ఫుల్లుగా తాగారు పోలీసులని కూడా చూడకుండా చితక్కొట్టారు రాళ్లతో దాడి చేశారు తలలు పగిలేలా కుమ్మేశారు ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు మొత్తంగా పోలీస్‌స్టేషన్‌ను చిందరవందర చేశారు. నెల్లూరు జిల్లా రాపూర్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం రాత్రి జరిగిన ఘటన కలకలం సృష్టించింది. విచారణ పేరుతో హింసకు గురిచేశారనే ఆరోపణతో దుండగులు ఎస్సై, కానిస్టేబుళ్లను ఇష్టానుసారం కొట్టారు.
నెల్లూరు జిల్లా రాపూర్ పోలీస్‌స్టేషన్ రణరంగంగా మారింది. ఆర్థిక లావాదేవీల కేసులో జోసఫ్ అనే వ్యక్తితో పాటు నిందితులను రాపూర్ పోలీసులు స్టేషన్‌కు పిలిపించి విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఫిర్యాదుదారుడు జోసెఫ్, నిందితుల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుండగానే మద్యం సేవించిన కొందరు దుండగులు స్టేషన్లోకి చొరబడ్డారు. మాపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ జోసెఫ్‌పైకి దూసుకెళ్లారు. అయితే వీరిని అడ్డుకోబోయిన ఎస్ఐ లక్ష్మణరావుతో పాటు కానిస్టేబుళ్లు సురేష్, రమేష్‌పై దుండగులు దాడి చేశారు. తీవ్రంగా కొట్టారు. స్టేషన్‌లో ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఈ దాడిలో వీరికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో బాధితులను రాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అయితే దుండగులు వచ్చిన సమయంలో స్టేషన్‌లో సిబ్బంది కూడా తక్కువగా ఉండటంతో దాడి చేస్తున్న వారిని అడ్డుకోలేకపోయినట్లు తెలుస్తోంది. వారం క్రితం కావలి పరిధిలోని కొత్త సత్రం దగ్గర రూరల్ ఎస్ఐ పుల్లారావు, మరో ముగ్గురు కానిస్టేబుల్స్‌పై దాడి ఘటన మరువకముందే రాపూరులో ఏకంగా స్టేషన్లో పోలీసులను కొట్టడాన్ని ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ రాంబాబు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వెంకటగిరి నుంచి రాపూర్‌కు ప్రత్యేక బలగాలను రప్పిస్తున్నారు.
పోలీస్ స్టేషన్, పోలీసులపై దాడి ఘటనపై జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ సీరియస్ అయ్యారు. దుండగుల దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్సై లక్ష్మణరావు, కానిస్టేబుళ్లు సురేష్, రమేష్‌ను ఆయన పరామర్శించారు. తర్వాత పోలీస్ స్టేషన్‌కు చేరుకొని అక్కడి పరిస్థితులు గమనించారు. జరిగిన దాడికి సంబంధించి వివరాలు ఆరా తీశారు. రాపూరు పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి పోలీసులను గాయపరిచిన దుండగులపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు ఎస్పీ రామకృష్ణ. ఇప్పటికే దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేశామన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీసుపై దాడి ఘటనను హేయమైన చర్యగా అభివర్ణించారు ఎస్పీ. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చర్యలు చేపడతామన్నారు.