అటు ఉల్లి, ఇటు టమాట, మొన్న పసుపు, మిర్చి, ఎర్రజొన్న ఇలా చెప్పుకుంటూపోతే, పొలాలనన్నీ హలాలదున్నీ ఇలాతలంలో హేమం పిండగ, జగానికంతా సౌఖ్యం నిండగ విరామ మెరుగక పరిశ్రమించే, కర్షకుల కన్నీటి వ్యథలు అన్నీఇన్నీ కావు. పంటకు కనీస గిట్టుబాటు రాక, రైతన్నలు తమ పంటలను రోడ్డుపాలు చేయాల్సిన నిస్సహాయత పరిస్థితి ఏర్పడినా, మన పాలకులకు చీమకుట్టినట్టయినా లేదు. కానీ అమెరికాతో పాటు పలు దేశాల నుంచి మన ఏలికలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఉల్లి, టమోటానే కాదు, మిగతా పంటల పరిస్థితీ అలాగే ఉంది. పత్తి, పసుపు, మిరప, వేరుశెనగ, ఎర్రజొన్న, మొక్కజొన్న, వరి, ఇలా చెప్పుకుంటూపోతే, ఏ పంట పండించినా, రైతుల కంట వస్తోంది కన్నీరే. ఆదుకోవాల్సిన పాలకులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్ట వ్యవహరిస్తున్నారు. మన ఎగుమతులకు సుస్థిర మార్కెట్‌ను కల్పించడంలో పాలకుల వైఫల్యం ప్రతి ఏడాది కళ్లకు కడుతూనే ఉంది. వైఫల్యానికి కారణంగా దేశీయ ఎగుమతి, దిగుమతి పాలసీని తప్పుపడుతుంటారు.
అదే సమయంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ప్రవేశపెడతామని ప్రభుత్వం చేస్తున్న వాగ్దానం రైతులను నష్టాల బారినుంచి గట్టెక్కించడంలో విఫలమయింది. వాస్తవానికి ఆపరేషన్ ఫ్లడ్ విధానాలకు అనుగుణంగా ఆపరేషన్ గ్రీన్‌ని ప్రారంభించినప్పుడు టమాటా, ఉల్లి, బంగాళాదుంప అనే మూడు కీలక పంటల విషయంలో మార్కెట్ జోక్యానికి వీలుకల్పించాలని తీర్మానించారు. ధరలు పెరిగే అవకాశముందని, వార్తల రూపంలో ఉన్నప్పుడే ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. కానీ పాలు వంటి అతిత్వరగా పాడైపోయే ఉత్పత్తి కోసం, సమర్థవంతమైన సహకార వ్యవస్థను దేశంలో ఏర్పర్చుకోగలిగినప్పుడు, ఇదే వ్యూహాన్ని ఇతర కీలక వ్యవసాయోత్పత్తుల విషయంలో ఎందుకు అమలు చేయలేరన్నది వ్యవసాయ నిపుణుల మదిని తొలిచేస్తున్న ప్రశ్న.
రైతులను ఆదుకోవడంలో అమెరికా నుంచి చాలా మన పాలకులు చాలా నేర్చుకోవాలి. అమెరికాలో, ధరల పతనం నుంచి రైతులను కాపాడటంలో ప్రైవేట్ మార్కెట్లు విఫలమైనప్పుడు అమెరికా వ్యవసాయ విభాగం, రైతుల వద్ద ఉన్న మిగులుపంటకు ధర కల్పించే విషయమై పదేపదే చర్యలు చేపడుతుంది. 2016లో మార్కెట్ ధరలు పతనమైనప్పుడు, రైతులనుంచి 20 మిలియన్ డాలర్ల విలువైన కోటి పది లక్షల టన్నుల చీజ్‌ని సేకరించింది. పోషకాహారంతో అల్లాడుతున్నవారికి అందించింది. ఇలాగే భారత ప్రభుత్వం కూడా ఎందుకు చేయదో అర్థంకాదు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని రైతు పంట పండిస్తాడు.. అలాంటి పంటకు ఏ కారణంగానైనా గిట్టుబాటు ధర రాకపోతే రైతు పరిస్థితి ఏంటి? అందుకే ధరల స్థిరీకరణ నిధిని పెట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.. ఏపిలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరల స్థిరీకరణ నిధికి వాగ్దానం చేసింది. కానీ ఇప్పుడా సంగతే మరిచింది. తెలంగాణలోనూ అంతే. కేంద్ర ప్రభుత్వం ఆఖరి బడ్జెట్‌లో రైతులకు చాలా చేశామని చెప్పుకుంది. అవి పట్టాలెక్కలేదనడానికి, రైతుల నిరసనే నిదర్శనం. మూడు రాష్ట్రాల్లో ఓటమే ఫలితం.
దేశంలో 70 శాతం ప్రజలు వ్యవసాయం మీదే ఆధారపడ్డారు. 125 కోట్లమంది కడుపునింపుతున్నారు. కానీ విజయ్ మాల్యా, నీరవ్ మోడీలాంటి ఎగవేతదారులకు అప్పులిచ్చే ప్రభుత్వాలు, రైతులకియ్యవు. ప్రభుత్వాలు గిట్టుబాటు ధర కల్పించవు. అయితే ఎన్నికల టైంలో ఓటు బ్యాంకుగా మలచుకునేందుకు, ఆకర్షణీయ పథకాలు మాత్రం ఎరగా వేస్తారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో రుణమాఫీ హామీలిచ్చి, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో, పార్లమెంట్ ఎన్నికల్లోనూ రుణమాఫీని అస్త్రంగా మలచుకోవాలని మోడీ సర్కారు భావిస్తోంది. అయితే ఇలాంటి తాత్కాలిక ఉపశమనాలు కాకుండా, దీర్ఘకాలిక మేలుకు ప్రయత్నించాలి పాలకులు. కనీస గిట్టుబాటు ధర, దళారుల్లేని మార్కెట్, ధరల స్థిరీకరణ నిధి, నాణ్యమైన ఎరువులు, ఇలా కనీస సౌకర్యాలు కల్పిస్తే, దేశంలో అన్నదాత తలెత్తుకు తిరుగుతాడు. ప్రాణప్రదంలాంటి పంటలను రోడ్డు పాలు చేయడు.