సొట్టుబుగ్గల కుర్రాడి సొగసు తగ్గుతోంది. ఏజ్ బార్ అవుతోంది. లక్ష్యం సాధించిన తర్వాతే పెళ్లి గిల్లీ అంటూ జోకులేసిన రాహుల్ చివరకు పెళ్లి సంగతి తేల్చిచెప్పేశారు. 49 ఏళ్లు వస్తున్నాయి. అది కూడా వచ్చే ఏడాదికి దాటబోతోంది. మరి ఇంకెన్నాళ్లు.? మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అసలు పెళ్లి చేసుకోరా? ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పునర్వైభవం కన్నా యువరాజా వారి పెళ్లే హాట్‌టాపిక్ మారింది. ఇంతలోనే రాహుల్ బాంబు పేల్చేశారు.
మనిషి చూద్దామా ఆరడుగుల అందగాడు. వన్నె లేదనీ కాదు వర్చస్సూ లేదనీ కాదు. అంతకుమించి నవ్వుతే చాలు సొట్టబుగ్గలు మరి ఇంకేంటి? పెళ్లెందుకు కావడం లేదు? ఫాక్ట్ మాట్లాడుకోవాలంటే మ్యారేజ్ ఏజ్ 30 ఇయర్స్. 40 దాటితే లేట్ మ్యారేజ్ అంటారు. మరి 50లో పడుతుంటే ఏమనాలి?
పెళ్లి కానీ పెళ్లి మాటెత్తని ఈ సీనియర్ యువకుడిని చూసి అభిమానులు తెగ ఇదై పోతున్నారు. పలకరిస్తే ఫీలై పోతున్నారు. పార్టీలో ఎవరికీ క్లారిటీ లేదు అంతెందుకు నవమాసాలు కని పెంచిన తల్లికే లేదు. అన్ని విషయాల్లో క్లారిటీతో ఉన్నా తనయుడి పెళ్లి విషయానికొచ్చే సరికి అంతా కన్ఫ్యూజన్.
కాంగ్రెస్ పెద్దలకు యువరాజా వారి పెళ్లే ఇప్పుడు పెద్ద సవాల్‌గా మారుతోంది. టార్గెట్ అంటూ పెళ్లికి టాటా చెప్పిన రాహుల్ తన మ్యారేజ్‌పై హైదరాబాద్‌లో పిచ్చ క్లారిటీ ఇచ్చేశారు. మీడియా చిట్‌చాట్‌లో తనకు ఎప్పుడో పెళ్లయిపోయిందంటూ బాంబ్ పేల్చారు. అదేంటనీ కాస్త డిటైల్డ్‌గా అడిగే సరికి తనకు కాంగ్రెస్‌తో ఎప్పుడో పెళ్లయిపోయిదంటూ సొట్ట బుగ్గలేసుకొని నవ్వుతూ కుండ బద్దలు కొట్టేశారు.
రాహుల్ పెళ్లిపై కాంగ్రెస్ కార్యకర్తల హంగామానే వేరు. రాహుల్ పెళ్లి చేసుకోవాలంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ హల్‌చల్ చేసిన సందర్భాలైతే ఎన్నో. స్టూడెంట్స్‌తో ఇంటారాక్ట్ అయినప్పుడు ప్రచారాలకు వెళ్లినప్పుడు టీవీ ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కొందరు చిలిపి ప్రశ్నలు వేశారు. పెళ్లెప్పుడు సార్ అంటూ కాస్త కొంటెగానే అడిగారు. అయినా మనిషి తగ్గారా? అదే నవ్వు. అవే సొట్టబుగ్గలు. సమాధానం దాటవేస్తారు.