జిల్లా కాంగ్రెస్ లో డీఎస్ గుబులు ...డీఎస్ కోసం ఆ ఇద్దరు నేతలు ఒక్కటయ్యారు
ఓడలు బళ్లవుతాయి బళ్లు ఓడలవుతాయి రాజకీయాల్లో పరిచయం అక్కర లేని ఆ కాంగ్రెస్ నేత ఇప్పుడు ఏ పార్టీలో ఉండాలో తెలీక అయోమయంలో ఉన్నారు. పిలిచి కండువా కప్పిన పార్టీ పొమ్మనలేక పొగపెడుతోంది. వెనక్కు పోదామంటే పాత పార్టీ నేతలు అడ్డుపుల్ల లేస్తున్నారు రెండు పార్టీల్లోనూ వ్యతిరేకత మూటకట్టుకున్న ఆ నేతపై కమలం కన్నేస్తుందా? ఇందూరు రాజకీయాలు ఎటు తిరుగుతాయి?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ నేతగా తిరుగులేని ఆధిపత్యం ఆయనది. వైఎస్ తో విన్నింగ్ కాంబినేషన్ అని పేరు ఆయనే రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన ఏం చెబితే అది చెల్లింది. కానీ ఇప్పుడు డీఎస్ భవిష్యత్తు అయోమయంలో పడిపోయింది. అధికార పార్టీలో డీఎస్ కు చెక్ పడటంతో ఇప్పుడు ఆయన దారెటు అన్న చర్చ జోరుగా సాగుతోంది. నిజామాబాద్ అర్బన్-రూరల్ నియోజకవర్గాలకు చెందిన డి.శ్రీనివాస్ అనుచరులు కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఒత్తిడి చేస్తుండగా ఆయన వ్యతిరేక వర్గం మాత్రం డీ.ఎస్. రాకను జీర్ణిచుకోలేకపోతుంది. డి. శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలోకి రీ ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జరిగినప్పటి నుంచి జిల్లాకు చెందిన కొందరి నేతలకు కంటిమీద కునుకు కరువైంది. నియోజకవర్గానికి చెందిన ఇద్దరు ప్రధాన ప్రత్యర్ధులు ఈ అంశంలో ఒక్కటయ్యారు.
వీరిలో ఓ నేతకు జాతీయ స్థాయిలో పట్టు ఉండగా మరొకరికి రాష్ట్ర కాంగ్రెస్ నేతల ఆశిస్సులు పుష్కలంగా ఉన్నాయి. ఈ ఇద్దరు నేతల మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనేలా విబేధాలు ఉన్నాయి. వీరిలో ఒకరు డి. శ్రీనివాస్ దగ్గర గతంలో పిఏగా పనిచేశారు. మరో నేత డి. శ్రీనివాస్ తో ఢీ అంటే ఢీ అనేలా తలపడ్డారు. డీఎస్ చివరకి గులాబీ గూటికి చేరడంతో ఆ ఇద్దరు నేతలు అర్బన్ టికెట్టుపై కన్నేశారు. వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు చేస్తూ పార్టీ అగ్రనేతలు జిల్లాకు వచ్చిన సందర్భంలో బలప్రదర్శన చేశారు. ఇలా ఉప్పు-నిప్పుగా ఉన్న ఆ నేతలు డీఎస్ విషయంలో మాత్రం ఒక్కటయ్యారు. ఆయన్ను పార్టీలోకి చేర్చుకోవద్దంటూ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. అర్బన్ టికెట్టు ఆశించే నేతలే కాదు రాష్ట్ర కాంగ్రెస్ లో ఓ కీలక నేతతో పాటూ పాటు జిల్లాకు చెందిన మరికొందరు నేతలు సైతం డిఎస్ కు వ్యతిరేకంగా పావులు కదులుతున్నారు. ఆయన వస్తే తమ రాజకీయ భవిష్యత్తు ఏంటని మధన పడిన నేతల. ఏఐసీసీ పరిశీలకునిగా జిల్లాకు వచ్చిన శ్రీనివాసన్ ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు.
పదేళ్లు పార్టీ అధ్యక్షునిగా పనిచేసి ఎందరికో కండువాలు కప్పి ఆహ్వానించిన డి. శ్రీనివాస్ కు ఇప్పుడు స్వగృహా ప్రవేశానికి అనుచరులే అడ్డు తగులుతుండటం విస్మయం కలిగిస్తోంది. డీఎస్ ను రాష్ట్ర నేతలు అడ్డుకుంటున్నా ఢిల్లీ పెద్దలు రెడ్ కార్పేట్ పరుస్తారనే ధీమాలో ఆయన అనుచరులు ఉన్నారు. ఇంతకీ డీ.ఎస్. తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతారా..? అధికారపార్టీని వీడతారా? వీడితే ఏ పార్టీ కండువా కప్పుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.