భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం మరో విడత ప్రచారానికి ముహుర్తం దాదాపుగా ఖరారైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బిజేపీకి పట్టున్న స్ధానాల్లో, ఆ పార్టీ అగ్రనేతలు ప్రచారానికి రానున్నారు. బోధన్, అర్బన్, కామారెడ్డి, ఆర్మూర్‌లలో అగ్రనేతలు తమ పార్టీ అభ్యర్ధుల తరపున ప్రచారం చేయనున్నారు. మరోవైపు కాంగ్రెస్‌లో టికెట్టు ఆశించి భంగపడ్డ నేతలపై కన్నేసిన కమలదళం నాయకులు, వాళ్లకు గాలం వేసే పనిలో పడ్డారు. ఐతే కాంగ్రెస్ లేదంటే బీజేపీ నుంచి పోటీ చేసేలా.. కాంగ్రెస్ ఆశావాహులు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. నిజామాబాద్‌లో శరవేగంగా మారుతున్న రాజకీయ పరిస్ధితులపై స్పెషల్ స్టోరి.
ఆర్మూర్, రూరల్, కామారెడ్డి నియోజకవర్గాలకు అభ్యర్ధులను ప్రకటించిన కమలం పార్టీ.. నిజామాబాద్ అర్బన్, బోధన్‌లకు అతి త్వరలో అభ్యర్ధులను అధికారికంగా ప్రకటించి, క్యాంపెయిన్‌ను హోరెత్తించాలనుకుంటోంది. తొలి విడతలో ప్రకటించిన ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, కామారెడ్డి జిల్లాల్లో అభ్యర్ధులు ప్రచారం మొదలు పెట్టారు. కామారెడ్డి అభ్యర్ధి వెంకట రమణారెడ్డికి మద్దతుగా.. నవంబర్ 1న పరిపూర్ణానంద ప్రచారం చేయనున్నారు. కామారెడ్డిలో బీజేపీ క్యాడర్ బలంగా ఉండటం, పరిపూర్ణానంద మద్దతుదారులు ఎక్కువ సంఖ్యలో అక్కడ ఉండటంతో... ఆయన అక్కడి నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు.
ఆర్మూర్ అభ్యర్ధికి మద్దతుగా, పార్టీ జాతీయ నేత రాం మాధవ్, నిజామాబాద్ అర్బన్ లో జరిగే బహిరంగ సభకు.. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రానున్నారు. బోధన్ లో బీజేపీ అభ్యర్ధి ఖరారయ్యాక యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారానికి వస్తారు. నవంబర్ మొదటి వారంలో సభలు, రోడ్ షోలు జరగనున్నాయి. అగ్రనేతల ప్రచారానికి జిల్లా నాయకత్వం సన్నాహాలు చేస్తోంది. సభలను సక్సెస్ చేసేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో మెజార్టీ సీట్లను కైవసం చేసుకునేలా ఆ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ఆర్మూర్ అభ్యర్దిగా వినయ్ రెడ్డి, రూరల్ అభ్యర్ధిగా ఆనంద్ రెడ్డి, కామారెడ్డికి వెంకటరమణారెడ్డిలను ప్రకటించిన బీజేపీ నేతలు.. మిగతా ఆరు స్ధానాల్లో మాత్రం అచితూచి వ్యవహరిస్తున్నారు. నిజామాబాద్ అర్బన్ స్ధానానికి రాష్ట్రంలోనే అత్యధిక పోటీ ఉంది. ఈ స్థానంలో ఎలాగైనా గెలుస్తామన్న ధీమాతో ఉన్న కాషాయ పార్టీ, అభ్యర్ధి ఎంపికపై హాట్‌హాట్‌గా చర్చిస్తోంది.
బోధన్‌లో ఎన్ఆర్ఐ అభ్యర్ధి విక్రం రెడ్డి, రేసులో ముందున్నారు. జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బాల్కొండలో బలమైన అభ్యర్ధులు లేకపోవడం వల్ల.. కాంగ్రెస్‌లో టికెట్టు ఆశించి భంగ పడ్డ నేతలను, పార్టీలో చేర్చుకుని టికెట్లు ఇవ్వాలనే యోచనలో ఆ పార్టీ నేతలున్నారు. ముందస్తు ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ, అగ్రనేతలను ప్రచారంలోకి దింపి.. శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని యోచిస్తోంది. మరోవైపు మిగిలిన స్ధానాల్లో బలమైన అభ్యర్ధుల కోసం అన్వేషిస్తోంది. బీజేపీ అభ్యర్ధిత్వం ఎవరికి దక్కుతుంది...కొత్త ముఖాలు తెరపైకి వస్తాయా...కాంగ్రెస్ అసంతృప్తులకు బీజేపీ టికెట్లు దక్కుతాయా అన్నది వేచి చూడాలి.