బెలూన్లు, గ్రీటింగ్‌లు,నక్షత్రాలతో క్రిస్మస్‌ ట్రీని ఎందుకు అలంకరిస్తారు?

Update: 2018-12-23 07:24 GMT


క్రిస్మస్ అనగానే ప్రతి ఇంటిపై వెలిగే నక్షత్రాలు గుర్తొస్తాయి. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుగుతాయి. దాదాపు ప్రతి క్రిస్టియన్ ఇంటిపైనా స్టార్ లను పెడతారు. ఇంటిని అందంగా ముస్తాబు చేస్తారు. రంగురంగుల బెలూన్లు, అలకంరణ వస్తువులతో చర్చిలను డెకరేట్ చేస్తారు. కానీ ప్రతి అలంకరణకు కారణముంది. వేడుకల్లో పరమార్థముంది. ముందుగా స్టార్ సంగతి తెలుసుకుందాం. యేసు ప్రభువు బెత్లహేంలో జన్మించినప్పుడు జ్ణానులకు దారి చూపించింది ఈ నక్షత్రమే. ఎక్కడో  ప్రాంతం నుంచి జ్ణానులు క్రీస్తు పుట్టిన స్థలానికి రావడానికి స్టార్ ఉపయోగపడింది. అది దేవుడు ఏర్పాటు చేసిన స్టార్ అని క్రైస్తవుల నమ్మకం.  అందుకే ప్రతి ఇంటిపై స్టార్ పెడతారు. తమ ఇంట్లోనూ క్రీస్తు జన్మించాడని సూచికగా స్టార్‌ను వేలాడదీస్తారు. 

ఇక క్రిస్మస్ చెట్టు. స్టార్లు, బెలూన్లు, గ్రీటింగ్ కార్డులతో అందంగా ముస్తాబవుతుంది ట్రీ. దీనికీ ఓ కథ ఉంది. యేసు జన్మించినప్పుడు ఆకాశంలో తారలు దేదీప్యమానంగా వెలిగాయి. పువ్వులు అందంగా వికసించాయి. పండ్లతో చెట్లు ఫలాలనిచ్చాయి. ప్రక్రుతిలోని ప్రతిదీ పరవశించింది. కానీ క్రిస్మస్ ట్రీ ఏమంత అందంగా ఉండదు. స్టార్ల వెలుగును చూసి, పువ్వుల నవ్వులు చూసి తాను ఏమీ బాలేనని డల్ అయి పోతుందట .క్రిస్మస్ చెట్టు. ఆకాశం నుంచి క్రిస్మస్ ట్రీ విచారం చూసిన నక్షత్రాలు చాలా బాధపడ్డాయి. వెంటనే నక్షత్రాలన్నీ చెట్టుపై వాలిపోయాయట. దీంతో అన్నిటికన్న క్రిస్మస్ ట్రీ అందంగా తయారైంది.

 దీనిలో ఉన్న అర్థమేంటంటే, నిరుపేదయినా క్రీస్తు ప్రేమను తనలో నింపుకుంటే ఆనందపరవశం పొందుతాడని. అందుకే క్రిస్మస్ సందడిలో క్రిస్మస్ ట్రీని అందంగా ముస్తాబు చేస్తారు. క్రిస్మస్ సీజన్ లో కోట్లాది రూపాయల్లో ఈ ట్రీ బిజినెస్ జరుగుతుంది. చర్చి, ఇళ్లల్లో క్రిస్మస్ ట్రీ ప్రత్యేక ఆకర్షణ. క్రిస్మస్ ట్రీ సంప్రదాయం మధ్యయుగంలో జర్మనీలో ఆరంభమైందని చెబుతారు. 18వ శతాబ్దంలో విక్టోరియా రాణి తన రాజ్య భవనంలో ఒక క్రిస్మస్ చెట్టును ఏర్పాటు చేయడంతో అది అత్యధికంగా ప్రాచుర్యం పొంది, క్రైస్తవులందరి ఇళ్లలోకీ క్రిస్మస్ ట్రీ చేరింది. ఆ చెట్టును దీపాలు పెట్టి మొదటగా అలంకరించింది సంస్కరణోద్యమ పితామహుడు మార్టిన్ లూథర్ అట. అప్పటి నుండి క్రిస్మస్ చెట్టును పళ్లు, కానుకలతోనే కాక దీపాలతో కూడా అలంకరిస్తున్నారు.

చెట్టును ఆనందానికి, పచ్చదనానికి, సిరి సంపదలకు చిహ్నంగా ప్రపంచంలోని అన్ని నాగరికతలూ భావిస్తున్నాయి. పైగా చెట్టుకు ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదు. అందుకే ఇవ్వడం, ప్రేమించడం, క్షమించడం ప్రధానాంశాలుగా ఉన్న క్రిస్మస్ పండుగ రోజున క్రిస్మస్ చెట్టుతో ఇంటిని అలంకరించుకుంటారు. కేక్‌ మిక్సింగ్. దాదాపు అన్ని దేశాల్లోనూ కేక్‌ మిక్సింగ్‌ సందడిగా జరుగుతుంది. క్రిస్మస్ రోజున, కేక్‌ కట్‌ చేస్తారు. నోరు తీపి చేసుకుంటారు. ఇక క్రిస్మస్ సమయంలో క్యాండిల్ లైటింగ్ స్పెషల్ అట్రాక్షన్. అలాగే చర్చిలు, క్రైస్తవుల ఇళ్లన్నీ అలంకరణలతో దేదీప్యమానంగా వెలిగిపోతాయి. క్రీస్తు పుట్టడం ఈ లోకానికే కాదు, ప్రతి మనిషి హృదయానికి వెలుగన్నది ఈ దీపాల వెలుగులోని పరమార్థం. అలాగే 1848లోనే, క్రిస్మస్ గ్రీటింగ్ కార్డులు ఇచ్చిపుచ్చుకోవడం ప్రారంభమైంది. ఒకరికొకరు, క్రీస్తు జన్మదిన సందేశాన్ని పంచుకునేందుకు, గ్రీటింగ్‌ కార్డు ఇచ్చుకున్నారు. ఇప్పుడు గ్రీటింగ్‌ కార్డుల సందడి అంతగా లేకపోయినా, ఒకప్పుడు చిన్నారులు, యువకులు చాలా సంతోషంగా కార్డులు షేర్ చేసుకునేవారు.

Similar News