ఎన్నికల వేళ వలసలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత సురేష్ రెడ్డి హస్తం వీడి, కారెక్కగా, మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ సహా పలువురు నాయకులు హస్తం గూటికి చేరారు. సురేష్ రెడ్డి చేరిక సమయంలో, కేటీఆర్ చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఆపద్ధర్మ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సురేష్ రెడ్డి చేరిక సందర్భంగా, ప్రగతిభవన్ ప్రాంగణంలో సభ జరిగింది. సురేష్‌తో పాటు మాజీమంత్రి నేరెళ్ల ఆంజనేయులు, ఉప్పల్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ బండారి లక్ష్మారెడ్డిలను పార్టీలోకి స్వాగతించారు కేటీఆర్. గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని టీఆర్‌ఎస్‌లో చేరిన సురేష్ రెడ్డి చెప్పారు. కేటీఆర్ పనితీరుతో రాష్ట్రానికి ప్రపంచ గుర్తింపు వ చ్చిందని కొనియాడారు.
మరోవైపు టీఆర్ఎస్‌లో పలువురు నేతల చేరికల సమయంలో, కేటీఆర్ చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి. తెలంగాణకు అడ్డుపడ్డ రెండు గడ్డాలు ఏకమవుతున్నాయని, కాంగ్రెస్‌కు టీడీపీని తోక పార్టీగా మార్చిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు కేటీఆర్. రైతులపై కాల్పులు జరిపిన పార్టీలు ఒక్కటయ్యాయని అన్నారు. అమరావతి, ఢిల్లీ దిక్కు చూద్దామా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. గడ్డం పెంచుకున్నోళ్లంతా గబ్బర్ సింగ్ అవుతారా అని ప్రశ్నించారు. అటు కాంగ్రెస్‌లోనూ వలసలు జోరందుకున్నాయి. పలువురు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అనిరుథ్ రెడ్డి, తాండూరు నియోజకవర్గానికి చెందిన పైలెట్ రోహిత్ రెడ్డి, మల్కాజ్ గిరి మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ రెడ్డి గాంధీభవన్లో పీసీసీ చీఫ్ ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. రానున్నరోజుల్లో, మరింతమంది నాయకులు పార్టీలు మారతారని తెలుస్తోంది. టీఆర్ఎస్‌లో పెండింగ్‌లో ఉన్న 14 మంది పేర్లు ప్రకటించిన తర్వాత, అలాగే మహాకూటమి అభ్యర్థుల లిస్టు బయటికొచ్చిన తర్వాత అసమ్మతి నాయకులు కండువాలు మార్చే అవకాశముంది.