తెలంగాణ కాంగ్రెస్‌ చేతికి కొత్త అస్త్రం...కేసీఆర్, మోడీ మధ్య చీకటి ఒప్పందం

Update: 2018-07-23 07:10 GMT

ముఖ్యమంత్రి కేసీఆర్‌‌పై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించడం వెనుక ఉన్న లోగుట్టు ఏంటీ ? మోడీ ప్రశంసలే కాంగ్రెస్‌కు అస్త్రాలు మారాయా ? టీఆర్ఎస్‌, బీజేపీ మధ్య చీకటి ఒప్పందం ఉందా ? అసలు కథేంటీ ?

పార్లమెంట్ సాక్షిగా సీఎం కేసీఆర్ పై మోడీ వ్యాఖ్యలనే కాంగ్రెస్‌ పార్టీ అస్త్రాలు మలుచుకుంటోంది. పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోడీ, కేసీఆర్‌పై ప్రశంసలు చూస్తుంటే బీజేపీ, టీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం బయటపడిందన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్. కేసీఆర్‌ నరేంద్ర మోడీ ఏజెంట్ అని స్పష్టమవుతోందన్నారు. మోడీ ప్రధాని అయిన తర్వాత 7 మండలాలను ఏపీలో కలిపారని ఉత్తమ్ గుర్తు చేశారు. అసెంబ్లీ సాక్షిగా మోడీని విమర్శించవద్దని  చెప్పిన వ్యక్తి కేసీఆరేనని విమర్శించారు. 

మైనార్టీల ఓట్ల కోసమే బీజేపీతో టీఆర్ఎస్ శత్రుత్వం ఉన్నట్లు నటిస్తోందని మాజీ మంత్రి డీకే ఆరుణ ఆరోపించారు. కేంద్రం ఏం చేయలేదన్న టీఆర్ఎస్‌ నేతలు పార్లమెంట్‌లో బీజీపీకి ఎందుకు ఓటు వేయలేదని ప్రశ్నించారు.

ఉత్తమ్‌ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి శ్రీధర్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్‌తో ఒప్పందాలు చేసుకుంది మీరేనన్న ఆయన పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిని ఆ పార్టీలో తిట్టని నేతలే లేరని ఆరోపించారు. కేసీఆర్‌ను ఏ విధంగా మెచ్చుకుంటున్నారో ఉత్తమ్‌కు తెలియదని శ్రీధర్‌ రెడ్డి అన్నారు. పార్లమెంట్ సాక్షిగా మోడీ చేసిన వ్యాఖ్యలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారు. 

Similar News