తనుశ్రీ దత్తా... నానా పటేకర్. ఇప్పుడు బాలీవుడ్‌లో వీళ్లిద్దరి గురంచి చర్చ... రచ్చ... వెలుగు జిలుగుల వెనకున్న చీకటి కోణాలు ఒక్కొక్కటిగా... ఒక్కొక్కరుగా బయటికి తెస్తున్నారు నటీమణులు. కొంతకాలంగా ఆషిక్ బనాయా ఫేమ్ తను శ్రీ చేస్తున్న ఆరోపణలు... బాలీవుడ్‌ని కుదిపేస్తున్నాయి. సహనటీనటులు కొందరు హీరోయిన్‌కి సపోర్ట్ చేస్తే... మరికొందరు నానా పటేకర్‌ను సమర్థిస్తున్నారు.
ఆషిక్ బనాయా అంటూ ప్రేక్షకులను ఆకట్టుకున్న తనుశ్రీ దత్తా ఆ నిప్పును మరోసారి రగిలించారు. అందరూ పెద్దమనిషిగా భావించే నానాపాటేకర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ తను శ్రీ సంచలన ఆరోపణ చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ వివాదంపై నానాపటేకర్ స్పందించారు.
బాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు నానా పటేకర్ పదేళ్ల క్రితం తనను లైంగికంగా వేధించాడని బ్యూటీ తనుశ్రీ చేసిన ఆరోపణలు బాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. డ్యాన్స్ నేర్పుతానని తనతో అసభ్యంగా ప్రవర్తించాడని చేసిన సంచలన ఆరోపణలు ఇండస్ట్రీని ఊపేస్తోంది. హార్న్ ఓకే ప్లీజ్ సినిమా టైంలో నానా పటేకర్.. తనతో అసభ్యంగా ప్రవర్తించాడని బ్యూటీ... బాంబ్ పేల్చడంతో బాలీవుడ్ నివ్వెర పోవడంతో పాటు రోజుకో మలుపు తిరుగుతుంది.
నటి తను శ్రీ చేసిన లైంగిక ఆరోపణలపై సమాధానం చెపుతానని చెప్పిన నానా పటేకర్... వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. తనూశ్రీ ఆరోపణలను తోసిపుచ్చిన నానా పటేకర్... సోమవారం నిర్వాహించాలనుకున్న మీడియా సమావేశాన్ని రద్దు చేయడం చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై పలువురు నటులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రియాంక చోప్రా, సోనాక్షి సిన్హా, కంగనా రనౌత్, సోనమ్‌కపూర్లు సపోర్ట్‌గా నిలవగా... తాజాగా కేంద్రమంత్రి మేనకా గాంధీ మద్దతు పలికారు. మన దేశంలో కూడా 'మీటూ' ఉద్యమం ప్రారంభం కావాలన్నారు.
నానా పటేకర్‌పై తను శ్రీ చేస్తున్న ఆరోపణలకు మిశ్రమ స్పందన లభిస్తోంది. ఇన్నాళ్లూ మచ్చలేని వ్యక్తిగా పరిశ్రమలో గొప్పస్థానం సంపాదించుకున్న నానాపటేకర్‌పై విమర్శలు చేయడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నానాపటేకర్ అలాంటి వ్యక్తి కాదని... అలాంటిదేమైనా ఉంటే.. అప్పుడే ప్రస్తావించుంటే బాగుండేదని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.