ముసుగులు తొలగిపోయాయ్..2019లో ఎవరు ఎవరెవరితో ...

Update: 2018-08-10 06:08 GMT

నిన్నటి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక 2019 ఎన్నికల తీరును కళ్లకు కడుతోందా?  ఇన్నాళ్లూ గుంభనంగా వ్యవహరించిన పార్టీలన్నీ రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా తమ వైఖరిని బయటపెట్టక తప్పలేదా?2019లో యూపీఏ వర్సెస్ ఎన్డీఏ యుద్ధంలో ప్రాంతీయ పార్టీలలో ఏ పార్టీ ఎటువైపు? ఈ అంశంపై క్లారిటీ వచ్చిందా?

రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ ఎన్నికలో ఎన్డీ ఏ అభ్యర్ధి గెలుపొందారు. ఈ ఎన్నిక కొంత కాలంగా అస్పష్టంగా ఉన్న కొన్ని రాజకీయ పార్టీల కదలికలను బయట పెట్టింది. కొంత కాలంగా యూపీఏ, ఎన్డీఏ రెండు కూటములలోనూ ఎవరివైపు ఉన్నారో తెలియకుండా  దోబూచులాడిన పార్టీల తీరు ఈ సందర్భంగా బట్టబయలైంది. ఎన్డీ ఏ అభ్యర్ధిగా జేడీయూ ఎంపీ హరివంశ్  నారాయణ్ సింగ్ పోటీ చేయగా, కాంగ్రెస్ తరపున హరిప్రసాద్ నిలబడ్డారు. హరివంశ్ నారాయణ్ తొలిసారి ఎంపీ కాగా, హరిప్రసాద్ ఇప్పటికే మూడు సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. మొత్తం 244 మంది ఎంపీలున్న రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మన్ గా గెలిచేందుకు 123 మంది సభ్యుల మద్దతు అవసరం. యూపీఏ, ఎన్డీఏ కూటములు ఎవరికి వారే గెలుపు మాదేనని ప్రకటించినా, బిజెపి వ్యూహాత్మకంగా వేసిన అడుగే ఆ కూటమి విజయానికి కారణమైంది. బిజెపి నేరుగా తమ పార్టీ అభ్యర్ధిని పెట్టకుండా జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్ ను నిలబెట్టి వ్యూహాత్మకంగా అడుగేసింది. కొంత కాలంగా బిజెపిపై విమర్శలు చేస్తూ వస్తున్న  శివసేన, టిఆరెస్ కూడా ఈ ఎన్నికల్లో తాము బిజెపి పక్షమేనని చెప్పక తప్పలేదు అలాగే అకాలీదళ్, అన్నా డీఎంకే కూడా ఎన్డీఏ పక్షమే వహించాయి ఈ ఎన్నికలకు తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిణామాలకు చిన్న కనెక్షన్ ఉంది.  మొన్నటి వరకూ ఎన్డీఏ లో ఉండి ఇప్పుడు బయటకొచ్చిన టిడిపి రాజ్యసభ ఎన్నికల్లో  కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చింది. బిజెపిని విమర్శిస్తూ వచ్చిన తెలుగు దేశం పార్టీ ఈ ఎన్నికలో కాంగ్రెస్ పక్షం వహించడంతో తమ భవిష్యత్ వ్యూహానికి చిన్న హింట్ ఇచ్చినట్లయింది. ఎన్టీఆర్ మరణం తర్వాత టిడిపి చరిత్రలోనే ఒంటరి పోరాటం లేదు ఎప్పుడూ ఏదో ఓ పార్టీని వెంటేసుకునే ఎన్నికలకు వెడుతోంది. మరి 2019లో కాంగ్రెస్ తో కలసి ఎన్నికలకు వెలుతుందా అన్న సందేహాలు కలిగే రీతిలో టిడిపి నిర్ణయం సాగింది.

అలాగే టిఆరెస్ కూడా ఇన్నాళ్లూ ఎన్డీఏపై తమ అభిప్రాయాన్ని బయట పడనీయకుండా అడుగు లేస్తూ వచ్చింది. కానీ రాజ్యసభ ఎన్నికల్లో  ఓటింగ్ ద్వారా తాము ఎన్డీఏ పక్షమేననిపించుకుంది. ఇక ఈ ఎన్నికలో వైసిపి విశ్లేషకులకు చిన్న ఝలక్ ఇచ్చింది. బీజేపీ అభ్యర్ధిని ఓడించడమే తమ కర్తవ్యమని చెబుతూ వచ్చిన వైసిపి చివరి నిమిషంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి ఓటింగ్ కు దూరమైంది. ప్రజాసంకల్ప యాత్ర పర్యటనలో ఉన్న జగన్ ఢిల్లీలో ఉన్న వైసీపీ ఎంపీలకు ఫోన్ చేసి ఓటింగ్ కు దూరంగా ఉండమని ఆదేశించినట్లు సమాచారం. ఏపికి బిజెపి, కాంగ్రెస్ రెండూ నష్టం చేశాయని కాబట్టి ఆ రెండు పార్టీలకు సమదూరంలో ఉంటామని వైసీపీ తేల్చి చెప్పింది. వైసిపీ భవిష్యత్తులో ఏ పార్టీ అధికారం లోకి వచ్చినా తమకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో పార్టీలు ఇన్నాళ్లూ గుట్టుగా వ్యవహరించినా.. ఇప్పుడు తమ వైఖరిని ప్రదర్శించక తప్పలేదు.
 

Similar News