ఒక్క పైసా తగ్గింపుతో ఏం పండగ చేసుకుందాం!?

Update: 2018-05-31 06:03 GMT


పండగ చేస్కోండి. సంబరం జరుపుకోండి. మీకిష్టమైనది కొనుక్కోని ఎంజాయ్‌ చేయండి. ఎందుకంటే, పెట్రోల్‌ రేటు పైసా తగ్గింది....ఎంతా...పైసా. పైసా తగ్గిందండి. 84 రూపాయలు పలుకుతున్న 83 రూపాయల 34 పైసలు పలుకుతున్న లీటర్‌ పెట్రోల్‌ రేట్‌లో‌, పైసా తగ్గింది. 16 రోజులుగా మూడున్నర, నాలుగున్నర పెరిగి, ఈ నాలుగేళ్లలో దాదాపు పదకొండు రూపాయలు పెరిగితే, ఒక్క పైసా తగ్గించడమేంటని మాత్రం అడక్కండి. ఎందుకంటే జనాలంటే, ప్రభుత్వాలకు, చమురు కంపెనీలు జోక్. అందుకే పైసా తగ్గించి పండగ చేస్కోండని, పరిహాసం చేస్తున్నాయి.

వరుసగా 16రోజులుగా పెట్రో, డీజిల్‌ రేట్లు భగ్గుమంటున్నాయి. వాహనదారుల్లో ఆగ్రహం పెరుగుతోంది. విపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఎంతోకొంత పెట్రోల్ రేటు తగ్గిస్తారని సహజంగానే సామాన్యులు ఆశించారు. ప్రభుత్వం కూడా తీపికబురు చెబుతామని ఊరిస్తూ వచ్చింది. స్వీట్‌ న్యూస్ ‌ చెప్పింది...17 రోజుల పెట్రో వాతకు బ్రేక్‌ ఇచ్చింది. కానీ సామాన్యున్ని వెక్కిరించేలా రేటు తగ్గించింది. డీజిల్, పెట్రోల్‌పై ఆయిల్‌ కంపెనీలు ఎంత తగ్గించాయో తెలుసా...ఒక్కపైసా. ఓన్లీ వన్‌ పైసా. వెక్కిరించడం కాకపోతే, పుండుమీద కారం చల్లినట్టు కాకపోతే, వన్‌ పైసా తగ్గించడమేంటి. వేల కోట్లు దండుకుంటూ, చిల్లర పైసలు మొహంపై విసరడమేంటి...ఒక్కపైసాతో జనం జేబులో మిగిలేదేంటి...ఒరిగేదేంటి? 

ఆయిల్‌ కంపెనీలు ఉదయం నుంచి ఎంత పరాచికాలు ఆడాయంటే, జనాలకు ఒళ్లు మండిపోయింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, మొదట విడుదల చేసిన ప్రకటన ప్రకారం లీటరు పెట్రోలు ధర 60 పైసల చొప్పున, లీటరు డీజిల్ ధర 56 పైసల చొప్పున తగ్గింది. దీంతో కాస్త రిలీఫ్‌ అయ్యారు జనం. కానీ కొద్ది గంటల్లోనే ఈ ఉపశమనం ఆవిరైంది. తమ వెబ్‌సైట్‌లో సాంకేతిక లోపం వచ్చిందని, డీజిల్, పెట్రోలుపై లీటరుకు తగ్గింపు 60 పైసలు కాదని, కేవలం ఒక పైసా చొప్పున మాత్రమేనని నాలుక మడతేసింది. ఐవోసీ వన్‌ పైసా జోక్‌పై జనం చాలా సీరియస్‌గా రియాక్ట్‌ అవుతున్నారు. ఈ 16 రోజుల నుంచి పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. 16 రోజుల్లో లీటరు పెట్రోలు ధర దాదాపు రూ.3.80, లీటరు డీజిల్ ధర రూ.3.30 చొప్పున పెరిగింది. కానీ ఇప్పుడు తగ్గింది వన్‌ పైసా. జనాలంటే ఆయిల్‌ కంపెనీలకు, వాటిని నడిపే ప్రభుత్వాలకు ఎంత పరాచికం అయిపోతుందో, ఇంతకంటే నిదర్శనం మరోటి ఉంటుందా?

Similar News