పవన్ కు ఓనమాలు రావా..తెలియదా..?

Update: 2017-12-12 09:20 GMT

జనసేన అధినేత సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు రాజకీయ ఓనమాలు రావా.. తెలియదా అంటే సమాధానం చెప్పలేని ప్రశ్న.. గత నాలుగు రోజులుగా పవన్ ఆంధ్రప్రదేశ్ లో సుడిగాలి పర్యటన చేస్తూ ప్రజాసమస్యలు వింటూ , వాటిపై పోరాటం చేస్తానంటున్నారు.. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆచరణపై మాత్రం ఎంతవరకు  దృష్టిపెడతారో సాక్షాత్తు జనసేన కార్యకర్తలకే తెలియని పరిస్థితి..  రాష్ట్రానికి సంజీవని లా భావించే ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ , అతిముఖ్యమైన పోలవరం నిర్మాణం వంటి కేంద్ర ప్రభుత్వ హామీలపై మాట్లాడిన పవన్ ప్రశ్నించే దిశగా అడుగులు పడుతున్నాయా అంటే లేదనే చెప్పాలి.. మొన్నటికి మొన్న పోలవరం నిర్మాణాన్ని పరిశీలించిన పవన్ నిర్మాణంపై శ్వేతపత్రాన్ని విడుదల చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరారు.. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి చెప్పాల్సిందంతా అసెంబ్లీలోనే చెప్పేశానన్నారు.  ఇక అంతే..ప్రశ్నించే పవన్ నోటికి తాళం  పడిందెందుకో?అంటే రాష్ట్ర ప్రజలకు ఈ విషయమై పూర్తి అవగాహన వచ్చిందనుకున్నారా..? లేక మరచిపోయారా..? అనే ప్రశ్న రాజకీయ విశ్లేషకులలో తలెత్తుతోంది.. 

నిన్నటికి నిన్న విజయవాడలో పర్యటించిన పవన్ ఫాతిమా కాలేజీ విద్యార్థుల గోడు విని వారికి న్యాయం చేస్తానన్నారు బాగానే ఉంది.  ఫాతిమా కాలేజీ సమస్య చాలా పాతది.. కొన్ని నెలలుగా నానుతోంది.. అటు కేంద్రం స్పందించదు.. ఇటు రాష్ట్రం పట్టించుకోదు.. ఇంతలా నలుగుతున్న ఈ సమస్యను కూడా ఇంకా దగ్గరగా చూస్తే.. అధికారపక్షం వివక్ష కూడా కనిపిస్తాయి. విద్యార్ధుల గోడును గంట సేపు విని మంత్రి కామినేనితో మాట్లాడి సమస్య తీరుస్తానని హామీ ఇచ్చారు పవన్. అసలు గొడవ వచ్చిందే అయన వల్ల అని  విద్యార్ధులు మొత్తుకుంటుంటే.. మళ్లీ అదే మంత్రితో మాట్లాడి తగిన న్యాయం చేస్తాననడంలో కొత్తేముంది?.. సమస్యలపై పోరాడతానంటూ రోడ్డెక్కిన పవన్ కి సమస్యల స్వరూప, స్వభావాలు.. వాటి తీవ్రత గురించి తెలియవనుకోవాలా? హోదా ఇవ్వలేకపోయారు.. కనీసం ఫాతిమా విద్యార్ధులకు న్యాయం చేయండంటూ ఓ స్టేట్ మెంట్ అలవోకగా ఇచ్చి పారేశారు..అంటే 5 కోట్ల ప్రజల భవిషత్తును 50 మంది విద్యార్థుల సమస్యతో పోల్చి చూస్తారా..?ఫాతిమా కాలేజీ విద్యార్ధులది సమస్యే.. వారికి జరిగినది అన్యాయమే.. కానీ దానికీ హోదాకీ లింకేంటి? అది కాకపోతే ఇదైనా చేయండంటూ.. రెంటినీ ఓ గాటన కట్టడంలో లాజిక్కేంటో ఆయనకే తెలియాలి.

అప్పుడెప్పుడో హోదా కోసం రా.. కదలి రా అన్న నినాదం ఏమైంది.. అధికార టీడీపీ ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం.. దీనిపై అనవసర రాద్ధాంతం చెయ్యద్దని తేల్చేసింది.. అసలు హోదా సమస్యపై పోరాడాల్సింది.. పోరాడతానన్నదీ పవనే.. అందుకు విశాఖ బీచే సాక్ష్యం.. .. పవన్ మాటలు చూస్తుంటే.. అటు బిజెపిని, ఇటు టిడిపిని రెండు కళ్లుగా కాపాడుకుంటూ అడుగులేస్తున్నట్లుంది.. ప్రశ్నించాల్సిన వారినే ప్రశ్నించడం మానేసి రోడెక్కి రోడ్ షోలు చేయడమెందుకు? ప్రశ్నించడం మానేయచ్చుగా? పవర్ లో ఉన్న వారిని వదిలేసి..  పక్క పార్టీలోకి జంప్ అయిపోతున్న ఎమ్మెల్యేలను కాపాడుకోలేని పార్టీపై పంచ్ లెందుకు? పవన్ లక్ష్యమేంటి? అసలు విపక్షాన్ని టార్గెట్ చేయడమేనా? దానికి రోడ్ షోలెందుకు? ప్రెస్ మీట్ లతో సరిపెట్టేయచ్చుగా? ఓదార్పు యాత్రలను ఎద్దేవా చేసిన వారే అలాంటి యాత్రలను చేపట్టడాన్ని ఏమనుకోవాలి?  సిఎం అయితేనే  సమస్యలు పరిష్కరిస్తాననడం ఎంతవరకూ రైట్ అని ప్రశ్నించారు జన సేనాని..మన రాజకీయ వ్యవస్థలో పవర్ లో ఉన్నవాడే ఏమైనా చేయగలడు? ప్రతిపక్షంలో ఉన్న వాడు ప్రశ్నించగలడు.. ఇంకా కావాలంటే ధర్నాలు, దీక్షలు, ఆందోళనలతో అట్టుడికించగలడు.. ఏమాట కామాటే.. ఎలాంటి అవినీతి ఆరోపణలున్నా.. వైసిపి అదే పని చేస్తోంది. కానీ ఆ పోరాటాలను నీరు గారుస్తున్న అధికార పార్టీకే పవన్ కూడా మద్దతు పలుకుతున్నారా?  ఈ విషయంలో తమిళ నటుడు పందెంకోడి విశాల్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోండని పవన్ కు సూచిస్తున్నారు..

రాష్ట్రంలో ప్రశ్నించడానికి లక్ష సమస్యలుండగా పొద్దున్న లేస్తే.. ప్రతిపక్షం వైసీపీని లక్షకోట్ల అవినీతి అంటారు.. జగన్ లక్షకోట్లు దోచుకున్నారో లేదో డిసైడ్ చెయ్యాల్సింది పవన్ కాదు, కోర్టులంటున్నారు వైసిపి అభిమానులు... ఇంతకన్నా ప్రజలకు ఎప్పటికప్పుడు నిజా నిజాలు చెప్పే ఉండవల్లి అరుణ కుమార్ ను చూసైనా పవన్ తన ప్రసంగాల తీరును మార్చుకోవాలంటున్నారు.. ఇకనైనా మీటింగులలో క్రాఫ్ పైకి తోసుకుంటూ,  నేలకు చూస్తూ వేదాంతం మాట్లాడకుండా కనీసం ప్రశ్నించే నేతగా నైనా నిజాయితీగా, పక్షపాతం లేకుండా పనిచేయాలన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

Similar News