మతం వర్సెస్ మానవత్వం. ఒకటి కాదు రెండు కాదు 11 ఏళ్లుగా జరుగుతున్న యుద్ధమిది. తన మతం కాని ఓ పాపను పెంచుకోవడమే అతను చేసిన తప్పా తల్లిదండ్రులు ఉన్నారో లేరో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్న అమ్మాయికి ఆశ్రయం కల్పించడం నేరమా.? మంచి మనసుతో కన్నతండ్రి కంటే ఎక్కువగా పాపను ప్రేమించి పెద్ద చేయడమే పాపాలాల్ చేసిన తప్పా అతను చేసిన మంచిపనిని అభినందించాల్సింది పోయి అవమానిస్తున్నారు. దశాబ్దకాలంగా వేధిస్తున్నారు బెదిరిస్తున్నారు తాజాగా కత్తులతో దాడులు చేసింది ఓ వర్గం. ఈ ఘటన బతికున్న ఆ కాస్త మానవత్వంపై కూడా కత్తిపోట్లు దించుతున్నారు కొందరు.
అంతరించిపోతున్న మానవ విలువలకు.. మానవత్వం అంటే ఏంటో చెప్పిన ఘటనది....మతచాందసవాదులకు చెంపదెప్పలాంటిది ఆ తండ్రీకూతుళ్ల అనుబంధం...ఆ తండ్రి పేరే పాపాలాల్. ఆ కూతురే ఫాతిమా.
2007 గోకుల్ చాట్ పేలుళ్ల తర్వాత తల్లిదండ్రుల నుంచి తప్పిపోయి ఆ పాప ఏడుస్తూ అక్కడక్కడే తిరుగుతుంటే తనకెందుకులే అని వదిలేయలేదు. అప్పుడు అక్కున చేర్చుకున్నాడంటే ఇప్పటికీ ఆ పాపను వదల్లేదు. కన్నవారున్నా పాపాలాల్ కంటే బాగా చూసుకునే వారు కాదేమో. సొంతవారి కంటే ఎక్కువ ప్రేమతో కంటికి రెప్పలా ఫాతిమాను కాపాడుకున్నాడు పాపాలాల్. పదకొండేళ్లుగా ఎన్నో కష్టనష్టాలకోర్చి పెంచి పెద్ద చేశాడు పాపాలాల్. గోకుల్ చాట్ బాంబు పేలుళ్ల ఘటన ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. కానీ అదే ఘటన మతచాందసవాదులకు కొత్త పాఠం నేర్పింది. మానవత్వానికి కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది.
పాపను పెంచుకుంటున్నప్పటి నుంచి పాపాలాల్‌కు రెండు వర్గాల నుంచి వేధింపులు తప్పడం లేదు. ఆ పాపను నువ్వెందుకు పెంచుకుంటున్నావని ఓ వర్గం బెదిరిస్తోంది. పాప పేరేందుకు మార్చావ్ అంటూ మరో వర్గం వేధిస్తోంది. ఇలా 11 ఏళ్లుగా వేధింపులను భరిస్తూ బిక్కుబిక్కుమంటూ జీవనం గడిపాడే తప్ప ఏరోజూ పాపను తన నుంచి దూరం చేసుకోలేదు. పాపే ప్రాణంగా జీవిస్తూ వస్తున్నాడు.
ఇప్పటికీ ఆ రెండు వర్గాలు పాపాలాల్‌ను టార్గెట్‌గా చేసుకున్నాయి. అమ్మాయి పెరిగి పెద్దయిన తర్వాత ప్రేమ పేరుతో ఓ వర్గం వారు ఫాతిమాను వేధించడం మొదలుపెట్టారు. ఇదేంటని నిలదీసినందుకు పాపాలాల్‌పై ఈ మధ్యే కత్తులతో దాడులకు కూడా దిగారు. ఈ దాడిలో పాపాలాల్‌కు తీవ్రగాయాలయ్యాయి. రెండు వర్గాల వేధింపులు.. బెదిరింపులతో విసిగిపోయారు పాపాలాల్ కుటుంబసభ్యులు. ఇక భరించే ఓపిక తమకు లేదని చెప్తున్నారు. మానవత్వంతో మంచిపని చేస్తే ఇలా తమను వేధిస్తున్నారని ఇప్పటికైనా తమకు పూర్తి స్థాయి రక్షణ కల్పించాలని కోరుతున్నారు.