ముందస్తు ఎన్నికల్లో అధికార పార్టీలకు చేదు అనుభవం...

Update: 2018-08-23 08:12 GMT

తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తే ఎవరికి లాభం ? టీఆర్ఎస్‌ రెండోసారి అధికారంలోకి వస్తుందా ? లేదంటే ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ను విజయం వరిస్తుందా ? ఏపీలో తెలుగుదేశం, వైసీపీ పరిస్థితి ఏంటీ ? గతంలో జరిగిన ముందస్తు ఎన్నికలతో ఏ పార్టీలు బోల్తా పడ్డాయ్. 

ముందస్తు ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు జరిగిన ముందస్తు ఎన్నికల్లో అధికార పార్టీకి ఛేదు అనుభవమే ఎదురవుతోంది తప్పా తిరిగి అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడు సార్లు  ముందస్తు ఎన్నికలు జరిగితే అధికార పార్టీలకు ఓటమే ఎదురైంది. అనివార్యమైన పరిస్థితుల్లో జరిగేది అంటే వివిధ కారణాల రీత్యా ప్రభుత్వం రద్దయి, గడువు కంటే ముందు ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి రావడం ఒకటైతే రెండోది విజయంపై ధీమాతో రాజకీయ ప్రయోజనాలను ఆశించి అధికారంలోని పార్టీలు ముందస్తుకు వెళ్లడం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండూ చోటుచేసుకున్నాయి. 

ఏపీ ఆవిర్భావం నుంచి 1978 వరకు షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరిగాయి. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టాక అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలిసారిగా ముందస్తుకు వెళ్లింది. షెడ్యూల్‌ ప్రకారం 1983 ఆగస్టులో ఎన్నికలు జరగాల్సి ఉన్నా 1982లో నిర్వహించారు. అప్పటి సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి హైకమాండ్‌ అనుమతితో ఎన్నికలను ముందుకు జరిపారు. తెలుగుదేశం పార్టీ ప్రభంజనం ముందు కాంగ్రెస్‌ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. 202 స్థానాలు సాధించడంతో ఎన్టీఆర్‌ సీఎం అయ్యారు. ఇందిరాగాంధీ హత్యతో సానుభూతి వెల్లువెత్తుతుందని సందేహాలున్నా 1984 డిసెంబరు 14న రాష్ట్ర అసెంబ్లీ రద్దు చేయాలని అప్పటి గవర్నర్‌ శంకర్‌దయాళ్‌ శర్మకు ఎన్టీఆర్‌ సిఫార్సు చేశారు. 1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయఢంకా మోగించింది. తర్వాత 1990 మార్చిలో అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ ఎన్టీఆర్‌ ఎన్నికలను నాలుగునెలల ముందుకు జరిపారు. ముందస్తు ఎన్నికల్లో ఎన్టీఆర్‌‌కు ఛేదు అనుభవం ఎదురైంది. మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం 1989లో కొలువుదీరింది. 

1994లో షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరిగినా 1999లో డిసెంబర్లో జరగాల్సిన ఎన్నికలు రెండు నెలల ముందు నిర్వహించడంతో టీడీపీ రెండోసారి అధికారం చేపట్టింది. మావోయిస్టుల దాడి తరువాత వచ్చిన సానుభూతి ఆశలు రేకెత్తించడంతో  2004 వరకూ అసెంబ్లీ గడువు ఉన్నప్పటికీ 2003 నవంబరులోనే అసెంబ్లీని రద్దు చేశారు అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు. ఎలక్షన్‌ కమిషన్‌ మాత్రం ఎన్నికలను 2004లోనే జరిపింది. అయితే చంద్రబాబు నాయుడుకు ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ జయభేరి మోగించింది. అంటే ముందస్తుకు ప్రయత్నించిన కోట్ల, ఎన్టీఆర్‌, చంద్రబాబు ముగ్గురూ భంగపడ్డారు.

1969లో ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీని అప్పటి కాంగ్రెస్‌ అధ్యక్షుడు నిజలింగప్ప బహిష్కరించడంతో కాంగ్రెస్‌లో చీలిక వచ్చింది. దీంతో మైనారిటీ ప్రభుత్వానికి సారథ్యం వహించిన ఇందిరాగాంధీ తొలిసారిగా ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. గరీబీ హఠావో నినాదంతో వెళ్లి 352 స్థానాల్లో గెలుపొంది ప్రధాన మంత్రి అయ్యారు. ఇందిర హత్యానంతరం 1984లో ప్రధాని అయిన రాజీవ్‌గాంధీ వెంటనే లోక్‌సభకు ఎన్నికలకు వెళ్లి 414 సీట్లలో గెలుపొందారు. 2004లో అప్పటి ఎన్‌డీఏ సారథి, ప్రధాని వాజ్‌పేయి ముందస్తుకు వెళ్లడానికి అయిష్టంగా ఉన్నా ఆయన సహచరుడు ఉప ప్రధాని ఎల్‌కే ఆడ్వాణీ ముందస్తుకు వెళ్లాలని సూచించారు. భారత్‌ వెలిగిపోతోంది అన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన వాజ్‌పేయి ప్రభుత్వానికి భంగపాటు తప్పలేదు. 
 

Similar News