి. ఖమ్మం జిల్లా వాసైన సింధూరి... హైదరాబాద్‌లో కెమికల్ ఇంజినీరింగ్ పూర్తిచేసి.... సివిల్ సర్వీసెస్‌లో 43వ ర్యాంకు సాధించారు. కర్నాటక కేడర్‌కు ఎంపికై.... నిజాయితీ, నిర్భీతి కలిగిన అధికారిణిగా పేరు తెచ్చుకున్నారు. అక్రమార్కులు, రాజకీయ నేతల గుండెల్లో సింహస్వప్నంగా మారారు.