ఉత్తరాంధ్రలో పర్యటించి అక్కడి ప్రజల్లో జోష్ నింపిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఇప్పుడు గోదావరి జిల్లాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం కంటికి శస్త్ర చికిత్స చేయించుకోవడంతో రెస్ట్‌లో ఉన్న పవన్ ఈ నెల 22 నుంచి తన యాత్రను తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభించబోతున్నారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తన రాజకీయ పోరాట యాత్రను తిరిగి ప్రారంభించపోతున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలో యాత్రను పూర్తి చేసిన పవన్ నెక్ట్ గోదావరి జిల్లాల్లో యాత్ర కొనసాగించనున్నారు.
దాదాపు 2 నెలలుగా కంటి సమస్యతో బాధపడుతున్న పవన్ హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో వైద్యుల సూచనలతో శస్త్రచికిత్స చేయించుకున్నారు. దీంతో బస్సు యాత్రకు బ్రేక్ పడింది. ఈ నెల 22నుంచి యాత్రను మళ్లీ ప్రారంభించేందుకు పవన్ సిద్ధమయ్యారు. అయితే, ప్రజాసంకల్ప యాత్ర పేరుతో వైసీపీ అధినేత జగన్ ఓ వైపు గోదావరి జిల్లాల్లో పాదయాత్ర కొనసాగిస్తుంటే ఇప్పుడు జనసేన అధినేత కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మొన్నటిదాకా టీడీపీ వర్సెస్ వైసీపీగా ఉన్న ఉభయగోదావరి జిల్లాల్లో పవన్ రాకతో రాజకీయ సమీకరణాల్లో ఎలాంటి మార్పులొస్తాయోనన్న ఆసక్తి విశ్లేషకుల్లో నెలకొంది. మరి జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సొంత సామాజికవర్గం బలంగా ఉన్న గోదావరి జిల్లాల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారో చూడాలి.