తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రాహుల్ టూర్ ఖరారైంది. ఈ నెల 20న రాష్ట్రానికి రానున్న రాహుల్ పలు కీలక సమావేశాలతో పాటు రెండు భారీ బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్న కాంగ్రెస్ నేతలు ..అధినేత రాకతో కేడర్‌లో ఉత్తేజం మరింత పెరుగుతందని ఆశిస్తున్నారు. ఇందుకోసం భారీగా జనసమీకరణ చేసేందుకు ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తున్నారు.
తాజా ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పోరాడుతున్న కాంగ్రెస్ శ్రేణుల్లో భరోసా నింపేందుకు ..అధినేత రాహుల్ గాంధీ ఈ నెల 20న హైదరాబాద్ రానున్నారు. ఒక్క రోజు పర్యటనలో భాగంగా రాజీవ్ గాంధీ సద్భావన యాత్రతో పాటు కామారెడ్డి, భైంసా బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. 20వ తేదిన ఉదయం పదిన్నర గంటలకు శంషాబాద్ ఏయిర్ పోర్ట్‌కు చేరుకోనున్న ఆయన .. రోడ్డు మార్గం ద్వారా 11 గంటలకు చార్మినార్ చేరుకుంటారు. టీ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ సద్బావన ర్యాలీ లో పాల్గొంటారు. అనంతరం పన్నెండున్నర గంటల నుంచి ఒకటిన్నర గంటల వరకు మధ్యాహ్న భోజనం, వివిధ వర్గాల నేతలు, స్ధానిక ప్రతినిధులతో భేటి కానున్నారు. 2 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని హెలికాప్టర్ ద్వారా ఆదిలాబాద్ జిల్లా బైంసా చేరుకుంటారు. ఇక్కడ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.. అనంతరం 4 గంటలకు బైంసా నుంచి హెలికాప్టర్ ద్వారా 4:45 గంటలకు నిజామాబాద్ జిల్లా కామారెడ్డి చేరుకుంటారు. బహిరంగ సభ అనంతరం సాయంత్రం 6:15కు హెలికాప్టర్ ద్వారా శంశాబాద్ ఏయిర్‌పోర్టుకు బయలుదేరుతారు. హైదరాబాద్ చేరుకున్న అనంతరం పార్టీ ముఖ్యనేతలతో చర్చించి ... 8 గంటల సమయంలో ఢిల్లీ వెళ్లనున్నారు.
రాహుల్ తెలంగాణ టూర్ నేపథ్యంలో టీ కాంగ్రెస్ నేతలు జనసమీకరణపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటికే జిల్లా నేతలతో పాటు పార్టీ అధ్యక్షులతో ప్రత్యేక సమావేశమయిన టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ పలు సూచనలు చేశారు. రాహుల్ టూర్‌లో టీఆర్ఎస్ టార్గెట్‌గా విమర్శలు గుప్పించే అవకాశాలున్నట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దీంతో రాహుల్ పర్యటన తెలంగాణలో ఆసక్తిగా మారింది.