గులాబీ కోటను కూల్చేస్తామన్నారు. ఎగ్జిట్‌పోల్స్ పచ్చి బూటకమన్నారు. మెరుగైన పాలన అందిస్తామన్నారు. తెలంగాణ ఇచ్చింది, తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ కూటమే అన్నారు. కానీ కారు స్పీడ్‌కు కకావికలమయ్యారు. ఫార్ములా వన్ రేసులా దూసుకొచ్చిన కారు చక్రాల కింద పడి నలిగిపోయారు. ప్రజాకూటమి కొంప కొల్లేరు కావడానికి ఏడు కారణాలున్నాయి అవెంటో చూద్దామా?. ఒకవైపు కేసీఆర్ దండయాత్ర సంకేతాలు పంపిస్తూనే ఉన్నారు. ముందస్తు సమరం తప్పదని చెబుతూనే ఉన్నారు. కానీ ఇవన్నీ ప్రత్యర్థి కాంగ్రెస్ పసిగట్టలేకపోయింది. హఠాత్తుగా వచ్చిపడిన ముందస్తు యుద్ధానికి సిద్దంగా లేకపోవడమే కాంగ్రెస్ కూటమికి తొలి కారణం. ఒకదాని వెంట ఒకటి వచ్చిపడుతున్న అస్త్రాలను ఎదుర్కోలేక, దాదాపు అస్త్రసన్యాసమే చేసింది కాంగ్రెస్ కూటమి.
ఒకవైపు అసెంబ్లీ రద్దు, అభ్యర్థుల ప్రకటన, సభలు, సమావేశాలతో, జెట్ స్పీడ్‌తో కేసీఆర్ దూసుకెళ్తుంటే, ప్రజాకూటమి మాత్రం నత్తకు నడకలు నేర్పించింది. పొత్తులు తేల్చడంలో కాలపయాన చేసింది. అంతులేని గందరగోళంతో కొట్టుమిట్టాడింది. నామినేషన్ల చివరి తేదీ వరకూ అభ్యర్థులను ఫైనల్ చేయలేకపోయింది. టీడీపీ, టీజేఎస్, సీపీఐలకు సీట్లు ఇవ్వడంలో కన్‌ఫ్యూజ్ చేసింది. కూటమిలోనే సీట్ల కుంపటి రేగింది. అందుకే ప్రచారంలో వెనకబడింది. పొత్తులు-సీట్ల పంపకాల ఆలస్యం, ప్రజాకూటమి ఓటమి కారణాల్లో మరొకటి.
నిజంగా చంద్రబాబుతో పొత్తు కాంగ్రెస్ కూటమిపై పెను ప్రబావం చూపింది. 2014 ఎన్నికల్లో టీడీపీ ఓటింగ్ శాతం చూసి, సెటిలర్లపై ఆశలు పెట్టుకుని, ఇంకా అనేక సహకారాలతో చంద్రబాబుపై, వల్లమాలిన విశ్వాసం కనబరిచింది కాంగ్రెస్. ప్రజాకూటమిలో కాంగ్రెస్సే పెద్దన్నయినా, చంద్రబాబే అధినాయకుడిగా కనిపించారు. చంద్రబాబు వెనకాల నడుస్తూ ఉత్తమ్ మీడియాలో కనిపించారు. అప్పటికే బాబును బూచిగా చూపడంలో సక్సెస్ అయిన టీఆర్ఎస్‌కు, ఈ దృశ్యాలు ఆయుధాలయ్యాయి. సోషల్ మీడియాలో హైలెట్ అయ్యాయి. చంద్రబాబు కూటమి అధికారంలోకి వస్తే, తెలంగాణలో మరోసారి ఆంధ్రాపార్టీ పెత్తనం పెరుగుతుందన్న టీఆర్ఎస్ ఆరోపణలను తిప్పికొట్టడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయ్యింది. ఆ విధంగా చంద్రబాబుతో పొత్తు కాంగ్రెస్ కూటమికి వికటించింది. అసలే పథకాలు, సమీకరణాలతో దూసుకెళ్తూ, ప్రజల్లో విశేష ఆదరణ పొందుతున్న కేసీఆర్ సర్కారు పట్ల, జనంలో వ్యతిరేకత అంతగా లేదని కాంగ్రెస్‌కు తెలుసు. ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, దళితులు, రైతుల్లో ఒక వర్గం వ్యతిరేకతనే నమ్ముకున్నా, దాన్ని విస్తృత జనాభిప్రాయంగా మలచడంలో ఫెయిలయింది. అసలు టీఆర్ఎస్ సర్కారును ఎందుకు ఓడించాలో వివరించలేకపోయారు. అందుకే గులాబీ బాస్‌ను గద్దె దించడానికి, ప్రజాకూటమిని గద్దె ఎక్కించడానికీ, ప్రజలకు కూడా పెద్దగా కారణాలు కనపడలేదు.
