ముందస్తులో చాలామంది నేతలు ముందుచూపుతో ముందుకెళుతున్నారు. ముందు మందు పార్లమెంట్ ఎన్నికల్లో టిక్కెట్ వస్తుందని తెలిసినా, ముందొచ్చిన ముందస్తులో అదృష‌్టం పరీక్షించుకుందామని అనుకుంటున్నారు. కొందరు మాజీ ఎంపీలు ఎందుకైనా మంచిదని, అసెంబ్లీ పోరులో దిగాలని ఉవ్విళ్లూరుతున్నారు. వీరి ముందస్తు ఆలోచన వెనక చాలా ముందు చూపు ఉంది. ఇంతకీ ఎవరా నేతలు?
పార్లమెంట్‌కు పోటీ చేసి ఓడిపోయిన వారు కొందరు, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తారని భావిస్తున్నవారు మరికొందరు, వీరంతా ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. ఎలాగైనా శాసన సభ బీఫాం ఇవ్వాలని, ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇలాంటి ఎమ్మెల్యే ఆశావహులంతా, కాంగ్రెస్‌లోనే ఎక్కువమంది ఉన్నారు. రేణుకా చౌదరి. కేంద్ర మాజీ మంత్రి. అసెంబ్లీ పోరులో రేణుక పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సెటిలర్లు ఎక్కువగా ఉండే హైదరాబాద్‌లోని ఏదో ఒక నియోజకవర్గంలో ఆమెను బరిలో నిలబెట్టాలని అధిష్టానం కూడా భావిస్తోందట. గ్రేటర్ లేదా ఖమ్మం అసెంబ్లీ నుంచి కూడా రేణుకా పోటీ చేయించే అవకాశముందని వార్తలొస్తున్నాయి. ఇలాంటి ఊహాగానాలకు బలం చేకూర్చేలా, ఈమధ్య ఖమ్మంలో తెగ తిరగేస్తున్నారు రేణుకా చౌదరి. అనేక ఆందోళనలు, నిరసనలు, ర్యాలీల్లో పాల్గొన్నారు.
నల్గొండ రాజకీయం అనగానే గుర్తొచ్చే పేర్లు కోమటి రెడ్డి బ్రదర్స్. కోమటిరెడ్డి బ్రదర్స్‌లో ఒకరైన, రాజగోపాల్‌రెడ్డి కూడా ఈసారి అసెంబ్లీ బాట పట్టాలని పట్టుదలగా ఉన్నారు. మునుగోడు అసెంబ్లీ స్థానంపై గురిపెట్టారు. గత ఎన్నికల్లో భువనగిరి ఎంపీ స్థానానికి పోటీచేసిన రాజగోపాల్, స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించి, ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతున్నారు. మునుగోడు ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న రాజగోపాల్, ఢిల్లీలో అధిష్టాన పెద్దలతో తనకున్న పలుకుబడిని ఉపయోగించుకుంటున్నారు. రాహుల్‌తో 15 నిమిషాలు ప్రత్యేకంగా భేటి అయిన కోమటిరెడ్డి బ్రదర్స్, నల్గొండతో పాటు మునుగోడు టికెట్‌నూ ఇవ్వాల్సిందిగా కోరినట్టు సమాచారం.
ఇక ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న మరో నేత, సర్వే సత్యనారాయణ. గత ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు సర్వే. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో వరంగల్ లోక్‌సభ నుంచి బరిలోకి దిగి, పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, దళిత ముఖ్యమంత్రి అంశం తెరపైకి వచ్చిన పక్షంలో, తాను అందుబాటులో ఉండాలనే ఆలోచనతో, అసెంబ్లీపై సర్వే గురిపెట్టారని తెలుస్తోంది. ప్రస్తుతం ఎస్సీ రిజర్వ్‌డ్ అయిన, కంటోన్మెంట్ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో ఈ సీటును తొలుత సర్వే అల్లుడు క్రిశాంక్‌కు కేటాయించి చివరి క్షణంలో మార్పు చేశారు. ఈసారి కూడా క్రిశాంక్ పేరే ఇప్పటివరకు వినిపించినా.. తాజాగా సర్వే పేరు తెరపైకి వస్తోంది. ఢిల్లీలో తనకున్న పరిచయాలతో గట్టిగా ప్రయత్నిస్తున్నారు సర్వే.
కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా, శాసన సభ పోరు కోసం ఉవ్విళ్లూరుతున్నారు. అయితే, తాను లోక్‌సభకే పోటీచేస్తానని అంటున్నా.. అధిష్టానం ఆదేశిస్తే అసెంబ్లీకి పోటీ చేసేందుకూ రెడీ ఉంటానంటున్నారు. తొలుత వేములవాడ నుంచి బరిలో ఉంటారని భావించినా.. అక్కడి నుంచి ఆది శ్రీనివాస్, కొనగాల మహేశ్ సీటు కోసం తీవ్రంగా ట్రై చేస్తున్నారు. గత ఎన్నికల్లో జహీరాబాద్ లోక్‌సభ నుంచి బరిలో ఉన్న సురేశ్ షెట్కార్ ఈసారి నారాయణ్‌ఖేడ్ అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ మహబూబాబాద్ అసెంబ్లీ స్థానం కోసం, హస్తిన లెవల్లో ట్రై చేస్తున్నారు. గత ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ నుంచి పోటీ చేసిన ఇంద్రారెడ్డి తనయుడు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి కూడా రాజేంద్రనగర్ అసెంబ్లీ సీటు కావాలంటున్నారు. ఈయనకు ఈ సీటు దాదాపు ఖరారయిందనే ప్రచారం గాంధీభవన్ వర్గాల్లో సాగుతోంది. వీరితో పాటు గతంలో ఎంపీలుగా పోటీ చేసిన మరో ముగ్గురు, నలుగురు నేతలు కూడా అసెంబ్లీ స్థానాల కోసం, తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
ఎంపీ అభ్యర్థులుగా ముద్రపడిన వీరంతా, ఎమ్మెల్యే గిరిపై గురిపెట్టడంలో వారికంటూ ఒక వ్యూహముంది. ఈసారి అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శాసనసభకు కూడా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. అసెంబ్లీకి పోటీ చేసి ఓడినా, మళ్లీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో, లోక్‌సభ బరిలో ఉండవచ్చనే ఐడియాతోనే, వీరంతా ఎమ్మెల్యే సీటు కోసం క్యూకట్టారని తెలుస్తోంది. అంటే, రెండింట్లో ఏదో ఒకటి దక్కుతుందన్నది వీరి ఆశ, ఆలోచన. అంతేకాదు టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లతో మహాకూటమి కడుతున్న నేపథ్యంలో, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ పోగుపడే అవకాశముందని కూడా వీరిని ఆ దిశగా నడిపిస్తోంది. అందుకే ఢిల్లీ స్థాయిలో తమకున్న అన్ని పరిచయాలు, పలుకుబడిని ఉపయోగిస్తున్నారు. మరి ఎవరికి బీఫాం వరిస్తుందో, ఎవరి ప్రయత్నాలు ఫలిస్తాయో చూడాలి.