ఆపరేషన్ లోటస్ ఎందుకు ఫెయిలైంది...మెజార్టీ లేకపోయినా, ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్న కమలం ఎలా కంగుతింది...నెంబర్ గేమ్‌లో ఎలా చతికిలపడింది...వెనక్కి తగ్గిందా...తగ్గాల్సి వచ్చిందా....బీజేపీ చేసిన ఆ ఏడు తప్పులేంటి?
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన సీట్లు 104. కాంగ్రెస్‌కు 78 స్థానాలు, జేడీఎస్‌కు 37 స్థానాలొచ్చాయి. ఇద్దరు స్వతంత్రులు. 221 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ 111 అయ్యింది. పక్కాగా తెలుస్తోంది బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ లేదని. అయినా కూడా అతిపెద్ద పార్టీగా అవతరించినందుకు, తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, కాంగ్రెస్, జేడీఎస్‌లలో కొందరు తమకు మద్దతిచ్చే అవకాశముందని, చీకట్లో బాణమేసింది. ఆ తర్వాత రకరకాల అస్త్రాలు ప్రయోగించింది.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశమివ్వాలంటూ, కర్ణాటక గవర్నర్ వాజుబాయ్‌కు లేఖ రాశారు యడ్యూరప్ప. ఎస్ఆర్ బోమ్మాయ్ కేసు స్ఫూర్తిగా, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీని, ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. బీజేపీ ఆదేశాలో, లేదంటే యడ్డీ వాదనకు కన్వీన్స్ అయ్యాడో కానీ, గవర్నర్ కూడా వంతపాడారు. యడ్యూరప్పతో ఏకంగా సీఎంగా ప్రమాణం చేయించారు. అందరూ విస్తుపోయేలా బలనిరూపణకు 15రోజుల గడువిచ్చారు. కానీ కాంగ్రెస్ సుప్రీం కోర్టు మెట్లెక్కడంతో గవర్నర్ చేత ప్రయోగించిన అస్త్రం ఫెయిలైంది. 15 రోజుల గడువు కాదు, వెంటనే ఫ్లోర్ టెస్ట్ జరపాలని ఆదేశింది. సభ విశ్వాసం పొందే, సంఖ్యాబలం లేదు కాబట్టి, యడ్డీ ముందే రాజీనామా చేయాల్సి వచ్చింది.
హంగ్ అసెంబ్లీ ఫలితాలు వెలువడిన నాటి నుంచే, కాంగ్రెస్, జేడీఎస్ సభ్యులను తమవైపు లాక్కునేందుకు సామదానదండోపాయాలు ప్రయగించింది బీజేపీ. ఎమ్మెల్యేలను కొనేందుకు గాలి బ్యాచ్‌ను రంగంలోకి దించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే బసనగౌడతో పాటు అనేక మందితో బేరసారాలు కొనసాగించారు. అయినా వాళ్లు ఒప్పుకోలేదు సరికదా, ఆడియో టేపులను మీడియాకు విడుదల చేశారు. దీంతో మరింత డ్యామేజ్ జరిగే ప్రమాదముందన్న ఆలోచనతో, అస్త్రసన్యాసం చేసింది బీజేపీ. అటు కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను బెదిరించేందుకు ఈడీని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రంగంలోకి దించిందన్న వార్తలు కలకలం రేపాయి. మాజీ మంత్రి శివకుమార్ చుట్టూ ఈడీ ఉచ్చుబిగిసేలా చేసింది. దీంతో ఆయన రెండ్రోజులు కనపడలేదు. అటు ఎమ్మెల్యే ఆనంద్ సింగ్‌నూ తమవైపు లాక్కునేందుకు చేయని ప్రయత్నం లేదు. అతన్ని సభకు రానివ్వకుండా చూడాలని, బీజేపీ ప్రయత్నించిందని కాంగ్రెస్ ఆరోపించింది. కానీ ఆఖరి నిమిషంలో అసెంబ్లీలో ప్రత్యక్షమయ్యాడు ఆనంద్ సింగ్. దండోపాయంలోనూ బీజేపీ ఫెయిల్ అయ్యిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
కాంగ్రెస్, జేడీఎస్‌లలో దాదాపు పది మంది లింగాయత్ ఎమ్మెల్యేలున్నారు. యడ్యూరప్ప కూడా లింగాయత్ కావడంతో, వారిని ఇటువైపు లాగేందుకు ఆఖరి నిమిషందాకా ట్రై చేసింది బీజేపీ. కాంగ్రెస్ లింగాయత్‌లను విభిజించే కుట్ర చేసిందని, జేడీఎస్ లింగాయత్ వ్యతిరేక పార్టీ అని నూరిపోసింది. లింగాయత్‌ల ఆధ్యాత్మిక గురువునూ వేడుకుంది. కానీ ఈ కుల అస్త్రం కూడా అట్టర్‌ప్లాప్ అయ్యింది. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ క్యాంపు రాజకీయాల్లో ఉన్నారు. ఫోన్లు బంద్, కమ్యూనికేషన్ కట్. దీంతో ఫ్యామిలీ మెంబర్స్‌కు డయల్ చేసింది బీజేపీ. యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర, ఓ ఎమ్మెల్యే భార్యకు ఫోన్ చేసి, ఎలాగైనా బీజేపీకి మద్దతిచ్చేలా ఒప్పించాలని, ధనం, మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ చేశారు. ఈ ఆడియో టేపు కూడా కాంగ్రెస్ విడుదల చేసింది.
ఇలా క్యాంపు రాజకీయాలు, ఈడీ అస్త్రాలు, కోట్లకు కోట్ల ఆఫర్లు, మంత్రి పదవుల తాయిలాలు వంటి సామదాన దండోపాయాలను ప్రయోగించిన బీజేపీ, ఆఖరి బంతికి హిట్ వికెట్ అయ్యింది. రకరకాల ప్రలోభాలతో ఏడుగురు ఎమ్మెల్యేలను తమవైపు ఆకర్షించి ఉంటే, విశ్వాసపరీక్షలో నెగ్గేది కానీ, నైతికతకోల్పోయేదన్నది విశ్లేషకుల మాట. అది వచ్చే మూడు రాష్ట్రాల ఎన్నికలు, లోక్‌సభ పోరుపైనా ప్రభావం పడుతుందని ఆందోళన పడింది. అందుకే ఇప్పటికే అప్రతిష్ట ఎక్కువైందని, ఇక కర్ణాటకం చాలని, మోడీ, అమిత్ షాల నుంచి సంకేతాలు అందడంతో, యడ్యూరప్ప పరాజాయాన్ని ఒప్పుకున్నాడు. సానుభూతి పవనాలతో జనంలోకి వెళ్లి, 2019 లోక్‌సభ ఎన్నికల్లో వీటిని ఓట్లుగా మలచుకోవాలని భావిస్తున్నారని అర్థమవుతోంది.