కేసీఆర్ అంతటి బలమైన నాయకుడికి ధీటుగా, కాంగ్రెస్‌లో ఒక్కరూ కనిపించలేదు జనాలకు. సీఎం కాగల శక్తివంతమైన లీడర్లు కాగడాపెట్టి వెతికినా కనపడలేదు. ముఠా తగాదాలతో ఎవరినీ ప్రోజెక్ట్ చేయలేకపోయింది కాంగ్రెస్. హస్తం పార్టీలో 30 మంది సీఎం అభ‌్యర్థులున్నారంటూ, టీఆర్ఎస్ చేసిన విమర్శలను జనం నమ్మారు. ఆర్నెళ్లకు ఒకసారి మారిపోయే ఢిల్లీ సీల్డ్ కవర్ సీఎం కావాలా....సింగిల్‌గా సింహంలా ఉండే సీఎం కావాలా అంటూ కేటీఆర్, హరీష్ ఇతర అభ్యర్థులు చేసిన ప్రచారం జనంలో బలంగా నాటుకుంది. పదేళ్ల హయాంలో కాంగ్రెస్ పాలన చూసిన జనం, ఒకవేళ మళ్లీ హస్తం పార్టే వస్తే అభివృద్ది కుంటుపడుతుందని, సంక్షేమ పథకాలు ఆగిపోతాయని భయపడ్డారు. ఆ భయాన్ని తుంచేసి అభయమిచ్చే ఒక్క గట్టి నాయకుడూ కాంగ్రెస్ కూటమిలో కనిపించనందుకే, ఎందుకైనా మంచిది కేసీఆరే కావాలని భావించారు. ఓట్ల వర్షం కురిపించి, వీరతిలకం దిద్దారు.
పొత్తుల చిక్కులతోనే కాలయాపన చేసిన ప్రజాకూటమి, గెలుపు గుర్రాలను పసిగట్టడంలో విఫలమైంది. ఏళ్లుగా పార్టీకి పని చేస్తున్న ఆశావహులను కాదని, పొత్తుల్లో భాగంగా టీడీపీ, టీజేఎస్, సీపీఐలకు ఇవ్వాల్సి వచ్చింది. దీంతో చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ రెబల్స్ బరిలోకి దిగారు. ఓట్లు చీలిపోయి అంతిమంగా టీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి దోహదం చేశారు. ఒక నాయకుడు పైకి ఎగబాకిన వెంటనే, అతన్ని కిందకు లాగే ముఠా సంస్కృతి కాంగ్రెస్‌లో అధికం. అందుకే పీజేఆర్, వైఎస్సార్ తర్వాత అంతటి ప్రజాదరణ నాయకులు తయారుకాలేకపోయారు. ఎవరికి వారే స్టార్ క్యాంపెయినర్లుగా ఫీలయ్యారు కానీ, ఒక్కర్నీ ప్రొజెక్ట్ చేయలేకపోయింది కాంగ్రెస్. ప్రచార కమిటీ ఉన్నా, అది పేపర్‌కే పరిమితమైంది. సీఎం అభ్యర్థులుగా ప్రచారం చేసుకునే, ఉద్దండ నాయకులు కూడా తమతమ నియోజకవర్గాల్లోనే ఉండిపోయారు. అందుకే సోనియా గాంధీ సభ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. రాహుల్ సభల కోసం ప్లాన్ చేశారు. వారే దిక్కంటూ దిక్కులు చూశారు. చుక్కానిలేని నావలా కాంగ్రెస్‌ను చూసిన జనం, కేసీఆర్ కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టుగా, ప్రజాకూటమి పరాజయానికి మరెన్నో కారణాలు. గాంధీ భవన్ లోపాలే, తెలంగాణ భవన్‌ను కళకళలాడించాయి. సత్తాలేని ప్రజాకూటమిని పత్తాలేకుండా చేశాయి. కోదండరాం వంటి ఉద్యమ నాయకులు ఉన్నా, చంద్రబాబును ముందుపెట్టి, ప్రొఫెసర్‌ను ప్రొజెక్ట్ చేయలేకపోయింది. మరి ఓటమికి కారణాలను అంతకరణశుద్దిగా పరిశీలన చేసుకుంటుందా ప్రతిపక్షంగా ఇకనైనా బలంగా వాణి వినిపిస్తుందా.