తెలంగాణలో గ్రామపంచాయితీ సర్పంచ్ ల స్థానంలో అధికారులే స్పెషల్ ఆఫీసర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్పంచ్ లకే తిరిగి అధికారం ఇస్తే న్యాయపరంగా చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు.
ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి తెలంగాణలో సర్పంచ్ ల స్థానంలో పర్సన్ ఇంచార్జ్ లే బాధ్యతలు నిర్వహిస్తారని ప్రభుత్వం ప్రకటించింది. గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర స్థాయి అదికారులు పర్యవేక్షిస్తారని సీఎం కేసీఆర్ తెలిపారు. పర్సన్ ఇంచార్జులు, పంచాయితీ కార్యదర్శుల నియామకంపై ప్రగతి భవన్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సర్పంచ్ లకే తిరిగి అధికారం ఇస్తే చట్టపరంగా ఇబ్బందులు ఎదురవుతాయని ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సూచించడంతో స్పెషల్ అధికార్లను నియమిస్తున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు.
ఆగస్ట్ 2 నుంచి అమల్లోకి రానున్న కొత్త గ్రామపంచాయితీలను గొప్పగా తీర్చి దిద్దాలన్నారు. గ్రామాల్లో తమ దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 30కోట్ల నిధులు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. కొత్తగా వచ్చే పర్సన్ ఇంచార్జులు గ్రామ కార్యదర్శులకు ప్రస్తుతం గ్రామం ఎలా ఉంది మూడేళ్ల తర్వాత గ్రామం ఎలా ఉండాలి మూడేళ్లలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోవాలి అనే విషయంపై కార్యాచరణ ఇవ్వాలన్నారు. వాటి అమలును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు సీఎం కేసీఆర్.
గ్రామాల్లో చెట్లు పెంచడం, నర్సరీలు ఏర్పాటు చేయడం, స్మశాన వాటిక నిర్మించడం, డంప్ యార్డు ఏర్పాటు, పన్నులు వసూలు చేయడం వంటి వాటిపై చార్ట్ రూపొందించాలన్నారు. పంచాయతీ ఎన్నికలపై కోర్టు తీర్పు వచ్చిన వెంటనే నిర్వహించాలని సీఎం నిర్ణయించారు.