మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ వర్గాలు మంచి జోరు మీదున్నాయి. నాగం, రేవంత్, అరుణ పాలమూరు త్రయంగా పిలిచే వీరు ముగ్గురు టిఆరెస్ పై ముప్పేట దాడి చేసేస్తున్నారు ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నా వీరి దాడి తట్టుకోడం చేత కావడం లేదు. ఉమ్మడి మహబూబ్‍నగర్ జిల్లాకి ఎన్నికల మూడ్ వచ్చేసింది అధికార టీఆర్‍ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్దం ముదురుతోంది. అధికారంలో లేకపోయినా బలమైన నేతలు, క్యాడర్ ఉండటంతో టిఆర్‍ఎస్ కి వణుకు పుట్టిస్తోంది కాంగ్రెస్. జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు, ఓ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు ఉన్నా కాంగ్రెస్ పార్టీ నాయకుల దూకుడును పూర్తిస్థాయిలో అడ్డుకోలేకపోతున్నారు. ముఖ్యంగా రాజకీయాల్లో తల పండిన నాగం జనార్ధన్ రెడ్డి, రేవంత్‍రెడ్డీలకు తోడు, అప్పటికే పార్టీలో ప్రధాన భూమిక పోషిస్తున్న డికే అరుణ కూడా తోడవడంతో రాష్ట్రంలో ఎలా ఉన్నా పాలమూరు జిల్లాలో మాత్రం వార్ వన్ సైడ్ అనే ఫీల్ కలుగుతోంది. నాగం పార్టీలో చేరి కొద్దిరోజులే అయినా టిఆరెస్ పై ఎప్పటిలాగే దూకుడును ప్రదర్శిస్తున్నారు. టిఆరెస్ ఎమ్మెల్యేలతో తనకు ప్రాణహాని ఉందని నాగం లాంటి వ్యక్తి పేర్కొనడంతో పాలమూరు రాజకీయ రంగస్థలంగా మారింది.
నాగం పెట్టిన కేసులను అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. పాలమూరు ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ఇన్నాళ్ళు కేసులు పెట్టిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు తమపై కేసులు పెట్టడం ప్రారంభించారని ఎదురుదాడికి దిగుతున్నారు. ఇటు కేటీఆర్ సైతం మహబూబ్‍నగర్ జిల్లాలో జరిగిన ఏ సమావేశాల్లోనైనా డికే అరుణ, రేవంత్, నాగంలపై విమర్శించకుండా ప్రసంగం ముగించడం లేదు. కేటిఆర్ కామెంట్లకు కౌంటర్ ఇవ్వడంలో కాంగ్రెస్ ఏ మాత్రం లేటు చేయడం లేదు. పాలమూరులో ప్రాజెక్టులు ప్రారంభించింది కాంగ్రెస్, పూర్తి చేసిందీ కాంగ్రెస్సేనని గట్టిగా వాదిస్తూ దీటైన సమాధానం చెబుతున్నారు డికే అరుణ.
ఉమ్మడి మహబూబ్‍నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులైన నాగం, డికె అరుణ, రేవంత్‍రెడ్డిలు వచ్చే ఎన్నికల్లో ఈ జిల్లా నుంచే పోటీచేస్తుండటంతో వీరి గెలుపు నల్లేరుమీద నడకగానే మారే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఆధిపత్యం ప్రదర్శించడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ టీడిపీతో పొత్తు కుదిరితే ఇక కాంగ్రెస్‍కు ఉమ్మడి మహబూబ్‍నగర్ జిల్లాలో ఎదురులేకుండా పోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.