తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందా...లేదా..ఇక్కడా అక్కడా అభ్యర్థులను బరిలోకి దింపుతానన్న పవన్, ఎన్నికల తేదీలూ వచ్చినా ఎందుకు యాక్టివ్‌గా లేరు...తెలంగాణలో అభ్యర్థులను ప్రకటించకపోతే, ఇక తమదారి తాము చూసుకుంటామన్న ఆశావహుల అల్టిమేటంపై పవన్ ఆలోచిస్తున్నదేంటి...తెలంగాణలో పోటీపై అసలు జనసేనాని అంచనాలేంటి? రాష్ట్ర విభజన పరిణామాల నేపథ్యంలో, జనసేన పార్టీని స్థాపించారు పవన్ కల్యాణ్. 2014 ఎన్నికల ప్రచారంలో, టీడీపీ, బీజేపీలకు మద్దతుగా ప్రచారం చేశారు. దీంతో ఏపి రాజకీయాలకు మాత్రమే పవన్ పరిమితమవుతారని అందరూ భావించారు. కాని కొంతకాలం క్రితం తెలంగాణాలోనూ జనసేన పోటీ చేస్తుందని అట్టహాసంగా ప్రకటించారు పవన్.
అంతేకాకుండా తెలంగాణా నుండే తన రాజకీయ యాత్ర ప్రారంభించారు. అందులో భాగంగా కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుని రాజకీయ యాత్ర ప్రారంభించారు పవన్. ఎక్కడికక్కడ యూత్‌తో సమావేశమవుతూ, వారిలో ఉత్సాహం నింపారు. ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించిన పవన్, పార్టీకి బలమున్న చోట పోటీ చేస్తామని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. అంతేకాకుండా తెలంగాణలో పార్టీని బలపరచాలని నేతలతో పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. దీంతో తెలంగాణాలో జనసేన పోటీ చేస్తుందంటూ నేతలు ఊహించారు.
అయితే తెలంగాణ అసెంబ్లీ రద్దు అయినప్పటి నుంచీ, జనసేన స్టాండ్ ఏంటి అనే అంశంపై తెలంగాణ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో పోటిపై, పవన్ ఎప్పుడు నిర్ణయం ప్రకటిస్తారా అని వెయిట్ చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రోజు, విజయవాడ పార్టీ కార్యాలయంలో జరిగిన తూర్పుగోదావరి జిల్లా నేతల మీటింగ్‌లో ఉన్న పవన్‌కు, ఎన్నికల్లో పోటీ చెయ్యాలంటూ ఫ్లకార్డ్స్ ప్రదర్శించారు కార్యకర్తలు. పవన్ తన నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. జనసేన ఎన్నికల్లో పోటీ చేస్తే తామూ పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నామని, లేని పక్షంలో, తమ దారి తాము చూసుకుంటామని, పార్టీలో కీలక నేతలకు చెప్పి అక్కడి నుంచి తెలంగాణ నేతలు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, పవన్ మాత్రం తెలంగాణాలో పోటీ చేసేందుకు అంతగా ఆసక్తిగా లేరని తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెట్టడంతో తెలంగాణా ఎన్నికలకు దూరంగా ఉండాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని నేతల ముందు ప్రస్తావించారు పవన్. విజయవాడ పార్టీ కార్యాలయంలో కవాతు ఏర్పాట్లపై నేతలతో జరిగిన మీటింగ్‌లో, ఈ మేరకు జనసేనాని సంకేతాలు ఇచ్చారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పవన్‌కు ఆసక్తి లేకపోవడం వెనక చాలా కారణాలున్నాయి. వ్యూహాత్మక ఎత్తుగడలున్నాయని తెలుస్తోంది. ఏపిలోనే పార్టీ నిర్మాణం పూర్తిగా జరగలేదు. ఇక తెలంగాణాలో పార్టీ నిర్మాణం పనులే ప్రారంభించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణాలో పోటీ చేసే పరిస్థితి లేదని జనసేన కీలక నేతలు చెబుతున్నారు. బలం లేనప్పుడు అనవసరంగా కొన్ని స్థానాల్లో పోటి చేయడం కంటే, పోటీకి దూరంగా ఉండటమే మేలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఏపీలో కీలకంగా మారాలని భావిస్తున్న పవన్, తెలంగాణాలో పోటీ, సమయం వృధా అనుకుంటున్నారు. ఏపిపై ఫోకస్ తగ్గే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అంతేకాదు, ఫలితాలు తేడా వస్తే, ఆ ఎఫెక్ట్ ఏపీలోనూ పడుతుందని మథనపడుతున్నారు. తెలంగాణలోనే ఉనికి కాపాడుకోలేని జనసేన, ఇక ఏపీలో ఏం చేస్తుందని ప్రత్యర్థులు విమర్శలు చేసే ఛాన్స్ ఉంది. అందుకే బలంలేని చోట పోటీ చేసి, బలమున్న ఏపీలో పలుచనకావడం ఎందుకని పవన్ ఆలోచిస్తున్నారు.
మెత్తానికి తెలంగాణాలో జనసేన పోటీకి దూరంగానే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నెల 16న తెలంగాణా నేతలతో పవన్ సమావేశం అవుతారని తెలుస్తోంది. ఈ మీటింగ్‌లో నేతలతో చర్చించి తెలంగాణాలో పోటీ చేస్తారా లేదా అనేది అధికారికంగా ప్రకటించబోతున్నారు జనసేన అధినేత.