ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. కేసీఆర్ చెప్పినట్టే డిసెంబర్‌లోనే సమరం జరగబోతోంది. అంటే ఎన్నికలకు ఇంకా కేవలం రెండే రెండు నెలలు మిగిలి ఉన్నాయి. మరి గులాబీ సర్వసన్నద్దంగా ఉందా...మహాకూటమి మహాయుద్దానికి రెడీ ఉందా...ఒంటరి ఫీలింగ్ వదిలి, కమలనాథులు రణక్షేత్రానికి సై అంటున్నారా...సీపీఎం బీఎల్‌ఎఫ్ దారెటు పోతోంది...ఇప్పటి వరకు పార్టీలేం చేశాయి....ఇకముందు రెండు నెలల్లో ఎలాంటి కార్యాచరణను పట్టాలెక్కించబోతున్నాయి?
తెలంగాణ ఎన్నికలకు ఇప్పటివరకైతే ఫుల్ ప్రిపరేషన్‌గా ఉన్న ఏకైక పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. శాసన సభ రద్దుకు తీర్మానం చేయడం, వెనువెంటనే 105 మంది అభ్యర్థులను ప్రకటించడం, మరుసటి రోజే హుస్నాబాద్ సభతో ఎన్నికల శంఖారావం పూరించి, మెరుపు వేగంతో దూసుకెళ్లింది టీఆర్ఎస్ కారు. ప్రతిపక్షాల కంటే మైళ్ల దూరం ముందుంది.
ఆ తర్వాత కేటీఆర్ అడపాదడపా సభలు పెట్టడం, సురేష్ రెడ్డితో పాటు పలువురు ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం వంటి పరిణామాలు జరిగినా, కేసీఆర్ మాత్రం బయటకు రాలేదు. వినాయక నిమజ్జనం కారణంగా, ప్రజాశీర్వాద సభలకు విరామం ప్రకటించారు. కానీ మొన్న నిజామాబాద్ సభతో రీఎంట్రీ ఇచ్చారు కేసీఆర్. అ తర్వాత వరుసగా నల్గొండ, వనపర్తి సభలతో కారు గేర్లు మార్చుతూ, వాడివేడి ప్రసంగాలతో చెలరేగిపోతున్నారు. అటు అభ్యర్థులు సైతం ఇప్పటికే నియోజకవర్గాల పరిధిలోని సగం గ్రామాలను చుట్టేశారు. వాడవాడకు తిరుగుతూ, గడపగడపకు మొక్కుతూ ముందుకు పోతున్నారు. రానున్న రోజుల్లో ఒకే రోజు రెండు సభల్లో పాల్గొనాలని, కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారు.
అయితే, 105 మంది అభ్యర్థులనైతే టీఆర్ఎస్ ప్రకటించింది కానీ, ఇంకా 14 స్థానాలకు గెలుపు గుర్రాలను ఖరారు చేయలేదు. దీంతో ప్రకటించని నియోజకవర్గాల్లోనూ, ఇద్దరేసి ఆశావహులు ప్రచారం కూడా ప్రారంభించారు. ప్రకటించిన స్థానాల్లోనూ అసమ్మతి తీవ్రంగా ఉండటం, కారుకు టెన్షన్ పుట్టిస్తోంది. అభ్యర్థులను మారుస్తారన్న ఊహాగానాలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ఇంకా టైం రెండు నెలలే ఉండటంతో, సర్వసన్నద్దమయ్యేందుకు చకచకా పావులు కదుపుతోంది గులాబీదళం.
కారు గేర్లు మార్చి, రయ్యిన దూసుకెళుతుంటే, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి మాత్రం ముందుకు కదలడం లేదు. రోజుల తరబడి చర్చలు జరుపుతున్నా, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి రావడం లేదు. ఎవరి ప్రణాళికలు వారికుండటంతో, ఉమ్మడి ప్రణాళిక పట్టాలెక్కడం లేదు. సమయం కేవలం రెండు నెలలే ఉండటంతో, అతి త్వరలో అభ్యర్థులను ప్రకటించి, కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని ప్రజల ముందు ఉంచుతామని మహాకూటమి నేతలంటున్నారు. కూటమిగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తామంటున్నారు.
అయితే, కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జన సమితి మాత్రం, కూటమిలో కొనసాగడంపై సందిగ్దం నెలకొంది. భారీగా టీజేఎస్ సీట్లు ఆశిస్తుండటం, సీఎంపీ ఛైర్మన్ పదవి కావాలంటుడటంతో, ప్రతిష్టంభన కొనసాగుతోంది. కూటమి నుంచి బయటికొచ్చి, సొంతంగా లేదా బీజేపీతో కలిసి టీజేఎస్ ఎన్నికల బరిలోకి దూకుతుందన్న ప్రచారం కూడా సాగుతోంది. టీఆర్ఎస్ ఇప్పటికే చాలా సభలతో దూసుకుపోతుంటే, కాంగ్రెస్ మాత్రం మొన్న, జోగులాంబ, గద్వాలలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి, కత్తులు దూసింది. కేసీఆర్ మూడు సభలు, కేటీఆర్ పలు సభలతో ముందుంటే, ప్రచార సభల నిర్వహణలో మాత్రం కాంగ్రెస్ ఇంకా వెనకబడి ఉంది. రానున్న రెండు నెలల్లో సోనియా, రాహుల్‌ని సైతం రాష్ట్రానికి రప్పించి, భారీ ఎత్తున సభలు పెడతామంటున్నారు కాంగ్రెస్ నేతలు.
టీఆర్ఎస్, మహాకూటమి కాకుండా, ఒంటరిగా దిగుతోంది భారతీయ జనతా పార్టీ. మొన్నటి వరకు టీడీపీతో జట్టుకట్టిన కాషాయ పార్టీ, ఈసారి మాత్రం సింగిల్‌గా ఫైట్ చేసేందుకు సిద్దమైంది. అధికారికంగా అభ్యర్థులను ప్రకటించకపోయినా, ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ తరపున అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇక సీపీఎం సంగతి సరేసరి. బీఎల్‌ఎఫ్ అంటుంది...జనసేనతో కలిసి పోరాడతామంటుంది. ఇప్పటికే అభ్యర్థులను సైతం ప్రకటించినా, ప్రచారంలో ఎక్కడుందో తెలీదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 7న జరగబోతున్నాయి. 11న ఫలితాలు. అంటే పోలింగ్‌కు రెండు నెలల టైం ఉంది. అయితే, మ్యానిఫెస్టోలను మాత్రం ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా అధికారికంగా ప్రకటించలేదు. ఇంకా ప్రణాళికను వండివారుస్తూనే ఉన్నాయి. మొత్తానికి ఎన్నికల తేదీ కూడా ఫిక్స్ కావడంతో, అన్నింటినీ సర్దుబాటు చేసుకుని, సమరంలోకి దూకాలని కత్తులు దూస్తున్నాయి. చూడాలి, ఈ రెండు నెలల కాలంలో, ఇంకెన్ని రాజకీయ మలుపులు, విన్యాసాలు ఉంటాయో.