ఉద్యోగులపై వరాల జల్లు కురిపించిన తెలంగాణ సర్కార్

Update: 2018-09-02 11:37 GMT

ముందుస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగులపై వరాల జల్లు కురిపించింది. బీసీల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి భూములు, నిధులు కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే అర్చకుల పదవీ విరమణ వయసు పెంచిన సర్కార్ వారి వేతనాలు ప్రతినెల ప్రభుత్వం చెల్లించేలా నిర్ణయం తీసుకుంది.  రెడ్డి హాస్టల్‌ కోసం మరో 5 ఎకరాలు కేటాయించింది. అయితే, ముందస్తు ఎన్నికలపైనా, సంక్షేమ పథకాలపైనా కేబినెట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడంతో కేవలం ప్రగతి నివేదన సభ కోస సక్సెస్‌ కోసమే సర్కార్ హడావిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. 

ఉద్యోగులపై వరాల జల్లు కురిపించింది తెలంగాణ కేబినెట్. సీఎం కేసీఆర్ అధ్యక్షతన దాదాపు గంటన్నర సేపు జరిగిన ఈ సమావేశం అత్యంత కీలకంగా ఉంటుందనుకుంటే పూర్తి భిన్నంగా కేబినెట్ సమావేశం జరిగింది. మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావు, కడియం శ్రీహరి కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలను ప్రకటించారు. 

బీసీలకు హైదరాబాద్‌లో 70 కోట్లతో 75 ఎకరాల్లో ఆత్మగౌరవ భవనాలు నిర్మించాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. హైదరాబాద్‌లో రెడ్డి హాస్టల్ కోసం మరో 5 ఎకరాలు కేటాయింపు, గోపాల మిత్రులకు వేతనం 3,500 నుంచి రూ. 8500 పెంపుదలపై కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. అలాగే, అర్చకుల పదవీ విరమణ వయసును 58 నుంచి 65 ఏళ్లకు పెంచడంతోపాటు వారి వేతనాలను ప్రతినెలా ప్రభుత్వం చెల్లించనుందని చెప్పారు. 

మరోవైపు వైద్యారోగ్య శాఖలో  పనిచేస్తున్న 27,045 మంది ఆశా వర్కర్ల గౌరవేతనాన్ని 6వేల నుంచి 7,500కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఎన్నోఏళ్లుగా అతితక్కువ వేతనానికి పనిచేస్తున్న 9వేల మంది ఏఎన్‌ఎంలు, స్టాఫ్ నర్సులు, ఎన్‌యూహెచ్‌లకు కనీస వేతనాలు అమలు చేసేలా 11 వేల నుంచి 21వేలకు పెంచినట్టు తెలిపారు. అర్బన్‌లో కాంట్రాక్టు విధానంలో పనిచేసే డాక్టర్లు, సిబ్బంది వేతనాలు  40 వేలకు పెంచినట్లు ప్రకటించారు హరీశ్‌రావు.  

అయితే, ముందస్తు ఎన్నికలు, పలు సంక్షేమ పథకాలపై ఈ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరగగా మంత్రులు వాటి గురించి ఏం ప్రస్తావించలేదు. వీటిపై కొంగర్‌కలాన్‌ సభలో సీఎం కేసీఆర్‌ అయినా స్పష్టత ఇస్తారో, లేదో చూడాలి. 

Similar News