తొలి టర్మ్ లోనే ఎంపీగా జయదేవ్ కు అరుదైన అవకాశం

Update: 2018-07-20 11:54 GMT

అశాస్త్రీయ, అప్రజాస్వామిక విభజనతో ఆంధ్రప్రదేశ్ కు జరిగిన నష్టాన్ని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్ సాక్షిగా ఎండగట్టారు. మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన తెలుగుదేశం పార్టీ తరపున జయదేవ్ చర్చను ప్రారంభించారు. రెండు జాతీయపార్టీలు కలసి ఏపీని నిలువునా ముంచాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల వెంకన్న సాక్షిగా ప్రధాని మోదీ ఆడిన మాట తప్పారంటూ దుయ్యబట్టారు.

మోదీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చను టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ధాటిగా ప్రారంభించారు. తెలుగుతల్లిని రెండుజాతీయపార్టీలు కలసి రెండు ముక్కలు చేశాయని ఏపీ ప్రజలకు తీరని నష్టం కలిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విభజన చట్టంలోని హామీలను మోదీ ప్రభుత్వం తుంగలోకి తొక్కడాన్ని జయదేవ్ తప్పుబట్టారు. భరత్ అను నేను సినిమాను ఈసందర్భంగా ప్రస్తావించారు. ఆడినమాట తప్పిన మనిషికి గౌరవం, మనుగడ ఉండవని ఈ సందర్భంగా హెచ్చరించారు.

తిరుమల బాలాజీ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి అన్నివిధాలా సహకరిస్తామంటూ చెప్పిన మాటలను మోదీ మరచిపోయారని బీజెపీ తమను మోసం చేసిందని, వంచించిందని ఏపీ ప్రజలు గట్టిగా నమ్ముతున్నారని జయదేవ్ గుర్తు చేశారు. లోక్ సభ సభ్యుడుగా తన తొలి టర్మ్ లోనే అవిశ్వాస తీర్మానం పై చర్చను ప్రారంభించే అవకాశం రావడం తనకు లభించిన గొప్ప అదృష్టమని, ఈ అవకాశం ఇచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ఏంపీ కేశినేని నానీకి కృతజ్ఞతలు చెబుతున్నానని చెప్పారు.

కేంద్రప్రభుత్వం ప్రకటనలకు, వాస్తవాలకు పొంతనలేకుండా పోయిందని ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలోని ఓ రాష్ట్రమేనన్న వాస్తవాన్ని ఇప్పటికైనా ప్రధాని మోదీ, ఆర్ధికమంత్రి గ్రహించి విభజన హామీలను నెరవేర్చాలని ప్రత్యేక హోదా ఇచ్చితీరాలని కోరారు. విభజనతో ఆంధ్రప్రదేశ్ పలువిధాలుగా నష్టపోయిందని కనీసం బాహుబలి సినిమాకు వచ్చిన కలెక్షన్ల మొత్తం అంతైనా కేంద్రప్రభుత్వం ఇవ్వలేదని గుర్తు చేశారు. భరత్ అను నేను సినిమాతో తన ప్రసంగాన్ని ప్రారంభించిన జయదేవ్ బాహుబలి సినిమా ప్రస్తావనతో ముగించడం విశేషం. విభజనతో ఆంధ్రప్రదేశ్ కు జరిగిన నష్టాన్ని సోదాహరణగా సభ ముందుంచడంలో జయదేవ్ సఫలమయ్యారు.

Similar News