దేశంలో తీవ్రమవుతున్న మీ టూ వ్యవహారం కోర్టు కెక్కింది. తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళా జర్నలిస్ట్ పై కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ పరువు నష్టం కేసు వేశారు. రచయిత్రి వింటానందాపై బాలీవుడ్ నటుడు అలోక్‌నాథ్ దావా వేశారు. మరికొందరు ప్రముఖులు తాము చేసిన తప్పును చింతిస్తూ క్షమాపణలు చెబుతున్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్న కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ ఎదురుదాడికి దిగారు. తనపై ఆరోపణలు చేసిన మహిళా జర్నలిస్ట్ ప్రియారమణిపై నేరపూరిత పరువునష్టం దావా వేశారు. ఢిల్లీలోని పటియాలాహౌస్‌కోర్టులో ఎంజే అక్బర్ తరఫున కరంజవాలా అండ్ కో కేసు వేసింది.
గతంలో పలు పత్రికలకు ఎడిటర్ గానున్న ఎంజే అక్బర్ తమను లైంగింకంగా వేధించినట్లు 12 మంది మహిళా జర్నలిస్టులు ఆరోపించారు. తనపై మొదట ఆరోపణాస్త్రాలు సంధించిన ప్రియారమణిపై మాత్రమే ఎంజే అక్బర్ క్రిమినల్ పరువునష్టం దావా వేశారు. కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ వేసిన దావాతో బెదిరిపోనని జర్నలిస్టు ప్రియా రమణి స్పష్టం చేశారు. తనపై లైంగికదాడి ఆరోపణలు చేసిన రచయిత్రి, నిర్మాత వింటానందాపై సినీ నటుడు అలోక్‌నాథ్ పరువునష్టం దావా వేశారు. పరువునష్టం కింద తనకు ఒక రూపాయి నష్టపరిహారం చెల్లించాలని, తనకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అలోక్ నాథ్ నోటీసులను న్యాయపరంగానే సవాల్ చేస్తామని వింటానందా స్పష్టంచేశారు.
2006లో ఓ షూటింగ్ సమయంలో మద్యం తాగాలని ఒత్తిడి చేయడంతోపాటు, ఫోన్లో అశ్లీల చిత్రాలు చూపబోయారని అసిస్టెంట్ డైరెక్టర్ నమిత ప్రకాశ్ తనపై చేసిన ఆరోపణలకు బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ శ్యామ్‌కౌశల్ క్షమాపణ చెప్పారు. ఒకవేళ పొరపాటున ఎవరినైనా నొప్పిస్తే, అందుకు నా క్షమాపణలు అని శ్యామ్ తెలిపారు. ఓ జర్నలిస్టుకు వాట్సాప్‌లో అసభ్యకరసందేశాలు పంపి, క్షమాపణ చెప్పిన రచయిత చేతన్‌భగత్.. రచయిత్రి ఇరా త్రివే ది చేసిన ఆరోపణలను మాత్రం కొట్టివేశారు. 2013లో ఇరా తనకు పంపిన ఓ ఈ-మెయిల్‌ను బయటపెట్టారు. మెయిల్ చివరలో నిన్ను మిస్సవుతున్నాను. నీకు నా ముద్దులు అని ఉంది. ఎవరు ఎవరికి ముద్దు పెట్టారో ఇప్పటికైనా గుర్తించండి చేతన్‌భగత్ అన్నారు.