టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, బిలియర్డ్స్ ప్లేయర్ పంకజ్ అద్వానీలు పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో ధోనితో పాటు బిలియర్డ్స్ చాంపియన్ పంకజ్ అద్వానీ ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నారు.
ఈ కార్యక్రమానికి ధోని కుటుంబ సమేతంగా హాజరయ్యారు. లెఫ్టినెంట్ కల్నల్ హోదా కలిగిన ధోని ఆర్మీ దుస్తుల్లోనే కవాతు చేస్తూ రాష్ట్రపతి దగ్గరకు వెళ్లి మరీ అవార్డు స్వీకరించారు. ఇక ధోని అవార్డు అందుకుంటుండగా అతని భార్య సాక్షిసింగ్ నవ్వుతూ సంతోషం వ్యక్తం చేసారు.
భారత క్రికెట్‌కు ధోని చేసిన సేవలకు గాను ఇంతకముందే భారత ప్రభుత్వం పద్మ శ్రీతో సత్కరించింది. ఇప్పుడు దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్‌తో సత్కరించింది. ధోని జీవితంలో ఈ రోజు(ఏప్రిల్ 2)కు ఎంతో ప్రత్యేకత ఉంది. సరిగ్గా ఏడేళ్ల కిందట ఇదే రోజున టీమిండియాకు ధోని వరల్డ్‌కప్ అందించాడు.
దీంతో ఏప్రిల్ 2 ధోనికి అతని అభిమానులకు ఓ ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోయింది. భారత్‌కు రెండు వరల్డ్ కప్‌లను అందించిన ఏకైక కెప్టెన్‌గా ధోనికి పేరుంది. ధోనితో పాటు బిలియర్డ్స్‌లో 18సార్లు వరల్డ్ చాంపియన్ అయిన పంకజ్ అద్వానీకి కూడా పద్మభూషణ్ స్వీకరించాడు.
రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఈ ఏడాది 84 మందిని పద్మఅవార్డులు వరించాయి. ఇందులో ముగ్గురికి పద్మవిభూషణ్, తొమ్మిది మందిని పద్మభూషణ్, 72 మందిని పద్మశ్రీ అవార్డులతో సత్కరించారు.
పద్మభూషణ్ అవార్డు అందుకున్న 11వ భారత క్రికెట్ మహేంద్ర సింగ్ ధోని. 2013లో మొట్టమొదటిసారి ఈ అవార్డుని రాహుల్ ద్రవిడ్ అందుకున్నాడు. 2014లో టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోని ప్రస్తుతం పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు.