ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రకటించిన మోదీ...ఒక్కో కుటుంబానికి 5 లక్షల ఆరోగ్య బీమా
దేశంలోని పేదలకు ఉచితంగా వైద్యసాయం అందించే లక్ష్యంతో చేపట్టిన ప్రధానమంత్రి జన్ ఆరోగ్య అభియాన్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట వేదికగా ప్రకటించారు. 72వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధాని మోడీ.. పేదలు, మధ్య తరగతి ప్రజలందికీ ఉచితంగా వైద్యసాయం అందించనున్నట్లు చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ప్రధానమంత్రి జన్ ఆరోగ్య అభియాన్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. సెప్టెంబర్ 25న దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి నుంచి పథకాన్ని ప్రారంభించనున్నట్లు ప్రధాని మోడీ వెల్లడించారు. ఈ పథకం ద్వారా పేద, మద్యతరగతి వర్గాల వారందరికీ ఉచితంగా వైద్యసాయం అందుతుందన్నారు. తొలి విడతలో 10 కోట్ల కుటుంబాలకు పథకం వర్తింపజేస్తామన్నారు ప్రధాని మోడీ.
జన్ ఆరోగ్య అభియాన్ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి ఐదు లక్షల వరకు ఆరోగ్య భీమా వర్తిస్తుంది. సామాజిక, ఆర్ధిక, కుల గణాంకాల డేటా ఆధారంగా లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను మొదలు పెట్టారు. ఇప్పటికే 80 శాతం మంది ఈ పథకం ద్వారా వైద్యసేవలు అందించుకునేందుకు అర్హులుగా గుర్తించారు. ఈ పథకం ద్వారా 1354 రకాల చికిత్సలు చేయించుకునే విధంగా ఆరోగ్య శాఖ రూపకల్పన చేసింది.
గుండె బైపాస్, మోకీలు మార్పిడి తదితర శస్త్రచికిత్సలు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్) కన్నా 15-20 శాతం తక్కువ ధరకే అందునున్నాయి. ఈ పథకంలో చేరిన ప్రతి ఆసుపత్రిలోనూ రోగులకు సాయం అందించడానికి ఒక ‘ఆయుష్మాన్ మిత్ర’ ఉంటారు. లబ్ధిదారుల అర్హతలను పరిశీలించడానికి ఒక ‘హెల్ప్ డెస్క్’ను కూడా నిర్వహిస్తారు. క్యూఆర్ కోడ్లు కలిగిన పత్రాలను లబ్ధిదారులకు అందించనున్నారు. కనీసం పది పడకలున్న ఆసుపత్రులను కూడా ఈ పథకంలో చేర్చనున్నారు. అవసరమైతే ఈ నిబంధనను మరింత సడలించే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండే విధంగా రూపకల్పన చేశారు.