రాఫెల్ రహస్యం రట్టయ్యింది. డీల్‌లో మోడీ సర్కారు ఇరుకున పడే విషయం వెలుగుచూసింది. ఇన్నాళ్లూ కుట్ర కోణం ఉందంటూ జరిగిన ప్రచారానికి మరింత బలం చేకూరింది. రాఫెల్ యుద్ధ విమానాల తయారీలో భాగస్వామిగా ఉన్న రిలయన్స్ డిఫెన్స్‌ను ఎంపిక చేసింది.. భారత ప్రభుత్వమే అని.. అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు.. హోలండ్ బాంబ్ పేల్చారు. రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలులో భారీ స్కామ్ జరిగిందంటూ.. ప్రతిపక్ష కాంగ్రెస్ చేస్తున్న ప్రచారానికి గట్టి ఆయుధం దొరికినట్లైంది. రాఫెల్ విమానాల తయారీలో భాగస్వామిగా ఉన్న రిలయన్స్ డిఫెన్స్‌ను ఎంపిక చేసింది.. మోడీ ప్రభుత్వమే అని.. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ తెలిపారు. ఈ విషయాన్ని ఫ్రెంచ్ పత్రిక మీడియా పార్ట్ వెల్లడించింది.
2015 లో ఫ్రాన్స్ ప్రధాని హోలండ్, భారత ప్రధాని మోడీ సమక్షంలో కుదిరిన రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని.. ప్రతిపక్షాలు కోడై కూస్తున్నాయి. దీనికి ధీటుగా బీజేపీ కూడా ప్రతిస్పందిస్తోంది. ఈ సమయంలో.. ప్రతిపక్షాల ఆరోపణలకు ఆక్సీజన్ అందించింది.. మీడియా పార్ట్. ఆ పత్రిక అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలండ్‌తో జరిపిన ఇంటర్వ్యూలో.. ఆనాటి ఒప్పందం వివరాలను బయటపెట్టింది. ఈ వ్యవహారంలో తమ ప్రమేయం ఏదీ లేదని.. భారత ప్రభుత్వమే రిలయన్స్ డిఫెన్స్ పేరును ప్రతిపాదించిందని.. అందుకే ద సాల్ట్ ఏవియేషన్ సంస్థ.. తమ భాగస్వామిగా రిలయన్స్ డిఫెన్స్ ను ఎంపిక చేసుకుందని.. వివరించారు.
2015 ఎప్రిల్ 10 న ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ.. 36 రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయనున్నట్లు.. ప్రకటించారు. అయితే సర్వీస్ ప్రొవైడర్‌గా.. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ సంస్థను ఎంపిక చేసింది. ఇక్కడే అసలు రహస్యం దాగుందని.. ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. ఈ ఢీల్‌కు ముందే ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలండ్ భాగస్వామి అయిన జూలీ గయట్.. నిర్మించిన ఓ సినిమా ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటోంది. దీనికి అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఎంటర్‌టైన్ మెంట్ ఆర్థికసాయం చేసింది. దీంతో రాఫెల్ కొనుగోళ్లకు, ఈ సినిమాకు సంబంధం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని.. హోలండ్ చెప్పుకొచ్చారు.
ఈ రాఫెల్ ఒప్పందం అనేది యూపీఏ హయాంలో మొత్తం 126 విమానాల కొనుగోలుకు ప్రతిపాదన చేశారు. దీని బాధ్యతను ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందూస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ కు అప్పగించారు. అయితే మోడీ వచ్చాక.. హెచ్‌ఏఎల్‌ను కాదని.. రిలయన్స్ డిఫెన్స్‌కు అప్పగించడం ఆరోపణలకు తావిచ్చింది. ఎందుకంటే.. అప్పటికి రిలయన్స్ డిఫెన్స్ ఏర్పాటు చేసి.. కేవలం 12 రోజులు మాత్రమే అయ్యింది. ఈ విషయమే ప్రతిపక్షాలకు ఆయుధంగా దొరికింది.