మోడీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల కూటమి...కరుణానిధి స్మారక సభ సాక్షిగా పరిణామాలు

Update: 2018-09-01 05:46 GMT

మోడీని ఢీకొనడానికి ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయా? హక్కుల నేతలపై దాడులు ఎమర్జెన్సీని తలపిస్తున్నాయంటున్న  ప్రాంతీయ పార్టీల నేతలు సార్వత్రిక ఎన్నికలలో మోడీని ఓడించడానికి జట్టు కడుతున్నారా? కరుణానిధి స్మారక సభ కాస్తా మోడీ వ్యతిరేక సభగా మారిపోయిందా?

తమిళనాడులో బిజెపి వ్యతిరేక శక్తులు ఏకమవుతున్నాయా? కరుణానిధి స్మారక సభ అందుకు వేదికగా మారిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని మట్టి కరిపించా ల్సిందేనంటూ బిజేపియేతర పార్టీలన్నీ శపధం పట్టడంతో దేశ రాజకీయాలు కొత్త టర్న్ తీసుకున్నాయి. కరుణానిధి స్మారక సభ కాస్తా బిజెపి వ్యతిరేక శక్తుల వేదికగా మారిపోయింది. సమావేశానికి వచ్చిన ఇతర పార్టీల నేతలు మోడీ సర్కార్ పైనే గురి పెట్టారు కరుణానిధి లేని లోటును ప్రస్తావిస్తూనే మోడీకి ప్రత్యామ్నాయ వేదిక తయారు కావాలన్న ఒపీనియన్ ని అన్ని పార్టీలు వ్యక్త పరిచాయి.

ఇదే సమావేశానికి  హాజరైన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ డిఎంకేను తమ వైపు లాక్కునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాంగ్రెస్ పెత్తనాన్ని ఎదిరించినది డిఎంకే, జనసంఘ్ పార్టీలు మాత్రమేనని ఎమర్జెన్సీని బలంగా వ్యతిరేకించామనీ నితన్ గడ్కరీ ప్రస్తావించారు. కానీ గడ్కరీ స్పీచ్ ను కాంగ్రెస్ ఇతర మిత్రపక్షాలు లైట్ తీసుకున్నాయి. డిఎంకే, జన సంఘ్ పాత మిత్రత్వం గురించి ఎంతలా చెప్పినా ఇతర పార్టీలకు రుచించలేదు. బిజెపి, జేడియు నేతలు వేదిక దిగగానే మోడీ పై తీవ్రస్థాయిలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సిపిఎం, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు మండిపడ్డాయి. మహారాష్ట్ర పోలీసులు వామపక్ష భావజాల నేతలను అరెస్టు చేయడం పైనా ఇతర పార్టీలు మండిపడ్డాయి . దేశంలో ఎమర్జెన్సీకన్నా దారుణమైన పరిస్థితులున్నాయని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ మండి పడ్డారు. దేశంలో న్యాయవ్యవస్థ, పార్లమెంటును సైతం లెక్క చేయని తనం మోడీ సర్కార్ లో ఉందని విపక్షాలు ఏకిపారేశాయి. కరుణానిధి బతికి ఉంటే ఈ తీరును తీవ్రంగా వ్యతిరేకించేవారనే అభిప్రాయం వ్యక్తమైంది. 

ఎమర్జెన్సీ నాటి పరిస్థితి ఘోరమైనదంటే ఇప్పుడు పరిస్థితి అంతకన్నా ఘోరంగా ఉన్నాయంటూ గులాం నబీ ఆరోపించారు. తమిళనాడులో పాగా వేయాలనుకుంటున్న బిజెపి ప్రయత్నాలను తిప్పి కొట్టేందుకు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నించింది. యూపిఏలో డిఎంకే చిరకాలంగా భాగస్వామి అని సోనియా గాంధీకి కరుణానిధి తండ్రి సమానుడనీ గులాం నబీ చెప్పారు. సంక్షోభ సమయాల్లో ఆయన సలహాలు కూడా సోనియా తీసుకున్నారన్నారు. కరుణానిధి గతంలో బిజెపితో పొత్తు పెట్టుకున్నా అది కేవలం వాజపేయి మొఖం చూసి మాత్రమేనన్నారు. ఇక 2019లో మోడీని ఢీ కొట్టడానికి ప్రాంతీయ పార్టీలన్నీ జట్టు కట్టాల్సిందేనని తృణమూల్ కాంగ్రెస్ అభిప్రాయపడింది. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా కూడా ఇంచు మించు ఇదే టోన్ లో మాట్లాడారు. ప్రాంతీయ పార్టీల కూటమికి స్టాలిన్ నేతృత్వం వహించాలంటూ అబ్దుల్లా సూచించారు.పాక్ ఆక్రమిత కశ్మీర్ ను వారికే వదిలేసి భారత భూభాగంలో ఉన్న కశ్మీర్ పురోభివృద్ధికి ప్రయత్నించాలన్నారు. సెక్యులరిజం, సామాజిక న్యాయానికి కట్టుబడిన వ్యక్తి కరుణానిధి అని కితాబిచ్చారు మాజీ ప్రధాని దేవేగౌడ..ఇలా కరుణానిధి స్మారక సభ మొత్తం మోడీ వ్యతిరేక సభగా మారిపోయింది. కరుణానిధి గొప్పతనం కన్నా.. మోడీ అధ్వాన్న పాలన అన్న అంశమే ప్రధానంగా వ్యక్తమైంది. సమావేశంలో పాల్గొన్న నేతలందరూ స్టాలిన్ కు మద్దతు ప్రకటించడంతో డిఎంకే అధినేత గా స్టాలిన్ కు గుర్తింపు దక్కినట్లయింది.

Similar News