చంద్రబాబునాయుడు పెద్ద మోసగాడంటూ జనసేనాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2014 ఎన్నికలకు ముందు టీడీపీతో కుదిరిన ఒప్పందాన్ని బయటపెట్టిన పవన్ కల్యాణ్ చంద్రబాబు తనను ఘోరంగా మోసం చేశారని గుర్తుచేశారు. గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతిస్తే తనకు రాజ్యసభ సీటు ఇస్తానని ఆశ పెట్టి తర్వాత మోసం చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
2012లోనే రాజకీయాలపై మాట్లాడేందుకు చంద్రబాబును కలిసినట్లు చెప్పిన పవన్ కల్యాణ్ అప్పుడే రాజకీయ పార్టీ పెట్టి 2014లో 60 నుంచి 70 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు బాబుతో చెప్పానన్నారు. అయితే అలాంటి ఆలోచన చేయవద్దన్న చంద్రబాబు ఓట్లు చీలిపోతాయని, తనకు మద్దతిస్తే రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పారని, అదే విషయాన్ని రెండు పత్రికలకు చెప్పి రాయించారని గుర్తుచేశారు. అప్పుడే చంద్రబాబుపైనా, టీడీపీపైనా నమ్మకం పోయిందన్నారు. దాంతో చంద్రబాబుకి దండం పెట్టి ఆ తర్వాత నరేంద్రమోడీని కలిసినట్లు చెప్పారు. అప్పట్లో తాను 60-70 సీట్లలో పోటీచేసి ఉంటే ఇప్పుడు అసెంబ్లీలో ప్రజాసమస్యలపై పోరాడే అవకాశం తనకు ఉండేదన్నారు.
చంద్రబాబు తన కుమారుడు లోకేష్ ఒక్కరికే ఉద్యోగం ఇస్తే సరిపోతుందా?.... రాష్ట్రంలో అందరికీ ఉపాధి కల్పించాల్సిన అవసరం లేదా అంటూ పవన్ నిలదీశారు. భవిష్యత్‌లో లోకేష్ ముఖ్యమంత్రి అయితే తనకేమీ అభ్యంతరం లేదన్న పవన్ కానీ రాష్ట్రం ఏమవుతుందోననే భయం కలుగుతోందన్నారు. తనకు రాజకీయ అనుభవం లేదంటోన్న నాయకులందరూ రాజకీయ అనుభవంతోనే పుట్టారా అంటూ ప్రశ్నించారు. తనకు కులపిచ్చి ఉండుంటే గత ఎన్నికల్లో అసలు టీడీపీకి మద్దతిచ్చేవాడినే కాదన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా చివరికి జనసేన అధికారం సాధించుకుంటుందని పవన్ ధీమా వ్యక్తంచేశారు.